NTV Telugu Site icon

Off The Record: పార్వతీపురం టీడీపీలో మూడు ముక్కలాట..!

Tdp

Tdp

Off The Record: ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తోందట. ముఖ్య నాయకులు ఆధిపత్యపోరుతో పార్టీని బజారుకీడుస్తున్నారన్నది ఇక్కడి కేడర్ ఆవేదన. నియోజకవర్గంలో పార్టీకి ముఖ్య నాయకులుగా ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు, ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సిట్టింగ్‌ ఎమ్మెల్యే విజయ్ చందర్. ఇద్దరు సీనియర్లను సీన్‌ నుంచి తప్పించేందుకు విజయ్‌చందర్‌ పావులు కదుపుతున్నారట. ఎన్నికల్లో వాళ్లు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ ఆధారాలతో సహా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తొలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వీరి మధ్య విభేదాలకు చెక్‌ పెట్టేందుకు ఈసారి మరో నాయకుడు విజయ్ చందర్‌ని తెర మీదికి తీసుకువచ్చింది పార్టీ అధిష్టానం. తొలుత ముగ్గురూ కలిసి మెలసి ఉన్నా… తర్వాత మెల్లిగా ఆధిపత్య పోరు మొదలైంది.

Read Also: Insta Reels: పని పక్కన పడేసి రీల్స్ చేస్తోందన్న కోపంతో భార్యను చంపిన భర్త..

గతంలో తమలో తామే విభేదించుకున్న సీనియర్స్‌ ఇద్దరూ ఇప్పుడు ఎమ్మెల్యే ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఒక్కటయ్యారన్నది లోకల్‌ టాక్‌. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి విజయ చందర్ చెలరేగుతున్నారన్నది లోకల్‌ టాక్‌. అది కూడా ప్రత్యర్థుల మీద కాకుండా… సొంత పార్టీ నేతలు.. వాళ్ల బంధువులపై ప్రతాపం చూపుతున్నారట. జగదీష్ తమ్ముడు తిరుపతి నాయుడు మున్సిపల్ కాంట్రాక్టర్.. ఈయన వరాలగడ్డపై నిర్మాణం చేస్తుండగా ఆ పనుల్ని ఎమ్మెల్యే నిలిపివేయించినట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు మున్సిపల్ పరిధిలో మాజీ ఎమ్మెల్సీ జగదీష్ తమ్ముడు చేస్తున్న కాంట్రాక్ట్ వర్క్ తాత్కాలికంగా అపేలా సిబ్బందికి మౌఖిక ఆదేశారు ఇచ్చారట ఎమ్మెల్యే. అలాగే మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు మీద కూడా విజయ్ చందర్ కక్ష కట్టినట్టు చెప్పుకుంటున్నారు. చిరంజీవులుకు ఎవ్వరు గౌరవం ఇవ్వవద్దని కేడర్‌ని ఆదేశించినట్టు తెలిసింది. ఇటీవల చిరంజీవులు సొంత గ్రామంలో సమావేశం పెట్టి కూడా ఆయనకు ఆహ్వానం అందకుండా అడ్డుకున్నారట ఎమ్మెల్యే విజయ చందర్.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

ఇలాంటి చర్యలతో ఆయన కక్ష సాధింపులకు దిగితున్నారంటూ… చిరంజీవులు, జగదీష్ కేడర్‌ దగ్గర గోడును వెళ్లబోసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట.దీంతో, జగదీష్ నేరుగా విజయనవాడ వెళ్లి పార్టీ పెద్దలకు విషయం చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే విజయ్ చందర్ మాత్రం తన వర్గంతో పార్వతీపురంలో సమావేశం పెట్టించి జగదీష్, చిరంజీవులు గత ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, వారి నాయకత్వం తమకు వద్దంటూ ఏకంగా తీర్మానం చేయించేశారు. ఇదంతా చూస్తున్న కేడర్‌ మాత్రం ఇదెక్కడి గొడవరా బాబూ… అవతలోళ్ల సంగతి చూడాల్సిన నాయకులు తమలో తామే కొట్టుకుంటూ… పరువు బజారుకు లాగుతున్నారని మొత్తుకుంటున్నారు. పార్టీ అధిష్టానం ఈ కుమ్ములాటను చూసీ చూడనట్టుగా వదిలేస్తుందా? లేక ఆదిలోనే ఫుల్‌స్టాప్‌ పెడుతుందా అన్నది చూడాలంటున్నారు అబ్జర్వర్స్‌.