NTV Telugu Site icon

Off The Record: మహిళా బిల్లుతో ఏపీ రాజకీయాల్లో కీలక మార్పు..? భర్తకు బదులు భార్య, తండ్రికి బదులు కూతురు..?

Ap

Ap

Off The Record: మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 33 శాతం రిజర్వేషన్‌ అమలైతే ఇప్పటికే ఉన్న నేతల వారసులకు తోడు కొత్తవాళ్ళు కూడా పొలిటికల్‌ స్క్రీన్‌ మీద కనిపించి సత్తా చాటుకునే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఆ స్థాయిలో రాజకీయ వారసులు నిలదొక్కుకోలేరన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఒక్క ఆంధ్రప్రదేశ్‌నే తీసుకుంటే.. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను.. ప్రస్తుతం ఉన్న మహిళా శాసనసభ్యుల సంఖ్య కేవలం15. అంటే రాష్ట్ర అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం 10 శాతం లోపేనన్నమాట. వీరిలో 14 మంది వైసీపీ తరుపున, టీడీపీ నుంచి ఆదిరెడ్డి భవానీ ఒక్కరే ఉన్నారు. 33 శాతం రిజర్వేషన్‌ ప్రకారం చూసుకుంటే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అయినా.. 58 మంది మహిళలకు టిక్కెట్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే.. పార్టీ ఏదైనా సరే.. 58 మంది మహిళా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అసెంబ్లీలో కొలువుదీరతారన్న మాట. అందుకే అధికార, ప్రతిపక్షాల్లోని ముఖ్యనేతలు అప్పుడే లెక్కలు కట్టడం మొదలెట్టేశారట. ఇప్పటికే కొంత మంది వారసురాళ్లు రాజకీయంగా క్రియాశీలంగా ఉన్నారు.

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఫాతిమా గ్రౌండ్ లో యాక్టివ్ గా తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకే టిక్కెట్‌ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారట ముస్తఫా. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధ కూడా ఇప్పటికే రాజకీయ ఆరంగేట్రం చేశారు. కె.కోటపాడు జడ్పీటీసీగా కొనసాగుతున్నారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కూడా తన కుమార్తె శ్రావణిని తెర మీదకు తీసుకొచ్చారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ కుమార్తె ఈసారి రేపల్లె నియోజకవర్గం నుంచి బరిలో దిగవచ్చంటున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రా రెడ్డి కాళహస్తి రాజకీయాల్లో ఇప్పటికే క్రియాశీలకంగా ఉన్నారు. 2024 బ్యాలెట్ పోరులో ఈమె కూడా బరిలో నిలబడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భర్తలు సైడైపోయి ఈసారి భార్యల్ని బరిలో దింపే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. మంత్రి సీదిరి అప్పలరాజు భార్య శ్రీదేవి భర్తతో పోటీ పడుతూ స్థానికంగా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకుని భార్యకు టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో సీదిరి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ భార్య పద్మ ప్రియ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లా పార్టీ బాధ్యతలు కూడా చూశారు. ఇలా వారసులతో పాటు చాలా మంది ఔత్సాహిక మహిళలకు కొత్తగా అవకాశం దొరకవచ్చంటున్నారు. ఇప్పటికిప్పుడు అంటే… అన్ని పార్టీలు దీటైన మహిళా అభ్యర్థులను వెదుక్కోవడానికి సతమతం అవ్వాల్సి వచ్చేది. వచ్చే ఎన్నికల్ని వదిలేసి 2029 నాటికి మహిళా రిజర్వేషన్స్‌ని అమలు చేయాలన్న నిర్ణయం అన్ని పార్టీలకు పెద్ద ఊరటే. అప్పటికి కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి అవకాశం దక్కిందంటున్నారు పరిశీలకులు.

ఇక తెలుగుదేశం పార్టీ తరపున ప్రస్తుతం రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ మధ్య పార్టీ మారిన ఉండవల్లి శ్రీదేవి కూడా ప్రస్తుతం టీడీపీ క్యాంప్‌లో ఉన్నారు. ఇక మిగిలిన నేతల విషయానికొస్తే.. మాజీ మంత్రులు పీతల సుజాత, పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, కోళ్ల లలిత కుమారి, ప్రతిభా భారతి వంటి వారు చెప్పుకోదగ్గ స్థాయిలో మహిళా నేతలుగా కన్పిస్తున్నారు. అలాగే ఇటీవల కడప ఇన్ఛార్జ్‌గా ఆర్‌ శ్రీనివాసులు రెడ్డి భార్య మాధవి రెడ్డిని నియమించింది పార్టీ. తుని నుంచి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పేరు దాదాపు ఖరారైనట్టేనంటున్నారు. పలాస నుంచి గౌతు శిరీష, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, ఆలూరులో కోట్ల సుజాతమ్మ, సాలూరు నుంచి గుమ్మడి సంధ్యారాణి, నందిగామలో తంగిరాల సౌమ్య బరిలోకి దిగే సూచనలు కన్పిస్తున్నాయి. విజయనగరం నుంచి మీసాల గీత, అనంతపురం జిల్లా సింగనమల నుంచి బండారు శ్రావణి, పెనుకొండ నుంచి సవిత కూడా రేసులో ఉన్నారు. ఇక రాజాం నుంచి ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ టిక్కెట్‌ ఆశిస్తున్నారు. అలాగే లోక్‌సభ స్థానాల విషయానికొస్తే.. తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పనబాక లక్ష్మి మినహా ఇంకెవరు రేసులో లేరు. ఇలా అతి కొద్దిమంది మహిళా నేతలు మాత్రమే టీడీపీ నుంచి యాక్టివ్‌గా ఉన్నారు.

రిజర్వేషన్‌ అమల్లోకి వస్తే… టీడీపీ కూడా మొత్తం 58 మంది ఎమ్మెల్యే, 8 మంది ఎంపీ అభ్యర్థుల్ని తయారు చేసుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో తెర చాటున ఉన్న ముఖ్య నేతల వారసులతో పాటు కొత్త వాళ్ళకు కూడా పార్టీ తరపున అవకాశం రావచ్చంటున్నారు. రెండు పార్టీల్లోనూ… తప్పనిసరైతే… సీనియర్‌ నేతలు కూడా వేరే వాళ్ళకు సీటు దక్కడం ఇష్టం లేక తమ కుటుంబాల్లోని మహిళలనే తెరమీదికి తెచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కాకుండా… అడపాదడపా ముందుకు వస్తూ…. ఎన్నికల టైంలో తమవారి తరపున తిరుగుతూ ప్రచారం చేస్తున్న మహిళలు సైతం ఫుల్‌టైం పొలిటీషియన్స్‌గా మారిపోయే ఛాన్స్‌ ఉంది. మొత్తంగా చూస్తే… పార్టీ ఏదైనా సరే… ఇన్నాళ్ళు కష్టపడ్డాం, కానీ… పురుషాధిపత్య రంగంలో మమ్మల్ని తొక్కేస్తున్నారని బాధపడే మహిళా నాయకులకు ఈ రిజర్వేషన్‌ గోల్డెన్‌ ఆపర్చ్యూనిటీ అన్న మాట మాత్రం వినిపిస్తోంది.

Show comments