Off The Record: కొండా ఫ్యామిలీ దారెటు..? కాంగ్రెస్‌లోనేనా.. కమలం వైపా..?

  • కొండా ఫ్యామిలీ గురించి హాట్‌ హాట్‌ డిస్కషన్స్‌..
  • పార్టీ మారాలనుకుంటే ముందున్న ఆప్షన్స్‌ ఏంటన్న చర్చ..
  • తెలంగాణ బీజేపీలో కాంగ్రెస్‌ మంత్రి గురించిన మాటలు..
  • పార్టీలో ఎవరితో టచ్‌లో ఉన్నారంటూ నేతల ఆరాలు..
  • రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ మంతనాలు జరుపుతున్నారన్న ప్రచారం..
  • బీజేపీలో ఫ్యామిలీ ప్యాకేజీలు ఉండవంటున్న కొందరు..
  • కొండా కుటుంబం ఆశిస్తున్న సీట్లలో బీజేపీకి బలమైన నేతలు..
  • లెఫ్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో బీజేపీలోకి అంత ఈజీనా అన్న ప్రశ్న ..
Otr Konda Family

Otr Konda Family

Off The Record: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌ గురించే హాట్‌ హాట్‌ డిస్కషన్స్‌ నడుస్తున్నాయి. కాస్త చర్చ, మరికాస్త రచ్చ జరుగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ మీద కాంగ్రెస్ అధిష్టానం చర్య తీసుకుంటుందా…? లేదా? ఒకవేళ కేబినెట్‌ నుంచి తప్పిస్తే… ఆమె పార్టీలో కొనసాగుతారా? లేక మారిపోతారా? అంటూ ఎవరికి వారు విశ్లేషణలు చేసేసేస్తున్నారు. ఒకవేళ పార్టీ మారిపోవాలని భావిస్తే… కొండా ఫ్యామిలీ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఈ క్రమంలో… బీజేపీ, జనసేన గురించి సోషల్ మీడియా చర్చలు జోరుగా నడుస్తున్నాయి. సోషల్‌ సంగతులు ఎలా ఉన్నా…. ఇటు తెలంగాణ బీజేపీలో కూడా కొండా ఇష్యూపై మాటలు నడుస్తున్నాయట. ఆమె మన పార్టీలోకి వస్తారా? ఎవరితోనన్నా టచ్‌లో ఉన్నారా? ఒకవేళ రావాలనుకుంటే ఎవరి ద్వారా… తీగలు కలిపే అవకాశం ఉందంటూ కమలం లీడర్స్‌ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

ఆ మధ్య కొండా సురేఖ బెంగుళూరు నుండి హైదరాబాద్‌ రిటర్న్‌ వస్తున్నప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో బీజేపీ స్టేట్‌ చీఫ్ రామచందర్‌రావు ఎదురుపడడం, కిషన్ రెడ్డి కూడా మాట్లాడ్డంతో… దాన్ని బేస్‌ చేసుకుని కొందరిలో కాస్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు. అయితే బీజేపీ ముఖ్య నేతలు మాత్రం ఇటు తమ పార్టీ వైపు నుండిగాని, అటు కొండా ఫ్యామిలీ వైపు నుంచిగానీ.. ఎలాంటి ఇనిషియేషన్ లేదని అంటున్నారు. ఇదే సమయంలో తెర వెనక జరిగేవి జరిగిపోతున్నాయన్న వాదన సైతం ఉంది. రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ మంతనాలు జరుపుతున్నారని, ఇంకో రాష్ట్ర ఎంపీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ… ఇప్పటికిప్పుడు ఈ విషయంలో పెద్దగా మాట్లాడేదేం ఉండకపోవచ్చని అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఆమెపై ఇంకా చర్య తీసుకోలేదు. మంత్రి సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాంటప్పుడు మేం భుజాలు తడుముకోవడం ఎందుకన్నది కొందరు కాషాయ నేతల ప్రశ్న.

ఇక బీజేపీలో ఫ్యామిలీ ప్యాకేజీల్లాంటివేం ఉండవని గుర్తు చేస్తున్నారు మరికొందరు. కొన్ని మరీ… ప్రత్యేక సందర్భాల్లో తప్ప… ఒక కుటుంబంలో ఒకరికి మించి టికెట్ ఇవ్వడం అన్నది బీజేపీలో అంత ఈజీ కాదని అంటున్నారు. ఒకవేళ కొండా కుటుంబం బీజేపీ వైపు చూసినా అందరికీ టికెట్ ఇవ్వడమన్నది కుదిరేపని కాదని ముందే తేల్చేస్తున్నారు. పైగా ఆ ఫ్యామిలీ అడిగే సీట్లలో ఇప్పటికే బీజేపీకి బలమైన నేతలు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీ అడిగే సీట్లలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫార్పార్మెన్స్ చూపించిందట. అలాంటప్పుడు ఈ ఫ్యామిలీకి ఓకే చెబితే… కొత్త తలనొప్పి అవుతుందనే అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా వాళ్ళు బీజేపీలోకి వెళ్తున్నట్టు ప్రచారం జరిగినా వర్కౌట్‌ అవలేదు. కొండా ఫ్యామిలీది లెఫ్ట్ బ్యాక్ గ్రౌండ్ కావడంతో ఆమె బీజేపీలోకి రావడం అంతా ఆషామాషీ కాకపోవచ్చన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. కానీ…రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి ఫైనల్‌గా ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు పరిశీలకులు.