NTV Telugu Site icon

Off The Record: సడన్‌గా రెబెల్‌ లీడర్‌శాంతి మంత్రం.. హాట్‌ టాపిక్‌గా కోమటిరెడ్డి వైఖరి

Komatireddy

Komatireddy

Off The Record: పార్టీ మీటింగ్‌ అయినా… పబ్లిక్‌ మీటింగ్‌ అయినా… నీ యవ్వ… తగ్గేదేలా..ఇదీ ఇన్నాళ్ళు ఆయన నమ్మిన సిద్ధాంతం. మాటల మంటలు పుట్టించడమే ఇప్పటిదాకా ఆయనకు తెలిసిన రాజకీయం. కానీ… కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో… ఎవరో మంత్రం వేసినట్టుగా ఉన్నట్టుండి మార్పు వచ్చేసిందట. నెగ్గడం కాదు.. తగ్గడం కూడా నేర్చుకోవాలి బ్రదర్‌ .. అంటూ శాంతి మంత్రం జపిస్తున్నారట. అకస్మాత్తుగా అంత మార్పా? ఏంది కత? అని ఎంక్వైరీ చేస్తున్నారట ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు.

తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటికి వెళ్ళాక కాంగ్రెస్ పార్టీలో వెంకటరెడ్డి పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందట. దానికితోడు ఆయన చేసిన చేసిన కొన్ని కామెంట్స్‌తో అప్పట్లో పార్టీ మార్పు ఊహాగానాలు జోరుగా చక్కర్లు కొట్టాయి. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. మొదట్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కయ్యానికి కాలుదువ్విన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి… రేవంత్ తన జిల్లాకు రావద్దని, అంతా తానే చూసుకుంటానని చెప్పేశారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకూ హాజరుకాని కోమటిరెడ్డి.. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగిన ప్రియాంక గాంధీ సభకు, అంతకు ముందు యాదాద్రి జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన వైఖరిపై కేడర్‌లో సందిగ్ధం ఏర్పడింది. నల్లగొండ నిరుద్యోగ నిరసన సభ ప్రకటన తరువాత తనకు సమాచారం లేదని కామెంట్స్ చేసిన వెంకటరెడ్డి.. ఆ సభకు హాజరు కాకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించి… చివరి క్షణంలో హాజరయ్యారు.

తాజాగా నకిరేకల్ నియోజకవర్గంలోని బ్రాహ్మణవెల్లంలలో తన పుట్టిన రోజు వేడుకల్ని గ్రాండ్‌గా జరుపుకున్నారు ఎంపీ. తన కలల ప్రాజెక్టు బ్రాహ్మణ వెల్లంల పూర్తయిన సందర్భంగా సొంత ఊరు రుణం తీర్చుకున్నాను అని ఆయన కామెంట్స్ చేసినా… అసలు విషయం మాత్రం బలప్రదర్శన అని స్థానికంగా చెప్పుకుంటున్నారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నాయకులు, వారి అనుచరులను బర్త్‌డేకి పిలిచి తన బలం, బలగం, తగ్గలేదని రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లోని ఇతర సీనియర్స్‌కి కూడా సందేశం పంపాలన్నదే ఆయన ఉద్దేశ్యమని తెలిసింది. మరోవైపు వేడుకల్లో ఆయన చేసిన కామెంట్స్‌పై కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఉందని అంటున్నారు సన్నిహితులు. అనుచరులంతా సీఎం.. సీఎం అని కేకలు వేయడంతో… అలా వద్దని వారిని వారించడంతోపాటు … ఎక్కువ చేస్తే మనోళ్లే మనల్ని ఓడిస్తారని అనడం హాట్‌ టాపిక్‌గా మారింది. కర్ణాటకలో టికెట్ల పంపిణీ, అభ్యర్థుల విజయం, ప్రభుత్వ ఏర్పాటు వంటి అంశాలలో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలను విశ్లేషించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక క్లారిటీకి వచ్చేశారట. సీఎం నినాదాల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని అంచనా వేసుకుని… అలాంటి వాటికి బదులుగా క్షేత్ర స్థాయిలో తనబలాన్ని నిరూపించుకోవాలని డిసైడయ్యారట. ఉమ్మడి జిల్లాతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా తనకు కావాల్సిన వారికి టిక్కెట్లు ఇప్పించుకోవడంతోపాటు వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిపించుకోవాలని అనుకుంటున్నట్టు చెబుతున్నారు. వారితోపాటుగా రాష్ట్రంలో మరి కొంతమందికి నైతికంగా, ఆర్థికంగా అండగా నిలబడి తన మనుషులు ఎక్కువ మంది అసెంబ్లీకి వెళ్ళేలా చూసుకోవాలని ఫిక్స్‌ అయ్యారట ఎంపీ. అదే జరిగితే…. సీఎం పదవి కోసం వేరే వాళ్ళతో పోటీ పడాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నారట. మాటలతో కాకుండా.. బలగంతోనే మేటర్‌ సెటిల్‌ చేయాలనుకుంటున్న కోమటిరెడ్డి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్‌ అవుతాయో చూడాలి.

Show comments