Site icon NTV Telugu

Off The Record: తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా? చేయదా?

Js

Js

Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇక ఎంతో సమయం లేదు. షెడ్యూల్‌ ప్రకారం అయితే.. ఈ ఏడాది చివరికి ప్రక్రియ ముగిసిపోవాలి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ దిశగానే ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ ఇప్పటికే అభ్యర్ధుల్ని ప్రకటించి సమరానికి సై అంది. కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ వడపోత కసరత్తు ఓ కొలిక్కి వస్తోంది. బీజేపీ కూడా ఆశావహుల దరఖాస్తుల పరిశీలన మొదలుపెట్టింది. ఇలా.. పోటీ చేయాలనుకున్న పార్టీలన్నీ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతుంటే.. 32 సీట్లలో పోటీ చేస్తామని గతంలోనే ప్రకటించిన జనసేన నుంచి మాత్రం ఇన్నాళ్లు ఉలుకూ పలుకూ లేదు. ఇంకా చెప్పాలంటే.. ముమ్మరంగా ఎన్నికల పనులు చేయాల్సిన టైంలో అసలు రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికే లేకుండా పోయిందంటున్నారు. ఇన్నాళ్ళు కామ్‌గా ఉండి.. ఇప్పుడు సడన్‌గా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్‌కి 32 స్థానాల్లో పోటీ చేస్తామని గతంలో తమ పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన విషయం గుర్తుకు వచ్చినట్టు ఉంది.

జూబ్లీహిల్స్‌లోని పార్టీ ఆఫీస్‌లో ఓ మీటింగ్‌ పెట్టేసి బూత్‌ కమిటీలు వేసేద్దాం. ఎన్నికల్లో ఇరగదీసేద్దామని చెప్పారట. అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన టైంలో బూత్‌ కమిటీల గురించి మాట్లాడుతున్నారంటే.. వాళ్ళ సీరియస్‌నెస్‌ ఏంటో దాన్ని బట్టే అర్ధం చేసుకోవాలంటున్నారు పరిశీలకులు. గత జనవరి 24న పవన్‌.. వారాహి వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఆరోజు మాత్రమే తెలంగాణలో జనసేన పార్టీ హడావుడి కనిపించింది. 9 నెలలవుతున్నా.. పార్టీ జెండాగాని, నేతలు, కార్యకర్తలు గాని కనిపించిన దాఖలాలు లేవు. దీంతో.. నాడు పవన్‌ ప్రకటించిన ప్రకారం జనసేన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ఈ తొమ్మిది నెలల కాలంలో తెలంగాణలో పార్టీ బలోపేతంపై అసలు దృష్టి పెట్టలేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక అభ్యర్థుల ఎంపిక, ప్రచారం లాంటి మాటలకు స్థానం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు కొందరు పరిశీలకులు.

ప్రజా గాయకుడు గద్దర్‌ చనిపోక ముందు ఆయన్ని హాస్పిటల్‌లో పరామర్శించిన పవన్‌.. గద్దర్‌ మరణం తర్వాత తమ సాన్నిహిత్యాన్ని తెలుపుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత తెలంగాణ పరంగా ఆయన యాక్టివిటీ ఏమీ లేదంటున్నారు. ఏపీలో తాను పొత్తులో ఉన్న బీజేపీ తెలంగాణలో ముమ్మర కసరత్తు చేస్తుంటే… పవన్ మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉండటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇదే సమయంలో మరో బలమైన వాదన తెరమీదికి వస్తోంది. ఏపీలో జనసేన క్రమంగా పుంజుకుంటోంది. ఈ సమయంలో అక్కడ వదిలేసి తెలంగాణ మీద దృష్టి పెట్టి చేతులు కాల్చుకోవడం ఎందుకన్న అభిప్రాయం కూడా పార్టీ నాయకత్వానికి ఉన్నట్టు తెలిసింది. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. టీడీపీ-జనసేన మధ్య అధికారికంగా పొత్తు ప్రకటన వచ్చేసింది. కలిసి పనిచేయడానికి కింది స్థాయి కేడర్‌ కూడా మానసికంగా సిద్ధమైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అక్కడే ఎక్కువ ఫోకస్‌ పెడదామని పార్టీ అగ్ర నాయకత్వం అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాదు, కూడదు ముందు ప్రకటించినట్టే తెలంగాణలో కూడా పోటీ చేస్తామంటే…. ఈపాటికే సన్నద్ధత ఉండి తీరాలి. కనీసం ఆ 32 నియోజకవర్గాల వరకైనా ఒక క్లారిటీ వచ్చి తీరాలి. అలాంటిదేమీ లేకుండా పోటీ ఎలాగన్నది క్వశ్చన్‌. ఈ పిక్చర్‌లో ఫుల్‌ క్లారిటీ రావాలంటే అట్నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే.

Exit mobile version