Off The Record: పోసాని కృష్ణ మురళి.. ప్రస్తుత వృత్తి నటన. ప్రవృత్తి రాజకీయం. అంతకు ముందు రచయిత, దర్శకుడు, నిర్మాత. రాజకీయాలంటే పోసానికి తెగ మోజు. ఏ పార్టీని నమ్మతినే ఆ పార్టీని, నాయకుల్ని నెత్తిన పెట్టుకునే కృష్ణమురళి.. అప్పట్లో టీడీపీకి మద్దతుగా పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరి చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అటు రాజకీయాలు.. ఇటు.. సినిమాలతో రెండు పడవల ప్రయాణం చేసే పోసాని ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా కూడా పని చేస్తున్నారాయన. గతంలో ఓ సారి వైసీపీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ను ఏకి పారేశారు పోసాని. దాంతో పవన్ పార్టీ వాళ్లంతా ఆయన వెంట పడి వేధించారు. ట్రోల్స్‌తో విసిగించారు. ఫోన్ కు నానా బూతులతో మెసేజ్ లు చేసి వేధించారని అప్పట్లో వాపోయారాయన. అవన్నీ చూసి చూసి.. విసిగిపోయిన పోసాని.. ప్రెస్ మీట్ పెట్టి పవన్ ను, ఆయన ఫ్యామిలీని దుమ్ము దులిపేశారు. తీవ్ర వ్యాఖ్యలే చేశారు ఆ టైంలో. అంతకు ముందు రాజకీయాల గురించి మాట్లాడినా.. సినీ పరిశ్రమ గురించి, అందులోని పెద్దల జోలికి వెళ్లే వారు కాదు పోసాని.
కానీ.. తనను విసిగిస్తూ తన సహనానికే పరీక్ష పెట్టిన జనసైనికులను భరించలేక నాడు బరస్ట్ అయ్యారట. ఎ టూ జడ్…. ఎన్ని రకాల తిట్లు ఉంటాయో అన్నీ తిట్టేశారు ఆ ప్రెస్ మీట్ లో పోసాని. ఆయన ఇచ్చిన ఆ రియాక్షన్ కు ట్రోల్స్ ఆగిపోయాయి. మెసేజ్ లు నిలిచిపోయాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ…. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న పోసాని ఆ తర్వాత ఖాళీ అయిపోయారట. మెగా కాంపౌండ్ ను ఎప్పుడైతే ఆయన టచ్ చేశారో… అప్పటి నుంచి వేషాలు తగ్గిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. రచయితగా కంటే వేషాలతోనే ఎక్కువగా గిట్టుబాటు అవుతుండటంతో పెన్‌ను పక్కన పెట్టేశారు పోసాని. మూడు వేషాలు… ఆరు కోట్లన్నట్టున్న ఆయన జీవితం మెగా కాంపౌండ్‌ను టచ్ చేశాక రివర్స్ అయ్యిందట.
చాలా రోజులపాటు పొలిటికల్ కామెంట్స్ కు దూరంగా ఉన్న పోసాని ఈ మధ్య మళ్లీ మీడియా ముందుకు వస్తున్నారు. ఆశ్చర్యకరంగా అంతకు ముందు తానే తిట్టిపోసిన పవన్ కల్యాణ్‌ను మంచివాడని కితాబు ఇస్తున్నారు. పవన్ ఫస్ట్ హిట్ సినిమా గోకులంలో సీతకు కథ నేనే రాశా… అప్పుడూ ఇప్పుడూ పవన్ మంచివాడే… అంటున్నారు. ఆయన్ని చెడగొడుతోందంతా.. చంద్రబాబేనని మాట్టాడుతున్నారు పోసాని. సీఎంగా జగన్ చాలా బాగా చేస్తున్నారు… కానీ చంద్రబాబు మిమ్మల్ని తప్పుదోవపట్టిస్తున్నారు… వాస్తవాలు తెలుసుకోండి కల్యాణ్ బాబూ… అంటూ వినమ్రంగా చెబుతున్నా పోసాని. చిరంజీవిని నంబర్ వన్ మనిషి అని కితాబు ఇస్తున్నారు కూడా. ఇంతలో అంత మార్పు ఎందుకూ.. ఏమిటీ.. అంటే.. అదంతా వేషాల మీద పడ్డ ఎఫెక్టేనన్నది ఫిల్మ్ నగర్ టాక్. కానీ.. ఇలాంటి వాటిని లెక్కపెట్టే రకం కాదు పోసాని. తనకు నష్టం జరిగినా మైండ్ లో ఏది అనిపిస్తే అదే చెప్పడం ఆయన అలావాటన్న వాదనా ఉంది. అయితే అదంతా కెరీర్ వెలిగిపోయినప్పుడు.
ఇప్పుడు పరిస్థితి మారింది కాబట్టి.. ఆయన కూడా మారారా? అనే డౌట్ కొడుతోందట దగ్గరగా గమనిస్తున్న వారిలో. సాఫ్ట్ కార్నర్ మొత్తం తెర ముందేనని, తెర వెనుక మాత్రం పవన్ ను ఏకి పారేస్తున్నారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. పవన్ పని అయిపోయిందని.. ఎన్నేళ్లు ఉన్నా రాజకీయాల్లో రాణించే ఛాన్సేలేదని ఆఫ్ దరికార్డ్‌గా అంటున్నారట పోసాని. ఎంతైనా కోపం కోపమే కదా…. తనను, తన ఇంట్లో వాళ్లని అంతేసి మాటలన్న వాళ్లని ఆయన ఎలా మర్చిపోగలడంటున్నారు మార్పును గమనిస్తున్నవారు. కాకుంటే మీడియా ముందు మాత్రం…. ఉభయతారకంగా బాబూ…. పవన్ బాబూ అంటూ కవరింగ్ ఇస్తున్నార పోసాని. ఈ రింగులు, కవరింగులు ఎంత మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
