NTV Telugu Site icon

Off The Record: ఎమ్మెల్సీల రాజీనామాలను ఎందుకు ఆమోదించడం లేదు..? ఎండ్‌ కార్డ్‌ పడేదెన్నడు?

Mlcs

Mlcs

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే కొందరు, ఆ తర్వాత మరి కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామాలు చేశారు. కానీ…. ఇంతవరకు ఒక్క రాజీనామా కూడా మండలి ఛైర్మన్‌ ఆమోదం పొందలేదు. ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి బైబై చెప్పేశారు. కొందరు కూటమి పార్టీలతో టచ్‌లోకి వెళ్ళారు. ఈ క్రమంలో రాజీనామాల ఆమోదం కోసం ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలన్న ప్రశ్నలు వస్తున్నాయట. ఈ వ్యవహారంలో మండలి ఛైర్మన్‌ నిర్ణయం కీలకం. కానీ… ఆయన మాత్రం దాన్ని పెండింగ్‌లో పెట్టేశారు. దీంతో… ఎందుకు ఆ ఆరు రాజీనామాలను ఆమోదించడం లేదు? ఆ విషయంలో ఛైర్మన్‌కు ఇబ్బందులున్నాయా? లేక ఇతర కారణాలున్నాయా అన్న చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. ఏపీ శాసన మండలిలో వైసీపీకి పూర్తి సంఖ్యా బలం ఉంది. అయితే.. శాసనసభ తరహాలోనే మండలిలోనూ పూర్తి స్థాయి మెజార్టీ కోరుకుంటోంది కూటమి. ఇందుకోసం వైసీపీ ఎమ్మల్సీలను ఆకర్షిస్తోందని, అందుకు తగ్గట్టే వాళ్ళు కూడా కొందరు కూటమి పార్టీలకు టచ్‌లోకి వెళ్తున్నారన్నది రాజకీయ వర్గాల మాట.

Read Also: Kangana Ranaut: ట్రంప్‌పై కంగనా రనౌత్ పోస్ట్.. నడ్డా ఆదేశాలతో తొలగింపు.. పోస్ట్‌లో ఏముందంటే..!

ఇప్పటి వరకు జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత రాజీనామా చేశారు. ఇక తాజాగా జకియా ఖానమ్‌ కూడా ఫ్యాన్‌ పార్టీకి గుడ్‌బై కొట్టేశారు. జకియా మినహా మిగతా వాళ్ళంతా తమ రాజీనామాలు ఆమోదించమంటూ… సభలోనే ఛైర్మన్‌ను కోరారు. కానీ…ఇప్పటి వరకు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ వ్యవహారశైలి కూటమికి రుచించటం లేదట. ఛైర్మన్ మోషేన్ రాజు ప్రాధమికంగా వైసీపీకి చెందిన నాయకుడు. అయితే…. చైర్మన్ పదవికి రాజకీయాలను ఆపాదించ లేరు. అదే సమయంలో ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించలేని పరిస్థితి. రాజీనామాలను ఆమోదించినా, తిరస్కరించినా… ఆ పని ఎప్పుడు చేసినా… తుది నిర్ణయం మాత్రం ఆయనదే. కానీ… రిజైన్‌ చేసిన సభ్యులతో ఛైర్మన్ ఇప్పటి వరకు మాట్లాడిన దాఖలాలు లేవు. సభ్యులు సభలోనే తమ రాజీనామాలు ఆమోదించాలని కోరటంతో.. వారు ఇష్ట పూర్వకంగానే ఆ పని చేసినట్లు స్పష్టం అవుతోంది. అయితే.. దీనికి మూకుమ్మడి కలర్‌ ఇవ్వకుండా, ఆ మాట రాకుండా… కూటమి సైతం ఒక్కొక్కరిగా రాజీనామా చేయిస్తోంది. ఇప్పుడు ఆరుగురి రిజైన్‌ లెటర్స్‌ మీద ఛైర్మన్‌ స్టాంప్‌ వేసేస్తే… మండలిలో వైసీపీ బలం తగ్గిపోతుంది. ఖాళీ అయిన స్థానాల్లో కూటమి నుంచే కొత్తగా సభ్యులు ఎన్నిక అవుతారు కాబట్టి ఆ పార్టీల బలం పెరుగుతుంది. అందుకే… తనకున్న విచక్షణాధికారాల మేరకే ఛైర్మన్ వేచి చూసే ధోరణితో ఉన్నారా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట.

Read Also: Software Job: లక్షల్లో వసూలు చేసి, బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..

ఛైర్మన్‌ ఛైర్‌ రాజకీయాలకు అతీతం, ఆ పదవికి వాటిని ఎవరూ ఆపాదించలేరు కానీ… ప్రస్తుతం మోషేన్‌ రాజు తీరు చూస్తుంటే మాత్రం… అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నాయి కూటమి పార్టీలు. ఇప్పుడు రాజీనామా చేసిన వారి పదవీ కాలాన్ని సైతం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమోదించినా తిరిగి వీరికే అవకాశం వస్తుందా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. అందుకే వాళ్ళు కూడా నాడు సభలో అడగడం మినహా తర్వాత పెద్దగా వత్తిడి చేసి ఉండకపోవచ్చన్నది ఇంకో వెర్షన్‌. దీంతో అసలు ఇప్పుడు మండలి ఛైర్మన్ ఈ రాజీనామాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఎప్పుడు తీసుకుంటారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇక తాజాగా రాజీనామా చేసిన జకియా ఖానమ్ మొదట టీడీపీకి టచ్ లోకి వెళ్లారు. తర్వాత బీజేపీలో చేరడంతో కూటమి వర్గాల్లో కొత్త చర్చ మొదలైందట. మొత్తం మీద ఎమ్మెల్సీల రాజీనామాలు, వాటి ఆమోదం ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.