NTV Telugu Site icon

Off The Record: కోనేరు కోనప్పకు కోపం వచ్చిందా..?

Koneru Konappa

Koneru Konappa

Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కోనేరు కోనప్ప స్టైలే వేరు. పార్టీ ఏదైనా డోంట్‌ కేర్‌… జనంలో పర్సనల్‌ ఇమేజ్ పెంచుకోవడమే మన స్టైల్‌ అన్నట్టుగా ఉంటారట ఆయన. 2004లో మొదటిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారాయన. 2014లో బీఎస్పీ తరపున గెలిచి ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ పంచన చేరారు. అదే పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో విజయం సాధించారు కోనప్ప. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూశారు. అయితే ఆ ఎన్నికల్లో ఇక్కడ బీఎస్పీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌కు 44వేల 646 ఓట్లు వచ్చాయి. ఆయన ఓట్లు చీల్చడం వల్లే ఓడిపోయానని ఫిక్స్‌ అయిన కోనప్ప… తన ఓటమికి కారణం అయిన ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్‌లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ కారు దిగేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారాయన. చేరడం వరకు ఓకేగానీ… ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమి తర్వాత కాంగ్రెస్‌తో కూడా టచ్‌ మీ నాట్‌ అన్నట్టుగా ఉంటున్నారట. అప్పటి నుంచి మళ్లీ కండువా మార్చేస్తారా..అనే ఊహగానాలు నడుస్తూనే ఉన్నాయి.

కాంగ్రెస్‌లో కోనప్పకు తగిన ప్రాధాన్యత లేకుండా పోయిందని అంటున్నారు.ఎందుకంటే ఇక్కడ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి రావి శ్రీనివాస్ కోనప్పకు మేనల్లుడే. ఇక లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సిర్పూర్ నియోజకవర్గం నాయకుడు దండే విఠల్, హస్తం పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి సిర్పూర్‌లో తన ప్రాధాన్యత తగ్గిపోయినట్టు ఫీలవుతున్నారట కోనప్ప. ఎమ్మెల్సీకి అధికారిక ప్రోటోకాల్‌, నియోజకవర్గ ఇన్ఛార్జ్‌కు పార్టీ ప్రొటోకాల్ ఉండగా తాను మాత్రం నామ మాత్రంగా మిగిలిపోయానని కోనప్ప ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. పైగా డీసీసీ అధ్యక్షులుగా వేరే వాళ్లు ఉండడంతో ఆయన వర్గానికి అసలు గుర్పింపే లేకుండా పోయిందని అంటున్నారు. ఇవే కాకుండా తాను బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కష్టపడి సాధించిన బ్రిడ్జి నిర్మాణ అనుమతులు,రోడ్ల నిర్మాణాలను ప్రస్తుతం పెత్తనం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు రద్దు చేయించారంటూ సంచలన ఆరోపణలు చేశారాయన. ఈ క్రమంలోనే ఎన్నికలొస్తే స్వతంత్రంగా బరిలో నిలస్తానంటూ చేసిన తాజా కామెంట్స్ అధికారపార్టీలో కలకలం రేపుతున్నాయి. తాడోపేడో తేల్చుకోవడం కోసం అలా మాట్లాడారా…లేక పార్టీలో ఉండకూడదని డిసైడ్ అయ్యారా అనే చర్చ నడుస్తోంది ఉమ్మడి జిల్లాలో.

ప్రత్యక్షంగా బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై కోనప్ప ఆరోపణలు చేయడంమే కాదు… ఎవ్వరొస్తే వారిని నిలదీయండని పిలుపునివ్వడంతో మాజీ ఎమ్మెల్యే దారెటు అనేది ఆసక్తికరంగా మారింది. పనుల కోసం అధికారుల దగ్గరికి ఆయన తీసుకెళ్ళే ఫైల్స్ పక్కకుపోవడం, మంజూరు చేయించిన పనులు సైతం రద్దు చేయడం లాంటి పరిణామాలతోనే కోనప్ప అలా ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చని అంటున్నారు. తనకు గిట్టని వారి ప్రాధాన్యం పార్టీలో పెరగడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారన్నది సమాచారం. పోనీ.. ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్‌లో చేరదామంటే…అక్కడ తన ఓటమికి కారణం అయిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. కాంగ్రెస్ లో సైతం కొనసాగే పరిస్థితి లేదు. అందుకే ఇండిపెండెంట్‌ మాటలు వచ్చి ఉండవచ్చని అంటున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన మనుషుల్ని స్వతంత్రులుగా నిలబెట్టి గెలిపించుకుని సత్తా చాటే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అది జరగాలంటే ఆయన కాంగ్రెస్‌ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. దీంతో కోనప్ప నెక్స్ట్‌ స్టెప్‌ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.