Off The Record: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను జీరో చేసేశామని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నియోజకవర్గంలో రోజూ ఘర్షణ జరుగుతున్న కారణంగానే… అలా చేయాల్సి వచ్చిందని కామెంట్ చేశారు కాకినాడ జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ. నాలుగు నెలల నుంచి వర్మ ఇస్తున్న స్టేట్‌మెంట్స్ వల్లే ఆ పరిస్థితి వచ్చిందని, ఇదంతా ఆయన స్వయంకృతమేనని క్లారిటీ ఇచ్చారు మంత్రి. తనని జీరో చేసినట్లు వర్మకు తెలుసునని, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిఠాపురంలోవివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదుకదా అన్న అన్నది ఆయన అభిప్రాయం. ఇప్పుడు ఇదే విషయమై పిఠాపురంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ లెక్క ప్రకారం కూటమి కొనసాగినన్నాళ్ళు…. వర్మకు పదవి రాదని చెప్పుకుంటున్నారు. ఈ విషయం గురించే మంత్రి ఆ స్థాయిలో క్లారిఫికేషన్ ఇచ్చి ఉంటారని గుర్తు చేస్తున్నారు. ఎక్కడ తగ్గాలో తెలియకుండా… వర్మ మరీ స్పీడ్ అయిపోవడం వల్లనే ఈ పరిస్థితులు వచ్చాయన్నది తాజా అభిప్రాయం. అందుకే ఆయన్ని జీరో చేసేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి..
పిఠాపురంలో మరో పవర్ సెంటర్ డెవలప్ అయ్యే విషయమై జనసేన నుంచి తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయట. మాజీ ఎమ్మెల్యే స్వతంత్రంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని, తన మార్క్ ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నమే ఆయనకు మైనస్ అయిందని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయమై పంచాయితీ సీఎం స్థాయికి వెళ్ళింది కాబట్టే ఇంత రచ్చ జరిగిందని అంటున్నారు లోకల్ లీడర్లు. ఇదే వర్మ స్థానంలో…లౌక్యం తెలిసిన, సాఫ్ట్‌గా ఉండే మరో లీడర్ ఉండి ఉంటే… ఈ పాటికి పదవి వచ్చేసి ఉండేదని టీడీపీ కేడరే మాట్లాడుకుంటున్న పరిస్థితి. అటు వర్మ వర్గం కూడా నారాయణ మీద బరస్ట్ అయిపోతున్నారట. ఎక్కడో నెల్లూరులో జరిగిన పంచాయతీలకు, మా లీడర్‌కి లింక్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన నియోజకవర్గం వ్యవహారాలు సరి చేసుకుంటే చాలు… అంతకుమించి పరిధి దాటి మాట్లాడితే చాలా తేడాలు వస్తాయని అంటున్నారు. అయినా ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తు లేవా అని ప్రశ్నిస్తున్నారట మాజీ ఎమ్మెల్యే అనుచరులు. ఎన్నికల సమయంలో హీరోగా కనిపించిన వర్మ ఇప్పుడు జీరో ఎలా అయ్యారన్నది వాళ్ళ క్వశ్చన్. ఇదే టోన్ అప్పుడు ఎందుకు రాలేదని నిలదీస్తున్నారు.
వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రమోట్ చేస్తామని స్వయంగా చంద్రబాబు బహిరంగంగా చెప్పారు. ఆ విషయాలు మరుగున పడిపోతే ఎలాగంటూ మండిపడుతున్నారట వర్మకు అత్యంత సన్నిహితులు. పిఠాపురంలో వర్మకి జనసేనకి మొదటి నుంచి చాలా గ్యాప్ ఉంది.. డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి వచ్చినప్పుడు తప్ప మిత్రపక్షంతో కలిసి వేదిక పంచుకోవడానికి కూడా మాజీ ఎమ్మెల్యే ఇష్టపడడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు డైరెక్ట్‌గా జీరో అనడం, అది కూడా సొంత పార్టీ మంత్రి ప్రస్తావించడంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన మరీ అంత పనికిరానివాడైతే… అంతకు ముందు ఎందుకు ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చిందో చెప్పాలన్నది వర్మ వర్గం క్వశ్చన్. అప్పుడే ఇలా మాట్లాడి ఉంటే… దాని ప్రభావం రిజల్ట్‌లో కనిపించేది కదా అన్నది వాళ్ళ మాట. గతంలో వర్మ ఇండిపెండెంట్‌గా గెలిచారని, ఆ విషయాన్ని ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన నారాయణ గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు. మరోవైపు ఈ మొత్తం పరిణామాలతో వర్మకి పదవి వచ్చే పరిస్థితి లేదనుకుంటూ… ఫుల్ జోష్ లోకి వెళ్లిపోయారట జనసేన నాయకులు. మొత్తం మీద… తీరు మార్చుకోకపోతే మాజీ ఎమ్మెల్యేకు పదవీ యోగం లేదని, ఆ విషయాన్ని ఎక్కువ సాగదీయకుండా చెప్పేశారని, ఇప్పుడిక ఆయనేం చేస్తారు, అందుకు పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
