Off The Record: దొరికిందే ఛాన్స్…. దున్నేద్దాం….. మంచి తరుణం మించిన దొరకదు. అసలు మళ్ళీ ఎమ్మెల్యే టిక్కెట్ దక్కుతుందో లేదో… మనం గెలుస్తామో లేదోనన్నట్టుగా ఉందట రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే తీరు. ఎమ్మెల్యే శిరీష, ఆమె భర్త భాస్కర్ అవినీతికి అంతే లేకుండా పోతుందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే దంపతుల వ్యవహారశైలి సొంత టీడీపీ నేతలకే నచ్చడం లేదట. ఇప్పటికే అనేక సార్లు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేని పిలిచి వార్నింగ్ ఇచ్చినా, అదేమీ పట్టనట్టు యధావిధిగా నియోజకవర్గంలో దందాలు కొనసాగిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే అవినీతి కార్యకలాపాలపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మిసవాల్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు. రాష్ట్రంలో అత్యధిక మండలాలున్న నియోజకవర్గం అల్లూరి జిల్లా రంపచోడవరం. విభిన్న భౌగోళిక పరిస్థితుల కారణంగా… ఇక్కడ 11 మండలాలు ఉన్నాయి. ఇదే టీడీపీ ఎమ్మెల్యేకు వరంలా మారిందట. గిరిజన ప్రాంతాలు కావడం, స్థానికులు ఎదిరించి మాట్లాడే పరిస్థితి లేకపోవడం ఎమ్మెల్యేకు కలిసివచ్చిందని చెప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఏ ఒక్క అభివృద్ధి పథకాన్ని నియోజకవర్గంలో సక్రమంగా అమలు చేయకున్నా… ఎమ్మెల్యే దంపతులు అవినీతిలో మాత్రం రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధమవుతున్నారన్న సెటైర్స్ వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే భర్త విజయభాస్కర్ షాడో శాసనసభ్యుడిలా వ్యవహరిస్తున్నారట. ఇప్పుడు తప్ప మరెప్పుడూ అవకాశం రాదన్నట్టుగా అవినీతిలో చెలరేగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: Sahasra murder case: అసలు సహస్ర హత్య కేసులో ఏం జరిగింది?..
ఎన్నికల ముందు ఎమ్మెల్యే శిరీష అంగన్‌వాడి టీచర్. ఆమె మీద అనంతగిరిలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో వైసీపీ హయాంలో ఉద్యోగం నుంచి తొలగించారు. శిరీష భర్త టిడిపి నేత కావడంతో అప్పట్లో అది పొలిటికల్ కలర్ పులుముకుంది. అదే ఊపులో ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా… శిరీషకు టీడీపీ టిక్కెట్ ఖరారవడం, కూటమి హవాలో ఆమె గెలవడం చకచకా జరిగిపోయాయి. ఇక ఎమ్మెల్యే భర్త విజయభాస్కర్ చేయని అరాచకాలు లేవన్నది నియోజకవర్గపు టాక్. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రాజవొమ్మంగిలో గిరిజన యువతను మోసం చేసి డబ్బులు కొట్టేశారన్న ఆరోపణలున్నాయి. బాధితులు ఆందోళనకు దిగడంతో తరువాత సెటిల్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే శిరీష ఒప్పుకున్నారు కూడా. అయితే తమ ఆస్తులను అమ్మి అందరికీ తిరిగి డబ్బులు చెల్లించేశామని చెప్పారామె. ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నిర గడుస్తున్నా, ఏజెన్సీలో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేదంటున్నారు. ఆఖరుకు టీడీపీ నేతలనుంచి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోందట. నియోజకవర్గంలో పలుచోట్ల పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో క్లబ్ నుంచి నెలకు రెండు లక్షల రూపాయల దాకా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబరాల పేరిట ఎమ్మెల్యే భర్త ఆధ్వర్యంలో బహిరంగంగా రికార్డింగ్ డాన్సులు, రేవ్ పార్టీల తరహాలో కార్యకలాపాలు జరుగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Also: Fake Video on Pension: పెన్షన్‌పై ఫేక్ వీడియో.. మాస్ పుష్ప అరెస్ట్..
ఎన్ ఆర్ ఈ జీఎస్ వర్కులు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్ల ద్గర పర్సంటేజీలు దండుకున్నారనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గంలో విజయభాస్కర్ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు రాజకీయ ప్రత్యర్థులు. తాము నిరుపేద కుటుంబం నుంచి వచ్చామని ఎన్నికల టైంలో చెప్పిన ఎమ్మెల్యే గెలిచాక కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే… నాలుగు రకాల కొత్త కార్లను ఎలా కొన్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు స్థానిక వైసీపీ నాయకులు. ఏజెన్సీలో ఎమ్మెల్యే దంపతుల అండతో టీడీపీ నేతలు అక్రమ ఇసుక దందాకు తెరతీశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి. ఎటువంటి అనుమతులు లేకుండా తిమ్మాపురం – బొంగరాలపాడు యేటిలో భారీగా ఇసుక తవ్వారని ఆరోపిస్తున్నారామె. ఇసుక రవాణాకు పర్మిషన్లు లేకపోయినా, ట్రాక్టర్లకు టీడీపీ జెండాలు కట్టి, మరీ దందా నిర్వహించారని విమర్శించారు. ఈ కాలువలోకి దిగి, ఇసుక కోసం తీసిన గోతుల్లో పడి ఏలేశ్వరం మండలం లక్ష్మీపురానికి చెందిన నలుగురు యువకులు చనిపోయారని, ఆ పాపమంతా ఎమ్మెల్యే మనుషులదేనని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే. గడిచిన ఏడాదిన్నరలో ఏజెన్సీలో జరిగిన పరిణామాలపై బహిరంగ వేదిక మీద చర్చకు సిద్ధమని సవాల్ చేశారామె. ఆ సవాల్‌కు ఎమ్మెల్యే రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
