NTV Telugu Site icon

Off The Record: రజినీకాంత్ను టార్గెట్ చేసిన రోజా..! యాక్షన్‌కు రియాక్షన్‌ తప్పదా..?

Roja

Roja

Off The Record: చిత్తూరు జిల్లా వైసిపి నేతలకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చిపడింది. తమిళ సూపర్ స్టార్ తలైవా తలనొప్పి తప్పదనే టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిదిగా విచ్చేసిన రజనీకాంత్ టిడిపి అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించటం రాజకీయ ప్రకంపనలు దారి తీసింది. ఐతే ఇది అధికార వైసిపికి ఏమాత్రం మింగుడుపడటంలేదట. చంద్రబాబు లాంటి వెన్నుపోటు దారుడికి మద్దతుగా మాట్లాడుతారా?అంటూ మంత్రి రోజా, కొడాలి నాని, అంబటి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి లాంటి నేతలు ఓరెంజ్‌లో రజనీకాంత్‌పై ఫైర్ అయ్యారు. తీవ్ర స్ధాయిలో తిట్లతో విరుచుకుపడ్డారు. ఇక సోషల్ మీడియాలోనూ రజనీకాంత్‌కు వ్యతిరేకంగా వైసిపి శ్రేణులు పోస్టుల పెడుతున్నారు.

Read Also: Off The Record: బీఆర్ఎస్‌కు హ్యాట్రిక్ విజయం సాధ్యమేనా..?

రజనీకాంత్‌పై చేసిన మాటల దాడులను ఏపీలోని చాలా జిల్లాల్లో ఎవరూ పట్టించుకోకుండానే ఉన్నారు. కాని చిత్తూరు జిల్లా వైసిపిలో మాత్రం ఇది హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ కేడర్‌తో పాటు జిల్లా పొలిటికల్‌ సర్కిల్స్‌లోనూ ఇప్పుడు ఇదే చర్చగా మారింది. రజనీకాంత్‌పై చేసిన విమర్శలు పార్టీపై ఎక్కడ ప్రభావం చూపుతాయోననే భయం పట్టుకుందట జిల్లా నేతలకు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో తమిళ ఓటర్లు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు నేతలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాది రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక పాత్ర. ఈ జిల్లా నుంచి చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు సిఎంగా పనిచేశారు. ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటుంది. చంద్రబాబు,పెద్దిరెడ్డి, రోజా, చెవిరెడ్డి, భూమన లాంటి నేతలు ఈ జిల్లా వారే. అయితే వీరందరిని అసెంబ్లీకి పంపటంలో తెలుగు ఓటర్లతో పాటు తమిళ ఓటర్ల పాత్ర అత్యంత కీలకం. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో సగానికిపైగా తమిళ ఓటర్లదే హవా. ఎన్నికలప్పుడు తమిళ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నగరి, చిత్తూరు,కుప్పం,పలమనేరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతిలో తమిళ ఓటర్లు ప్రభావం ఉంటుంది. నగరి,చిత్తూరు నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్లు ఉంటే వారిలో సగంమంది వరకు తమిళ ఓటర్లే ఉంటారు. గతంలో ఇక్కడ తమిళ పార్టీలైనా ఎఐడిఎంకె, డిఎమ్‌కె ఎన్నికల్లో పోటి చేశాయి.

Read Also: Off The Record: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో మళ్లీ టికెట్ దక్కేది ఎవరికి?

మంత్రి రోజా సొంత నియోజకవర్గమైన నగరిలో ఇదే చర్చగా మారిందట. అక్కడ రజనీకాంత్‌కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. అలాంటి చోట నుంచి గెలిచిన రోజా ఎందుకు రజనీకాంత్‌ను టార్గెట్‌గా చేశారనే చర్చ జోరుగా సాగుతోంది. గత రెండు ఎన్నికల్లోనూ తమిళ ఓటర్ల మద్దతుతునే స్వల్ప మెజారిటీతో గెలిచారు రోజా. అలాంటి ఓటర్లను దృష్టిలో పెట్టుకోకుండా విమర్శలు దాడి చేయడం నగరి పార్టీలో చర్చగా మారిందని టాక్. అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని సొంత పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకున్నారట. రోజా సైతం అక్కడ తమిళ ఓటర్లతో తమిళంలోను మాట్లాడుతూ దగ్గర అయ్యారు. రోజా భర్త సెల్వమణి తమిళ వ్యక్తే. ఆయన తమిళనాడు డైరెక్టర్ల అసోసియేషన్ సెక్రటెరీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా రోజా రజనీకాంత్‌పై విమర్శలు చేశారంటున్నారు పార్టీ నేతలు. నియోజకవర్గంలో రజనీకాంత్ ఎఫెక్ట్ ఎక్కవగా ఉందని తెలిసినా…ఎందుకు మాట్లాడారు?ఇప్పుడు తమిళ ఓటర్లను మచ్చిక చేసుకోవటం ఎలా అని తలలు పట్టుకుంటూన్నారట లోకల్ వైసిపి కేడర్. రోజా వ్యతిరేక వర్గం సైతం ఈ విషయంపై సీరియస్‌గానే ఉందని టాక్‌.

Read Also: Off The Record: ఆ ఎంపీ చూపులన్నీ ఢిల్లీ వైపే..! తిరుపతి వాసులకు అందుబాటులో ఉండటం లేదా?

రోజాతో పాటు బియ్యపు మధుసుధన్ రెడ్డి సైతం రజనీకాంత్‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. కాళహస్తిలోనూ తమిళ ఓటర్లు ఎక్కువే. దీంతో మంత్రి రోజా విమర్శలకు తోడు వైసిపి నేతల మాటల దాడులు జిల్లాలో ఎక్కువగా ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట. తమిళ ఓటర్లకు తోడు కన్నడ ఓటర్లపైనా ఈ ప్రభావం ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ చర్చలు టిడిపి నేతల దృష్టికి వెళ్ళడంతో రోజా, నాని చేసిన వ్యాఖ్యలను తెలుగు తమ్ముళ్ళు ఫేస్‌బుక్‌తో పాటు వాట్సాప్ ద్వారా కావాలనే వైరల్ చేశారట. తలైవానే తిడుతారా?అంటూ తమిళంలో పోస్టులు పెట్టి తమిళ ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారట. ఇలా రజనీకాంత్‌పై విమర్శల ప్రభావం నగరి,చిత్తూరులో గట్టిగానే ఉంటుందని టాక్ ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.