NTV Telugu Site icon

Off The Record: అసెంబ్లీ బరిలో వైసీపీ ఎంపీ..?

Nandigam Suresh

Nandigam Suresh

Off The Record: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం…. ఒంగోలుకు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ దీని పార్లమెంట్ పరిధి మాత్రం బాపట్లలో ఉంటుంది. ఒంగోలుకు దగ్గర కావడంతో జిల్లా పరిధి ప్రకాశంలోనే ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరపున గెలిచారు. మొదట్లో బాగానే ఉన్నా… ఆ తర్వాత అధికారుల బదిలీలు, తనకు నచ్చిన వారికి పనుల కేటాయింపు లాంటి కారణాలతో ద్వితీయ శ్రేణి నేతలతో ఎమ్మెల్యేకు గ్యాప్ పెరిగిందట. చీమకుర్తి మినహా మిగిలిన అన్ని మండలాల్లోని ద్వితీయ శ్రేణి నేతలతో ఆయనకు చెడిందట. నాగులుప్పలపాడు, మద్దిపాడు, సంతనూతలపాడు మండలాల్లో ఎమ్మెల్యే తీరు నచ్చక కులాల వారీగా గ్రూపులు కట్టారట వైసీపీ నేతలు. దీంతో ఈసారి ఆయనకు సీటు ఇచ్చినా…గెలుపు డౌటేనన్న టాక్‌ మొదలైందట నియోజకవర్గంలో. అవినీతి ఎమ్మెల్యే మాకొద్దు.. కొత్త సమన్వయకర్త ముద్దంటూ సుధాకర్‌బాబుకు వ్యతిరేకంగా నాలుగు మండలాల్లోని వైసీపీ కార్యకర్తలు అధిష్టానానికి లేఖలు రాయడం, నియోజకవర్గంలో పోస్టర్లు వేయటం కలకలం రేపింది. దీంతో పాటు స్థానిక ఎస్సీ నేతలు ఇటీవల బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ని కలవటం చర్చనీయాంశంలా మారిందట.. నాలుగు మండలాలకు చెందిన దాదాపు వంద మందికి పైగా నేతలు ఎంపీని కలిసి సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తే తమ ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పారట.

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చేయటానికి ఆసక్తిగా ఉన్నారని ప్రచారంలో ఉండటం, అందుకు తగ్గట్టుగానే.. ఆయన సామాజిక వర్గానికే చెందిన వైసీపీ నాయకులు భేటీ కావటంతో ఇక ప్రచారం జోరందుకుంటోందట. ఎస్సీలతో పాటు ఇతర సామాజిక వర్గ నేతలు కూడా సుధాకర్‌బాబుకు బదులుగా నందిగం సురేష్‌ వస్తే… తమకేం ఇబ్బంది లేదని అంటున్నారట.
పైగా.. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులంతా ఆయన తప్ప ఇంకెవరైనా తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారట. ఎంపీ సురేష్ అయితే నియోజకవర్గ ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి పని తేలిక అవుతుందని చెబుతోందట ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం. మరోవైపు ఎమ్మెల్యే సుధాకర్ బాబు కూడా ఏ చిన్న అవకాశం దొరికినా తన సీటును నిలబెట్టుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట.. తానే పోటీలో ఉంటానని, కంగారు పడాల్సిన పని లేదని తన అనుచరులకు చెప్పుకుంటున్నారట.

ఎంపీ సురేష్ ఈసారి అసెంబ్లీ బరిలోనే నిలుస్తారని ఆయన వర్గీయులు చెబుతుండటంతో సంతనూతలపాడు నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువన్నది లోకల్‌ టాక్‌. ఎంపీ మనసులో ఏముందనేది ఇంత వరకూ స్పష్టత లేకున్నా…జరుగుతున్న ప్రచారం మాత్రం ఎమ్మెల్యే సుధాకర్ బాబును కలవరపెడుతోందట. ప్రాంతీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్లు ఖరారు చేసే వైసీపీ అధినాయకత్వం సంతనూతలపాడు విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.

ఈసారి ఆ వైసీపీ ఎంపీ అసెంబ్లీ బరిలో దిగుతారా.? l Off the Record l NTV