Off The Record: కోటగిరి శ్రీధర్… వారసత్వంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈ నాయకుడు 2019లో ఫస్ట్ టైం వైసీపీ తరపున ఏలూరు ఎంపీ అయ్యారు. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయనే స్వచ్చందంగా బరి నుంచి తప్పుకున్నారు. ఎందుకలా…. అంటే, అమెరికాలో ఉన్న కుటుంబానికి దూరంగా ఉండలేకపోతున్నానన్నది ఆయన సమాధానం. కానీ… వాస్తవం వేరే ఉందని అప్పట్లోనే గట్టి చర్చ జరిగింది పొలిటికల్ సర్కిల్స్‌లో. శ్రీధర్‌కు తన తండ్రి కోటగిరి విద్యాధరరావులాగా రాజకీయాలు పెద్దగా అచ్చిరాలేదని చెప్పుకుంటారు. అందుకు కారణం మాత్రం స్వయంకృతమేనన్నది ఇంకో వెర్షన్. ఎంపీగా ప్రజల్లో ఉండటం, అందర్నీ కలుపుకుని పోవడంకంటే… గ్రూపు తగాదాలను ప్రోత్సహించడానికి, పెత్తనం చేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారని, అందుకే ఆయనకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదన్న గుసగుసలు అనుచరగణంలోనే ఉన్నాయి. సరే… కారణం ఏదైనా గత ఎన్నికల్లో కోటగిరి పోటీకి దూరంగా ఉండటం ఒక ఎత్తయితే… వచ్చే ఎన్నికల్లో ఏదో రకంగా తన ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్నది లేటెస్ట్ టాక్. ఈసారి మాత్రం జాగ్రత్తగా అడుగులేయాలనుకుంటున్నట్టు సమాచారం. అందుకే… ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నా ఇక్కడి రాజకీయాలను నిత్యం ఫాలో అవుతూ… తన పాత అనుచరులందరికీ టచ్‌లో ఉంటున్నట్టు తెలుస్తోంది.
Read Also: Hyderabad: రోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్న డాక్టర్.. వేధింపులు తాళలేక సూసైడ్..!
అయితే ఈసారి ప్లాట్‌ఫాం మారుస్తారన్న వార్తలు మాత్రం ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతున్నాయి ఏలూరు పొలిటికల్ సర్కిల్స్‌లో. వైసీపీని వదిలేసే ఉద్దేశ్యంతో పక్క చూపులు చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీలో తనకు మునుపటిలా అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని బాగా హర్ట్ అయ్యారట కోటగిరి. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ తరపున ఏలూరు ఎంపీగా పోటిచేసే అవకాశాలు కనిపించకపోవడం, పార్టీలో తన మాటను పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో… ఇక చాప చుట్టేయడమే బెటర్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. వ్యాపార రీత్యా అమెరికాలో సెటిలైన కోటగిరి శ్రీధర్… గత ఎన్నికల సంగతి ఎలా ఉన్నా… ఇక నుంచి మాత్రం సీరియస్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నట్టు చెబుతున్నారు ఆయన అనుచరులు. పైగా 2024లో వైసీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించకపోవడమే బెటర్ అయిందని ఇప్పుడు అనుకుంటున్నారట. అలా రకరకాల కేలిక్యులేషన్స్ వేసుకుంటున్న మాజీ ఎంపీ…వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ముఖ్య అనుచరులను పక్క పార్టీలకు పంపుతున్నారన్నది లోకల్ టాక్. వైసీపీలో ఎలాగూ తనకు టిక్కెట్ దక్కే అవకాశం లేదు కాబట్టి… ఇక అనుచరులు మాత్రం అక్కడ ఎందుకని అనుకుంటున్నారట. ఇటీవల ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని వైసీపీ నాయకులు కూడగట్టుకుని మరీ జనసేనలో చేరిపోయారు. ఇందులో జడ్పీటీసీలు సైతం ఉన్నారు. పైగా కోటగిరి శ్రీధర్ సొంత మండలం కామవరపుకోట నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ ద్వితీయ శ్రేణిని జనసేనలోకి పంపేలా అడుగులు పడుతున్నాయంటున్నారు. ఆ విధంగా… మందు అనుచరగణాన్ని సేఫ్ సైడ్ ఉంచితే… తర్వాత టైం చూసుకుని తాను కూడా అదే బాటలో వెళ్ళ వచ్చన్నది మాజీ ఎంపీ ప్లాన్‌గా చెప్పుకుంటున్నారు.
Read Also: Off The Record: పార్టీ ఏదైనాసరే.. ఆ బ్రదర్స్‌కు కేసులు కామనా..?
ఎంత ప్లాన్ చేసినా… తాను అమెరికాలో ఉండటం, ప్రత్యక్ష పర్యవేక్షణ లేకుండా వ్యవహారాలు అంత సవ్యంగా నడవవు గనుక… ఆ బాధ్యతల్ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ భర్త గంటా ప్రసాద్‌కు అప్పగించినట్టు తెలిసింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరారు జడ్పీ ఛైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాద్. ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికే ఇరవై మంది జడ్పీటీసీలు జనసేన, టిడిపి కండువాలు కప్పేసుకున్నారు. అలాగే… జంగారెడ్డి గూడెం, కామవరపుకోట, చింతలపూడి మండలాలల్లో వైసీపీకి కీలకంగా ఉన్న ఇంకొందరు సైతం త్వరలో జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక కోటగిరి శ్రీధర్ వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్‌కు కూడా ప్రయత్నించాలనుకుంటున్నారట. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే… తన తండ్రి, మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు బాటలో నడవాలనుకుంటున్నారన్నది శ్రీధర్ సన్నిహితుల మాట. సీట్ల సంఖ్య పెరిగితే… గతంలో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన చింతలపూడి నియోజకవర్గం… ఎస్సీ రిజర్వ్‌డ్ నుంచి జనరల్ అయ్యేఅవకాశం ఉందని, అప్పుడు తాను ఆ సీటు కోసం పోటీ పడాలని అనుకుంటున్నారట. అందుకే… తనకు, తన అనుచరవర్గానికి ఇప్పటి నుంచే ప్రాధాన్యత ఇచ్చే పార్టీల వైపు ఆయన చూపు ఉందని అంటున్నారు. ఎంపీగా ఉన్నప్పుడు కొందరు ఏది చెబితే అది చేసిన కోటగిరి శ్రీధర్… వర్గపోరుకు ఆజ్యం పోశారన్న విమర్శలు ఎక్కువగా వినిపించాయి. మరి ఇప్పుడు అదే అనుచరవర్గాన్ని కాపాడుకునేందుకు, వారికి ప్రాధాన్యత దక్కించేందుకు ఆయన చేస్తున్న కొత్త ప్రయత్నాల ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటున్నారు పరిశీలకులు.
