Off The Record: ‘ఎవర్రా వీళ్లంతా..?’ అంటూ జనసైనికుల ఫైర్

  • తిరుపతిలో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక రచ్చ..
  • జనసేన కోటాలో డిప్యూటీ, సీనియర్‌ నేతల గట్టి ఆశలు..
  • అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ గేట్‌ వెంకటేశ్వర్లు భార్యకు పోస్ట్‌..
  • డిప్యూటీ మేయర్‌ ఎంపిక చూసి షాకైన కూటమి సీనియర్స్‌..
  • గత ప్రభుత్వంలో కేసులు పడ్డ మా సంగతేంటని ప్రశ్న..
  • ముక్కు ముఖం తెలియని వాళ్ళని అందలం ఎక్కిస్తారా అంటూ ఫైర్‌..
Otr Tirupati Deputy Mayor R

Otr Tirupati Deputy Mayor R

Off The Record: తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి సాధించిన ఘనవిజయం కంటే… ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నిక చుట్టూ నడుస్తున్న రచ్చే హైలైట్‌ అవుతోంది. మొత్తం 66 స్థానాలకుగాను ఏకంగా 60 చోట్ల గెలిచి తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది కూటమి. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అత్యంత సెంటిమెంట్ ఉన్న ప్రాంతం. అయినప్పటికీ గత ఎన్నికల్లో పొత్తు ధర్మంలో భాగంగా ఈ సీటును జనసేన కోటాకు వెళ్లింది. ఆ పార్టీ నుంచి ఆరణి శ్రీనివాసులు భారీ మెజారిటీతో గెలిచారు. ఇక కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లోనూ చివరి వరకు జనసేనకే సీటు దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో సైకిల్ పార్టీ ఆ పదవిని ఎగరేసుకుపోయింది. టీడీపీ నుంచి జేబీ శ్రీనివాస్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. మేయర్ పదవి టీడీపీ ఖాతాలోకి వెళ్లడంతో, ఇక డిప్యూటీ మేయర్ పదవి కోసం జనసేన నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి తమ ఖాతాలోకి వేసుకున్నారు.

అయితే ఈ పదవి కోసం పార్టీలో తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ప్రజారాజ్యం టైం నుంచి పవన్ కళ్యాణ్ కుటుంబంతోనే ఉంటూ, ఏళ్ళ తరబడి జనసేన కోసం పనిచేస్తున్న రాజారెడ్డి… బీసీ కోటాలో డిప్యూటీ మేయర్ పదవిని గట్టిగా ఆశించారు. మరోవైపు ఎస్సీ కోటాలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ అనుచరుడు మనోజ్ కూడా తన వంతు ప్రయత్నాలు చేశారు. ఇంకోవైపు మైనారిటీ వర్గానికి చెందిన సీనియర్ నేత ఎస్‌కే బాబు తన కోడలు షాహినాకు అవకాశం ఇవ్వాలని కోరారు. వీరితో పాటు క్రికెట్ విజయ్ అనే వ్యక్తి సైతం తన కుటుంబ సభ్యులకు ఆ పదవి ఇప్పించుకోవాలని చివరి నిమిషం వరకు గట్టిగానే లాబీయింగ్ చేశారట. జనసేన నుంచి ఇంతమంది సీనియర్లు, విధేయులు రేసులో ఉంటే… అనూహ్యంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 35వ డివిజన్ నుంచి జనసేన తరఫున గెలిచిన గేట్ విద్యా సంస్థల యజమాని వెంకటేశ్వర్లు భార్య విజయను డిప్యూటీ మేయర్ పదవి వరించింది. దీంతో… ఇప్పుడు కూటమి వర్గాల్లో ఎవుర్రా…వీళ్ళంతా…? ఎక్కడి నుంచి ఊడిపడ్డార్రా అంటూ నాయకులు చర్చించుకుంటున్నారట. అసలు విజయ పేరు ప్రకటించగానే స్థానిక జనసేన కార్యకర్తలతో పాటు టీడీపీ, బీజేపీ నేతలు సైతం ఒక్కసారిగా అవాక్కయ్యారటా‌‌. ఏళ్ళ తరబడి రాజకీయాల్లో ఉన్నవాళ్ళకు కూడా అసలు ఆమె ఎవరో కూడా తెలియదట.

ఆమె ఎవరు? బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి అంటూ…కొందరు సీనియర్సే ఆరా తీయడం మొదలుపెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి పోరాడింది మేము. ఆ కష్టకాలంలో గేట్ వెంకటేశ్వర్లు కానీ, ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న క్రికెట్ విజయ్ సహా ఇతర నేతలు ఎక్కడా కనిపించలేదంటూ రెండు పార్టీల నాయకులు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక పదవి వస్తుందని చివరి క్షణం వరకు ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజారెడ్డి సహా ఇతర జనసేన కార్పొరేటర్లు తీవ్ర నిరాశలో కూరుకుపోయారట. గత ప్రభుత్వ హయాంలో 40పైగా కేసులు పడి, వాటి కోసం ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నది మేమైతే… పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా చేరిన వారికి డిప్యూటీ మేయర్ పదవి కట్టబెడతారా అంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇక ఈ ఎంపికపై సామాజిక వర్గాల వారీగా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇచ్చేదేదో నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న బీసీ వర్గానికి ఇచ్చి ఉంటే బాగుండేదని, తక్కువ ఓట్లు ఉన్న కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వడం ఏంటంటూ జనసేన సీనియర్ నేతలు పెదవి విరుస్తున్నట్టు తెలిసింది.

టీడీపీలోని యాదవ సామాజికవర్గం ఇప్పటికే తమకు మేయర్ పదవి రాలేదని మధనపడుతుంటే, కనీసం డిప్యూటీ మేయర్ పదవైనా బీసీలకు దక్కుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైందని అంటున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు పదవి వెళ్లినా తమ వర్గానికి న్యాయం జరగకపోవడంపై బీసీ నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా తిరుపతి డిప్యూటీ మేయర్ ఎంపిక వ్యవహారం అటు పార్టీ కేడర్‌కు, ఇటు సీనియర్ నేతలకు ఏమాత్రం రుచించలేదట. ఎవరో ముక్కుమొహం తెలియని వారిని తెచ్చి అందలం ఎక్కిస్తారా అంటూ సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు పెడుతున్న పోస్టులు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయని అంటున్నారు. కార్యకర్తల నుంచి వస్తున్న ఈ తీవ్ర స్థాయి విమర్శలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. పెద్దలు తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలంటూ ఆయన అసంతృప్తి నేతలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. టెంపుల్ సిటీ గ్లాస్‌లో అంటుకున్న ఈ అగ్గిని ఎమ్మెల్యే ఏ విధంగా చల్లారుస్తారో చూడాలంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. ఎన్నికల్లో 60 సీట్లు గెలిచిన ఉత్సాహం కంటే, ఈ ఒక్క పదవి ఎంపిక తెచ్చిన అసంతృప్తే ఇప్పుడు తిరుపతి కూటమి రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తోందట‌.‌‌