Off The Record: తుని రైలు దహనం కేసులు కొట్టేశాక పొలిటికల్ రీ ఎంట్రీ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు ముద్రగడ పద్మనాభం. 2009 ఎన్నికల్లో ఓడిపోయాక ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై చెప్పిన కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్లాట్‌ఫాం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార పార్టీపైనే మనసు పడుతున్నట్టు ఆయన మాటలు, చేతలు చెబుతున్నాయి. కానీ…జరుగుతున్న పరిణామాలు మాత్రం అది వన్‌సైడ్ లవ్వేనా అన్న అనుమానాలను పెంచుతున్నాయట. నేనున్నానని ముద్రగడ ఎన్ని రకాలుగా సంకేతాలు పంపుతున్నా… వైసీపీ వైపు నుంచి వీసమెత్తు స్పందన కూడా లేకపోవడంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.
జూన్‌లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ఆ టైంలో పవన్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు ముద్రగడకు గట్టిగానే తగిలాయట. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని నేను ఎప్పుడూ బాగుపడలేదని, ఇంకా చెప్పాలంటే నష్టం జరిగిందని.. సొంత సామాజిక వర్గం కోసం మీరు ఎందుకు ఫైట్ చేయలేదని నాడు జనసేన అధ్యక్షుడిని ప్రశ్నించారు పద్మనాభం. అక్కడితో ఆ ఎపిసోడ్ కి ఎండ్ కార్డు పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ.. తర్వాత జరిగిన సభలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి పై ఆరోపణలు చేశారు పవన్. వాటిని ఖండిస్తూ…పవన్ ఫ్యాన్స్ నన్ను కూడా టార్గెట్ చేశారని మరో లేఖాస్త్రం విడుదల చేశారు ముద్రగడ. పిఠాపురంలో నువ్వో.. నేనో తేల్చుకుందాం రమ్మని పవన్‌ను ఛాలెంజ్ చేశారు.
సందట్లో సడే మియాలా ఈ సవాళ్ళు, ఈక్వేషన్స్ తనకు కలిసి వచ్చి వైసీపీ పిలిచి పిఠాపురం సీటు ఇస్తుందని ఆశించారట ఆయన. పవన్‌కళ్యాణ్ మీద పోటీకి తానే దీటైన అభ్యర్థిని అని వైసీపీ అధిష్టానానికి నమ్మకం కలిగించేలా ఆయన మాట్లాడారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. ఒక అడుగు ముందుకు వేశాను కాబట్టి అధికార పార్టీ తనను సంప్రదిస్తుందని లెక్కలు వేశారట ఆయన. పవన్‌ను ఢీ కొట్టడానికి తనకంటే బెటర్ అభ్యర్థి ఫ్యాన్ పార్టీకి దొరకబోరని అనుచరులకు కూడా చెప్పేశారట ముద్రగడ. ఎన్నికలకు సిద్ధం కావాలని, ఇక 10 నెలలు మాత్రమే సమయం ఉంది కాబట్టి మన వాళ్ళందరినీ కలుపుకొని పోవాలంటూ అంతర్గత సమావేశాలు పెట్టి మరీ… అనుచరుల్ని ట్యూన్ చేశారట. ఈ రేంజ్‌లో తన స్పందనని వైసీపీ కూడా ఊహించి ఉండదదని, పిఠాపురం టిక్కెట్ నాకు కాక ఇంకెవరికి ఇస్తారంటూ సన్నిహితుల దగ్గర గొప్పలు పోయారట ముద్రగడ.
ఈ ఎపిసోడ్ జరిగి పది రోజులు గడుస్తున్నా…అట్నుంచి స్పందన రాకపోవడంతో ఏం చేయాలో అర్ధంకాని గందరగోళంలో ఉన్నారట ముద్రగడ పద్మనాభం. తానొకటి తలిస్తే… వైసీపీ అధినాయకత్వం ఇంకోటి తలుస్తున్నట్టు చెబుతున్నాయి తాజా పరిణామాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ని పార్టీలో చేర్చుకోవడం కంటే… బయట నుంచి మద్దతు తీసుకోవడమే బెటరని అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. పద్మనాభం కంటే…ఆయన కొడుక్కి సీటు ఇచ్చే ప్రతిపాదనే మేలని లెక్కలు వేసుకుంటున్నట్టు తెలిసింది. వైసీపీ జిల్లా నేతలు సైతం ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లారట. ముద్రగడ మాత్రం ఒకరిద్దరికి ఫోన్ చేసి.. పార్టీలో నా గురించి ఏమనుకుంటున్నారు? చర్చ ఏదైనా జరుగుతోందా అని ఆరా తీస్తున్నారట.
వాళ్ళు కూడా… అబ్బే… మీలాంటి పెద్ద వాళ్ల గురించి మమ్మల్ని ఎందుకు అడుగుతారు.. మీ అనుభవం అంత ఉండదు మా వయసు. అన్ని లెక్కలు వేసుకుని అధిష్టానమే మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తుందంటూ నైస్‌గా తప్పించుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో ఏం మాట్లాడాలో పాలుపోని స్థితిలో ఉన్నారట పద్మనాభం. మొత్తానికి పవన్ ఎపిసోడ్‌ని వాడుకుని….వైసీపీ ద్వారా గ్రాండ్‌గా పొలిటికల్ రీ ఎంట్రీ ఇద్దామనుకున్న ముద్రగడ లెక్కలు తప్పాయన్నది లోకల్ టాక్. అధికార పార్టీ సైతం ఆయన యవ్వారం పై ఆచి తూచి స్పందించాలనుకుంటున్నట్టు తెలిసింది. కూడికలు, తీసివేతల లెక్కలు వేసుకుని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కాకున్నా.. తర్వాతైనా… వైసీపీ ముద్రగడను నేరుగా పార్టీలోకి తీసుకుంటుందా లేక ఆయన్ని మరోలా ఉపయోగించుకుంటుందా అన్నది చూడాలి.
