Off The Record: ఏ రోటి కాడ ఆ పాట… సామెత గురించి విన్నాం.. అలాగే పూటకో మాట.. రోజుకో బాట గురించీ… తెలుసు. ఈ రెంటినీ… వేర్వేరు సందర్భాల్లో వాడటం వరకే ఇప్పటివరకు చూశాం. కానీ… ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ అవ్వాలని కలలుగంటున్న జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం రెంటినీ మిక్స్ చేసి మిక్సీలో వేసి మరీ… ప్రతిరోజూ విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ముందు రోజు ఏం మాట్లాడతారో.. కరెక్ట్‌గా దానికి విరుద్ధంగా మర్నాడే మరో స్టేట్‌మెంట్ వస్తుంది. ఈ వైఖరిని, ఆ మాటలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కిందా మీదా పడుతున్నారట పార్టీ లీడర్స్, కేడర్. ఇప్పటి వరకు ఈ గందరగోళం కేవలం జనసేనకే పరిమితమైంది. కానీ… పొత్తు కారణంగా ఇప్పుడు టీడీపీకి కూడా తప్పేట్టు లేదంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ చేసే ప్రతి కామెంట్ ప్రభావం కచ్చితంగా తెలుగుదేశం మీద ఉంటుంది. అందుకే ఆ పార్టీలో కూడా కంగారు మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. నాలుగో విడత వారాహి యాత్రలో పవన్‌కళ్యాణ్ రోజుకో షేడ్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ గురించి అన్న మాటలు ఇటు సొంత పార్టీతో పాటు.. మిత్రపక్షంగా ఉన్న టీడీపీని, మిత్రుడో.. శత్రువో తేల్చుకోలేకపోతున్న బీజేపీని కూడా బిగ్ డైలామాలో పడేశాయట. పెడన సభలో ఎన్డీఏ నుంచి బయటకొచ్చేశానని స్పష్టంగా చెప్పారు పవన్. ఆ తర్వాత రోజు ముదినేపల్లిలో అంతా తూచ్ నేను ఎన్డీఏలోనే ఉన్నాను.. ఎక్కడికి వెళ్లలేదన్నారు. దీంతో ఇదెక్కడి గొడవరా బాబూ… అని అంతా చేతులు నెత్తిన పెట్టుకుంటున్న పరిస్థితి. అదే ఊపులో టీడీపీ చాలా బలహీనంగా ఉంది.. నేనే ఆ పార్టీకి సేవియర్ అనే రీతిలో చేసిన కామెంట్స్ ఆ పార్టీ నేతల్ని ఇరకాటంలో పడేశాయట. పైకి చెప్పకున్నా… ఆ మాటలతో టీడీపీ శ్రేణులు తెగ ఫీలైపోతున్నట్టు తెలిసింది. ఇదేం రాజకీయం.. ఇదెక్కడి గందరగోళం అంటూ నిట్టూరుస్తున్నారట తెలుగుదేశం కార్యకర్తలు.
అసలు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని ఎందుకు చెప్పారు? ఆ తర్వాత కూటమిలోనే ఉన్నానని ఎందుకు మాట తిప్పారన్నది ఎవరికీ అర్ధంగాని పరిస్థితి. ఇలా అడ్డదిడ్డంగా.. ఇష్టానుసారం మాట్లాడుతుంటే…రాజకీయాల్లో పవన్ పలుచన కావడంతో పాటు.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న తాము కూడా ఇరుకున పడతామా అన్నది టీడీపీ వర్గాల్లో కొత్తగా మొదలైన చర్చ. కష్టమో.. నష్టమో.. ఓ నిర్ణయం తీసుకోవాలి.. దానికి కట్టుబడి ఉండాలి. కానీ ఈ తరహాలో పూటకో మాట మారుస్తుంటే…. కష్టమంటున్నారు. పైగా… టీడీపీకి అనుభవం ఉందని ఓవైపు వెన్న రాస్తూనే.. మరోవైపు బలహీనంగా ఉందంటూ మంట పెట్టడం ఏంటని గుర్రుగా ఉన్నారట కేడర్. గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లు దక్కించుకున్న తమను బలహీనమైన పార్టీగా పవనే స్వయంగా ముద్ర వేసే ప్రయత్నం చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు. ఇలా చేస్తే తమకు బలంగా మారాల్సిన పవన్ బలహీనత అవుతారేమోనన్న ఆందోళన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోందట. టీడీపీని కించపరిచే విధంగా మాట్లాడొద్దని పవన్ తన కేడర్‌కు ఓవైపు చెబుతూనే.. మరోవైపు తానే డ్యామేజ్ చేసే విధంగా కామెంట్లు చేస్తే ఎలా అంటున్నారు. ఇదే సందర్భంలో మరోరకమైన చర్చ కూడా ఉంది.వాస్తవానికి బీజేపీతో కలిసి వెళ్దామని పవన్ కళ్యాణ్‌కు బలంగా ఉందని.. అదే సమయంలో రాష్ట్రం కోసం.. ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టీడీపీతో కలిశానని చెప్పే ప్రయత్నంలో పొరపాటున మాట దొర్లిందన్న విశ్లేషణ కూడా ఉంది. దాన్ని సరి చేసేందుకే.. మర్నాడు సభలో తాను ఎన్డీఏలోనే ఉన్నట్టు చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఇది మాట దొర్లడంలో జరిగిన తప్పిదమే తప్ప.. పాలసీ డెసిషన్‌లో వచ్చిన మార్పు కాదని అంటున్నారు.
ఇక టీడీపీ బలహీనపడిందనే కామెంట్‌పై కూడా పవన్ ఆలోచన వేరే అంటున్నారు. పొత్తు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదని.. ఓట్ ట్రాన్సఫర్ జరగాల్సిన అవసరం ఉందని, ఆక్రమంలోనే జనసేన కేడర్‌ను మానసికంగా సిద్దం చేయడంతో పాటు.. ఓట్ ట్రాన్సఫర్ కోసం అలా మాట్లాడి ఉండవచ్చని అంటున్నారు కొందరు టీడీపీ నేతలు. ఆ మాటలు తమను ఇబ్బంది పెట్టేవే అయినా…వాటి వెనుకున్న భావాన్ని ప్రజల్లోకి వేరే విధంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటున్నారు. ఒక వ్యక్తిలో ఇన్ని వేరియేషన్స్… అందులోనూ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న లీడర్స్ ఎవరిలోనూ చూడలేదంటున్నారు టీడీపీ నేతలు. దీనివల్ల పొత్తును విచ్ఛిన్నం చేయాలనుకునే వాళ్ళ పని తేలిక అవుతుందన్న కంగారు కూడా పెరుగుతోందట టీడీపీ వర్గాల్లో. ముందు ముందు ఇంకెన్ని వేరియేషన్స్ బయటికి వస్తాయో చూడాలి.
