NTV Telugu Site icon

Off The Record: రేవంత్ రెడ్డి వరుస ప్రెస్‌ మీట్లు.. టార్గెట్‌ ఏంటి..?

Revanth Reddy

Revanth Reddy

Off The Record: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గడిచిన…వరుసగా మీడియా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో రోజు.. ఒక్కో సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములపై ఆయన ప్రశ్నిస్తున్నారు. హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారధికి కేటాయించిన భూముల వ్యవహారంలో ఐదు వేల కోట్ల ప్రజాధనం ప్రభుత్వానికి రాకుండా పోయిందని ఆరోపించారు. కేసీఆర్‌ తెచ్చిన జీవోనే… తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తూ…భూములు కేటాయిస్తున్నారని విమర్శించారు. దీనికి కొనసాగింపుగా హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో యశోద ఆసుపత్రి యాజమాన్యానికి కేటాయించిన భూముల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ పరంపర కొనసాగిస్తానంటూ రేవంత్ ప్రకటించారు. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డికి కేటాయించిన 25 ఎకరాల భూముల అంశాన్ని కూడా బయట పెడతానంటూ హెచ్చరించారు పీసీసీ చీఫ్‌. చెప్పినట్లుగానే శరత్‌చంద్రారెడ్డికి కేటాయించిన భూ కేటాయింపుల వివరాలను బయటపెట్టారు.

వరుస మీడియా సమావేశాల వెనక రేవంత్ వ్యూహం ఏంటన్న దానిపై చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు…ఈ ఏడాది చివరిలో జరగనున్నాయ్. ప్రభుత్వానికి అండగా బడా కాంట్రాక్టులు ఉంటున్నారనేది ఓపెన్ సీక్రెట్. వచ్చే నెలలో కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో కూడా జేడీఎస్‌కు నిధులు సమకూర్చుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో…జేడీఎస్‌కు బీఆర్ఎస్‌ ఆర్థికంగా మద్దతు ఇస్తోందని పీసీసీ పదే పదే చెబుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు బీఆర్ఎస్‌ నుంచి నిధులు వెళ్లకుండా అడ్డుకునేందుకు …పీసీసీ చీఫ్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు కాంట్రాక్టర్లను కట్టడి చేసే వ్యూహం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించడం కూడా…అందులో భాగమే అంటోంది రేవంత్ కోటరీ.

మరోవైపు బిజెపిని కూడా ఇరుకునపెట్టే ఎత్తుగడలో రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది. టిఆర్ఎస్ అవినీతిపై విచారణ చేస్తామంటూ బిజెపి నేతలు పదేపదే ప్రకటిస్తున్నారు. తెలంగాణలో భూముల విక్రయాల్లో జరుగుతున్న అక్రమాలపై…కేంద్రం ఎందుకు విచారణ చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో భూములని ఆంధ్ర ప్రభుత్వం దోచేస్తోందని…ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రధానంగా ఆరోపించారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నదేంటి ? అనే అంశాల్ని జనంలో పెట్టాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే భూ కేటాయింపులపై రేవంత్ వరుస ప్రెస్ మీట్లని జోరుగా చర్చ సాగుతోంది. గతంలో కోకాపేట భూముల వ్యవహారంలో ప్రభుత్వ కేటాయింపులపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత పార్టీలో కొంతమంది నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆయన భూముల కొనుగోలుపై మాట్లాడడం మానేశారు. తాజాగా భూ కేటాయింపులపై…వరుసగా మాట్లాడుతున్నారు. రేవంత్‌రెడ్డి అసలు వ్యూహం ఏంటి..? అనేది కాలమే సమాధానం చెప్పాలి.