Off The Record: వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి గట్టిపట్టున్న నెల్లూరు జిల్లాలో ఈసారి వైట్ వాష్ అయింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి కూటమి గాలి వీచినా.. నెల్లూరు జిల్లాలో మాత్రం ఏడు అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది వైసీపీ. ఇక 2019లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసేసింది. కానీ… 2024కు వచ్చేసరికి మొత్తం తిరగబడి ఒక్క సీట్లోనూ గెలవలేక చతికిలపడింది ఫ్యాన్ పార్టీ. ఈసారి కనీసం ఏడు సీట్లలోనైనా గెలుస్తామనుకున్న జిల్లా వైసీపీ లీడర్స్‌కు ఫలితాలు చూశాక నోట మాట రాలేదట. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పలువురు టిడిపి నేతలను లక్ష్యంగా చేసుకొని వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడంతోపాటు రకాలుగా వేధించారనే ఆరోపణలు ఉన్నాయి.. టిడిపి నేతలకు చెందిన గనులను బలవంతంగా లాక్కొని వైసీపీ వాళ్లే మైనింగ్ చేశారంటూ ఆందోళనలు సైతం జరిగాయి. దీంతో తాము అధికారంలోకి వస్తే.. అక్రమార్కుల తాట తీస్తామంటూ అప్పట్లోనే హెచ్చరించారు టీడీపీ లీడర్స్. తీరా.. ఫలితాలు ఇచ్చిన షాక్‌తో నాడు చురుగ్గా వ్యవహరించిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు నెల్లూరును వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లారు.
అలాగే… పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు చాలామంది. ఇటీవల ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కూడా ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారిలో పలువురు టిడిపి నేతలకు టచ్ లోకి వెళ్లినట్టుగా తెలిసింది. నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి ఎన్నికల దాకా పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నారు. కానీ.. తర్వాత టచ్ మీనాట్ అన్నట్టుగా ఉంటున్నారట. పార్టీలో ఇంకా యాక్టివ్‌గా ఉంటే.. తన వ్యాపారాలు దెబ్బతింటాయని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో స్వయంగా పార్టీ అధినేత జగన్ నెల్లూరు వచ్చినా.. నగర అధ్యక్షుడు హాజరవకపోవడం చర్చనీయాంశం అయింది. కావలి నియోజకవర్గంలో కూడా పలువురు వైసీపీ నేతలు.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. గ్రావెల్.. ఇసుక.. గనులతో పాటు భూ కబ్జాలు చేశారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం వాళ్ళలో చాలామంది ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారట. గతంలో పార్టీలో చురుగ్గా పనిచేసిన మరి కొందరు నేతలు కూడా కార్యక్రమాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. గూడూరు నియోజకవర్గ వైసిపిలో కీలకంగా వ్యవహరించిన నేత సిలికా.. మైనింగ్‌తో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో తెల్లరాయి తవ్వకాలను జరిపారు. జగన్ కి అత్యంత సన్నిహితుడని ప్రచారం చేసుకునే ఆ నేత.. ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
గతంలో జగన్ జిల్లాకు వచ్చినప్పుడు హడావిడి చేసే ఆ నేత ప్రస్తుతం కనిపించడం లేదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. కోవూరు నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నేతలు కూడా అనారోగ్య కారణాలతో పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదట. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ ఇద్దరూ భూములను ఆక్రమించుకోవడంతో పాటు ఇష్టానుసారంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం..గ్రావెల్ తవ్వకాలను చేసినట్టు ఆరోపణలున్నాయి. మరో ఇద్దరు కూడా బెంగళూరులో వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమై అక్కడే ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అధికార బలంతో నాడు తమను ఇబ్బంది పెట్టిన నాయకుల పేర్లు, వారి కార్యకలాపాలతో నెల్లూరు జిల్లా టీడీపీ ఒక లిస్ట్ తయారు చేసినట్టు తెలిసింది.దాని ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావించిన వైసీపీ నేతలు.. ఒక్కొక్కరే సైలెంట్ అయిపోతున్నారట. జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి జగన్ వచ్చినప్పుడు ఈ లోటు కొట్టొచ్చినట్టు కనిపించిందన్నది పార్టీ వర్గాల మాట. అండగా ఉండాల్సిన నేతలే తప్పించుకు తిరుగుతుండడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. ఇప్పటికైనా సీనియర్ నేతలు చొరవ తీసుకొని పార్టీ క్యాడర్‌ను కాపాడుకునే ప్రయత్నాలు చేయకుంటే…. ముందు మందు మరిన్ని ఇబ్బందులు తప్పవన్న ఆవేదన వ్యక్తమవుతోందట పార్టీ వర్గాల్లో.