NTV Telugu Site icon

Off The Record: ఒవైసీల ఫ్యామిలీ నుంచి మూడో తరం అరంగేట్రం.. వారసుడొచ్చాడు..!

Noor Uddin Owaisi

Noor Uddin Owaisi

Off The Record: ఒవైసీల కుటుంబం నుంచి మరో తరం పొలిటికల్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడో తరం నాయకుడు నూరుద్దీన్‌ ఒవైసీని బరిలో దింపేందుకు గ్రౌండ్‌ సిద్ధమవుతోంది. మజ్లిస్‌ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ కుమారుడే నూరుద్దీన్‌. అక్బర్‌ సోదరుడు, పార్టీ అధినేత అసదుద్దీన్‌ కూడా ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది. తమకు తిరుగులేని పట్టున్న చార్మినార్‌ నియోజకవర్గం నుంచే వారసుడితో పొలిటికల్‌ అరంగేట్రం చేయించాలనుకుంటున్నా.. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదట. అధినేత వారసుడి కోసం సీటు వదులుకునేందుకు అక్కడి సిటింగ్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ సిద్ధంగా లేకపోవడమే అందుకు కారణం అంటున్నారు.

Read Also: Minister Talasani: శ్రీరాముడుపై ఒట్టేసి ఆరోపణలు రుజువు చేస్తారా.. బీజేపీకి తలసాని సవాల్

ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి తాను తప్పుకోవాల్సి వస్తే.. పక్కనే ఉన్న యాకుత్‌పుర సీటు ఇవ్వాలని కోరుతున్నారాయన. యాకుత్‌పుర నుంచి గతంలో వరుసగా ఐదుసార్లు గెలిచారు ముంతాజ్‌. ప్రస్తుతం యాకుత్‌పుర సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా అహ్మద్‌ పాషా ఖాద్రీ అనారోగ్యం కారణంగా ఈ సారి ఎన్నికల్లో పోటీచేయట్లేదు. అదే సమయంలో నాంపల్లిలో తీవ్రమైన పోటీ ఉన్నందున అక్కడి సిటింగ్‌ ఎమ్మెల్యే జాఫర్‌ హుసేన్‌ను యాకుత్‌పురాకు మార్చి.. నాంపల్లిలో మాజీ మేయర్‌ మాజిద్‌ హుసేన్‌ను బరిలో నిలపాలని పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది.

Read Also: Rebel: ప్రభాస్ టైటిల్ తో వస్తున్న కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

ఇప్పుడు ముంతాజ్‌ఖాన్‌కు యాకుత్‌పుర ఇస్తే.. నాంపల్లి నుంచి జాఫర్‌, మాజిద్‌ హుసేన్‌లో ఒక్కరికే అవకాశం ఉంటుంది. ఈ విషయమై అక్బరుద్దీన్‌ ఇప్పటికే ముంతాజ్‌ ఖాన్‌తో చర్చించారట. అయితే.. యాకుత్‌పుర ఇస్తేనే చార్మినార్‌ను వదులుకుంటానని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు తెలిసింది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఒవైసీల మూడో తరం పొలిటికల్‌ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల టైంలోనే నూరుద్దీన్‌ను బరిలో దింపాలనుకున్నా.. అప్పుడు ఆయనకు వయసు చాల్లేదని ఆగినట్టు తెలిసింది. ఇప్పుడు నూరుద్దీన్‌ ఒవైసీ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తే.. ఒవైసీల ఫ్యామిలీ నుంచి మూడో తరం రాజకీయాల్లోకి వచ్చినట్టు అవుతుంది.

Show comments