Site icon NTV Telugu

Off The Record: బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య ఏం జరుగుతుంది..? గులాబీ తోటలో ఏనుగు విహారం..?

Rsp

Rsp

Off The Record: తెలంగాణ పొలిటికల్‌ స్క్రీన్‌ మీద సరికొత్త చిత్రం కనిపించబోతోందా? ఊహించని పొత్తుకు వేదిక కాబోతోందా అంటే.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. బీఆర్‌ఎస్‌, బీఎస్పీ నాయకత్వాల మధ్య ఏదో జరుగుతోందన్న ఊహాగానాలే అందుకు కారణం అంటున్నారు. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌లో చేరమంటూ ఆహ్వానం అందిందట. లోక్‌సభ ఎన్నికలకు ముందే కారెక్కితే ఉభయతారకంగా ఉంటుందని గులాబీ పెద్దలు కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రవీణ్‌ మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్టు తెలిసింది. అలాగని మీకూ… మాకూ కుదరదంటూ తెగ్గొట్టినట్టు కూడా మాట్లాడలేదట. ఉభయ తారకం అంటున్నారు కాబట్టి నా దగ్గర ఇంకో ప్రపోజల్‌ ఉందంటూ గులాబీ నాయకత్వం ముందు తన మనసులోని ఆలోచనను బయట పెట్టినట్టు తెలిసింది. ప్రవీణ్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌కు చేసిన ప్రతిపాదన ప్రకారం.. ఆయన నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరపునే పోటీ చేస్తారు. అక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని పోటీకి దింపకుండా… తనకు బే షరతుగా మద్దతివ్వాలి. అలా చేస్తే… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులందరికీ బీఎస్పీ మద్దతిస్తుంది.

Read Also: MP Laxman: మోడీని విమర్శించే వారంతా వారి కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారు..

ఇదీ… ప్రవీణ్‌కుమార్‌ చెప్పిన ఉభయతారక మంత్రం. దీనికి గులాబీ అధినాయకత్వం నుంచి ఎలాంటి రియాక్షన్‌ వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఓకే అంటే గనుక గులాబీ తోటలో ఏనుగు విహారాన్ని చూడబోతున్నామన్న సెటైర్స్‌ కూడా పడుతున్నాయి. హళ్ళికి హళ్ళి అన్నట్టుగా మద్దతుకు మద్దతే తప్ప తాను మాత్రం కారెక్కే ప్రసక్తే లేదని కూడా కుండబద్దలు కొట్టేశారట ఆయన. నాగర్‌కర్నూల్‌ నుంచి బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ రాములు ఇటీవల బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు భరత్‌కు టిక్కెట్‌ కన్ఫామ్‌ చేసింది కమలం పార్టీ. దీంతో నాగర్‌కర్నూల్‌లో దీటైన అభ్యర్థి కోసం వెదుకుతోంది గులాబీ పార్టీ. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతిచ్చి రాష్ట్రమంతటా ఆయన పార్టీ సపోర్ట్‌ తీసుకుంటారా? లేక మరో అభ్యర్థిని వెదుక్కుంటారా అన్న చర్చ మొదలైంది తెలంగాణ రాజకీయవర్గాల్లో. బయట ఈ తరహా చర్చ జరుగుతుండగానే… బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ప్రవీణ్‌కుమార్‌ కలవడమే కథలో ట్విస్ట్‌. మాజీ సీఎంను మర్యాద పూర్వకంగానే కలిశారని పైకి చెబుతున్నా… లోపల రాజకీయ చర్చలు జరగకుండా ఉండాయా అన్న డౌట్స్‌ వస్తున్నాయి ఎక్కువ మందికి. సమావేశంలో ఆర్‌ఎస్‌తో పాటు బీఎస్పీ ప్రతినిధి బృందం కూడా ఉండటంతో మేటర్‌ ఇంకా ఇంట్రస్టింగ్‌గా మారింది. మరి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీఎస్పీ కలిసి పనిచేస్తాయా? లేక మీ దారి మీదే, మా దారి మాదేనని అంటాయా అన్నది చూడాలి.

Exit mobile version