Site icon NTV Telugu

Off The Record: గన్నవరం పాలిటిక్స్‌ గరం గరం..! కొత్త మలుపు తిరగబోతోందా?

Yarlagadda Venkata Rao

Yarlagadda Venkata Rao

Off The Record: గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ గరం గరంగానే ఉంటాయి. ఎన్నికల సమయంలోనే కాకుండా … ఆల్‌ ద టైం అక్కడ పొలిటికల్‌ హీట్‌ పుడుతూనే ఉంటుంది. ఇక ఆ సీజన్‌లో చెప్పే పనేలేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇక ఏడాది టైం కూడా లేకపోవడంతో నియోజకవర్గ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. గన్నవరం నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు వల్లభనేని వంశీ. వైసీపీ అధికారంలోకి వచ్చాక…. ఇక కష్టపడి సైకిల్‌ తొక్కడం ఎందుకు? హాయిగా ఫ్యాన్‌ కింద సేదదీరదామనుకుంటూ… గోడ దూకేశారు. అప్పటికే అధికార పార్టీ నుంచి నియోజకవర్గంలో కీలకంగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు.. వంశీ రాకను వ్యతిరేకించారు. కానీ… అప్పటికప్పుడు ఏం చేయలేక అసంతృప్తితో అలాగే ఉండిపోయారట. స్థానికంగా తన వర్గం ఉన్నా వారికి పార్టీ పదవులు గానీ.. స్థానిక ఎన్నికల్లో టికెట్లు గాని ఇప్పించుకోలేకపోవటంతో క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ వ్యవహారంపై అధిష్టానం దగ్గర చాలాసార్లు పంచాయితీ జరిగినా.. మార్పు రాలేదట.

అటు వైసీపీలో నేతల మధ్య వివాదాలు జరుగుతుంటే…. ఇటు టీడీపీకి ఇన్ఛార్జ్‌ కూడా లేని పరిస్థితి. దీంతో అధికార పార్టీకి టచ్‌ మీ నాట్‌ అన్నట్టుగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు ఈసారి టీడీపీ తరపున పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీని మీద సోషల్‌ మీడియా పోస్ట్‌లు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇంకో అడుగు ముందుకేసి… యార్లగడ్డ వెంకట్రావు పేరుతో బయటికి వచ్చిన పోస్టింగ్‌ కలకలం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో గన్నవరానికి మంచి రోజులు వస్తాయి, 2024లో ఏపీ మొత్తం మీద నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలుపుతానన్నది ఆ పోస్టింగ్‌ సారాంశం. అంటే ఈసారి యార్లగడ్డ టీడీపీ తరపున బరిలోకి దిగుతారనే సంకేతాలు ఇచ్చారా అన్న చర్చ జరుగుతోంది. అది ఫేక్‌ అకౌంట్‌ అని ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నా…యార్లగడ్డ మాత్రం మౌనంగానే ఉన్నారు. ఆ మౌనానికి అనేక అర్థాలు తీస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మౌనం అర్ధాంగీకారమేనా అన్న ప్రశ్న వస్తోంది. మరోవైపు యార్లగడ్డతో కొందరు టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అదలా ఉంచితే.. ఎవరో పెట్టిన పోస్టింగ్‌కి మేం ఎందుకు స్పందించాలన్నది వెంకట్రావు సన్నిహితుల మాట అట. వైసీపీ నుంచి వంశీకి టికెట్ కన్ఫామ్‌ అయితే… యార్లగడ్డకు ఉన్న ఆప్షన్ టీడీపీనే కాబట్టి సోషల్ మీడియాలో ప్రచారంపై ఆయన మౌనంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎట్నుంచి ఎటు మారతాయో చూడాలి.

Exit mobile version