NTV Telugu Site icon

Off The Record: రూటు మారుస్తున్న జగన్.. పెద్ద స్కెచ్చే వేశారా..?

Ys Jagan

Ys Jagan

Off The Record: వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, హింసాత్మక ఘటనలకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేశారు మాజీ సీఎం జగన్. కార్యక్రమానికి ముందు కొద్ది సేపటి వరకు కూడా ఇది కేవలం ధర్నానే అనుకున్నారు అంతా. కానీ… మొదలయ్యాక వరుసబెట్టి వచ్చిన జాతీయ నేతలను చూసి… ఇన్ని పార్టీలు, ఇంత మంది నేతల మద్దతు ఎలా వచ్చిందన్న చర్చ మొదలైంది. వైసీపీ కూడా వీళ్లంతా వస్తారని ఎక్కడా చెప్పలేదు. ప్రచారం చేసుకోలేదు. హఠాత్తుగా ఒక్కొక్కరుగా జాతీయ, ఇతర రాష్ట్రాల నాయకులు జగన్ ధర్నా శిబిరానికి క్యూ కట్టడం చూస్తే… ఆయన రూట్ మారుస్తున్నారా? అనే సందేహం వచ్చింది పరిశీలకులకు. ఇండి కూటమిలో ఉన్న కాంగ్రెస్ మినహా… మిగతా పెద్ద పార్టీలు జగన్ కు మద్దతు పలికాయి. టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, ఆప్, వంటి డజన్‌కు పైగా పార్టీలు ధర్నాకు మద్దతుగా పలికాయి. సమాజ్‌వాది అధినేత అఖిలేష్ యాదవ్ స్వయంగా కార్యక్రమానికి వచ్చారు. మిగిలిన పార్టీలు తమ ప్రతినిధులను పంపి సంఘీభావం ప్రకటించాయి. ఇదంతా చూస్తున్న వాళ్ళకు మాత్రం జగన్ ఇండి కూటమికి దగ్గర అవుతున్నారా అన్న సందేహం కలుగుతోందట.

వాస్తవంగా… బీజేపీతో పొత్తు లేదనే కానీ… జగన్‌కు ఆ పార్టీ అగ్రనేతలతో పూర్తిగా సత్ససంబంధాలు ఉన్నాయి. ఇది బహిరంగ రహస్యం కూడా.. అందుకే ఇన్నేళ్ళు ఎన్డీఏకు ఆయన అప్రకటిత భాగస్వామి అన్న టాక్‌ నడిచింది. మరోవైపు అసలు జగన్ పార్టీ పెట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా… అలాంటిది ఆయనకు ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో ఉన్న పార్టీలు మద్దతు ఇవ్వడం చూస్తుంటే… ఏదో జరగబోతోందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. ధర్నాకు మద్దతు ఇచ్చిన తమిళనాడు బీసీ కే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమావలవన్ జగన్ ను ఇండి కూటమిలోకి ఆహ్వానించారు. తమతో కలవడానికి ఇదే సరైన సమయం అని కూడా అన్నారాయన. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న జగన్ నవ్వుతూ కనిపించారు. 2016లో టీడీపీతో పొత్తు చెడిపోయాక బీజేపీ, జగన్‌ పరస్పరం దగ్గరయ్యారు. 2019లో వైసీపీ గెలిచాక ఆ బంధం మరింత దృఢమైంది. పొత్తు అనేది అధికారికంగా లేకున్నా… అనేక కీలక సందర్భాల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారు జగన్‌. అలాగే ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్‌మెంట్స్‌ ఇచ్చారు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు. మొన్నటి ఎన్నికలకు ముందు కూడా టీడీపీతో పొత్తుకు బీజేపీకి సుముఖంగా లేదనే వార్తలొచ్చాయి. టీడీపీతో కూటమి కట్టడానికి ఢిల్లీ పెద్దలతో తాను తిట్లు తినాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ చెప్పడాన్నిబట్టి కూడా తెలుగుదేశం మీద బీజేపీ వైఖరి అప్పట్లో ఎలా ఉందనేది అర్ధం అవుతుంది. అలాంటిది… ఫలితాల తర్వాత బీజేపీ అంచనాలు తల్లకిందులై… కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడానికి టీడీపీనే పెద్ద దిక్కుగా మారడంతో కమలనాధుల ప్రాధాన్యతలు మారిపోయాయి. జగన్‌కు దూరంగా ఉండాల్సిన అనివార్యత ఏర్పడింది.

ధర్నా కోసం ఢిల్లీ వెళ్లిన మాజీ సీఎం పనిలో పనిగా ప్రధానికి కూడా కంప్లైంట్ చేయాలన్న ఉద్దేశ్యంతో అపాయింట్‌మెంట్ అడిగారు. కానీ మోడీ నుంచి పిలుపు రాలేదు. బీజేపీ కూడా ఇంతకు ముందులా జగన్ ను చేరదీసే అవకాశం లేదన్న వాదన బలపడుతోంది. వైసీపీకి బద్ద శత్రువులైన టీడీపీ, జనసేనలను పక్కన పెట్టుకుని జగన్ కు మద్దతు ఇస్తే పరిస్తితి ఇంకోలా ఉంటుందన్న అభిప్రాయం కాషాయ పెద్దల్లో ఉన్నట్టు తెలిసింది. అందుకే ప్రస్తుతానికి బీజేపీ వైపు నుంచి చేయూత ఏదీ దొరకనట్టేనంటున్నారు. అందుకే రాజకీయంగా జగన్‌ ప్రత్యాయమ్నాల వైపు చూడాల్సిందేనన్నది ఆయన సన్నిహితుల అభిప్రాయంగా తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ మీద గతంలో ఉన్న కోపం మాజీ సీఎంకు ఇప్పుడు లేనట్టు కనిపిస్తోందట. ప్రత్యేక హోదా ఇస్తే కాంగ్రెస్ కైనా మద్దతు ఇస్తామని గతంలోనే ప్రకటించారాయన. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇస్తున్న ఇండి కూటమి తాజాగా జగన్‌కు మద్దతుగా నిలిచింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పార్టీ నిలదొక్కుకోవాలన్నా…. ఇక్కడ జరిగే వ్యవహారాలను ధీటుగా ఎదుర్కొవాలన్నా జాతీయ స్థాయిలో మద్దతు కావాలనే వారు వైసీపీలో కనిపిస్తున్నారు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది ఎంపీలున్నారు. ఎన్డీయేకి పూర్తి ఆధిక్యతలేని రాజ్యసభలో జగన్ అవసరం ఇండి కూటమికి కీలకం అవుతుంది. ఒక రకంగా ఇది ఆయన చేతిలో ఉన్న ఆయుధమే. వాస్తవానికి విపక్ష నేతలు కూటమి కట్టేటప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి పార్టీలను ఆహ్వానించారు గానీ… ఏపీ నుంచి జగన్‌ను సంప్రదించలేదు. కానీ… ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకోక తప్పనిసరి అయిందన్న అభిప్రాయం బలపడుతోంది. మరి జగన్ నెక్ట్స్ స్టెప్ ఎటు వేస్తారు? ఏం చేస్తారనేది ఆసక్తికరమే. అయితే ఇప్పటికిప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికేతే.. ఓ అడుగైతే పడింది… చివరికి అది ఎటు వైపు వెళ్తుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.