Site icon NTV Telugu

Off The Record: మేడం డౌటేనా..? ప్రియాంక గాంధీ వస్తే ప్లస్ ఏంటి..? మైనస్ ఏంటి..?

Priyanka Gandhi

Priyanka Gandhi

Off The Record: ఖమ్మం సభకి రాహుల్ గాంధీ రావడంతో తెలంగాణ కాంగ్రెస్‌ క్యాడర్‌లో జోష్‌ వచ్చింది. ఇంకా చెప్పాలంటే… మోడువారుతున్న చెట్టు చిగుళ్ళు తొడిగినంత ఆనందంగా ఉందట ఆ పార్టీ కేడర్‌కి. ఇక అదే ఊపులో పాలమూరు సభను కూడా ఆ స్థాయిలో నిర్వహించాలని అనుకున్నారు పార్టీ నాయకులు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరిక మీటింగ్‌ను భారీ ఎత్తున జరిపి పట్టు బిగించాలనుకుంటున్నారు రాష్ట్ర నాయకులు. ఆ దిశగా ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది పార్టీ. పెండింగ్‌లో ఉన్న వాటితో కలిపి 14 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్‌ల నియామకం పూర్తయింది. భారీగా జనసమీకరణకు అంతా సిద్ధం అయింది. ఖమ్మం సభ కి రాహుల్ గాంధీ వచ్చినట్టుగానే… పాలమూరుకు ప్రియాంక వస్తారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అన్నాచెల్లెళ్ళ వరుస సభలతో కేడర్‌లో ఉత్సాహం పెరుగుతుందని, ఒక కిక్‌ స్టార్ట్‌లా ఉంటుందని అనుకుంటున్నారట నాయకులు. ఈనెల 20న మీటింగ్‌ ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది రాష్ట్ర నాయకత్వం. కానీ…ఇంతవరకు ప్రియాంక టూర్ మీద స్పష్టత రాలేదు. కొత్తగా… ఆమె వస్తారా? రారా? అన్న అనుమానాలు సైతం వస్తున్నాయట. ప్రియాంక వస్తేనే… సభకు సార్ధకత అన్న ఆలోచనలో ఉన్నారు నాయకులు. కానీ.. డేట్‌ దగ్గర పడుతున్నా… మేడమ్‌ టూర్‌ ప్లాన్‌ తెలియకపోవడంతో గందరగోళం పెరుగుతోంది. ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించైనా సరే.. ప్రియాంక టూర్ కన్ఫర్మ్ చేయించాలనుకుంటున్నారట ఇక్కడి నాయకులు. ఆ దిశగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ ఇంచార్జి థాక్రే మీద వత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది.

కొల్లాపూర్‌ సభకు ఒకవేళ ప్రియాంక రాకుంటే… ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేని ఆహ్వానించాలనుకుంటున్నట్టు సమాచారం. అది సెకండరీగానీ… మా ప్రధాన లక్ష్యం మాత్రం మేడమేనంటున్నాయి పార్టీ వర్గాలు. ఈనెల 20న వాతావరణ పరిస్థితుల్ని కూడా అంచనా వేసుకుంటూ సభకు ప్లాన్‌ చేస్తున్నారట. ప్రియాంకతో పాటు ఖర్గే కూడా వస్తే మరీ మంచిదని…కానీ… మేడమ్‌ సభకు వచ్చి ప్రసంగిస్తే… తెలంగాణ ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌గా ఉందన్న సంకేతాలు పంపడం సాధ్యమవుతుందంటున్నారు. కేడర్‌లో కూడా ఆ నైతిక బలం వేరుగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అసలు ఎన్నికలు పూర్తయ్యే దాకా తెలంగాణ వ్యవహారాలను ప్రియాంకే స్వయంగా చూస్తారని ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో తొలి సభకే ఆమె రాకుంటే.. బయటికి వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని, అందుకే…ఎట్టి పరిస్థితుల్లో మేడమ్‌ని రప్పించి, ఖమ్మం సభ తెచ్చిన టెంపోని కొనసాగించాలని అనుకుంటోందట రాష్ట్ర నాయకత్వం. మరి ఆమె ఎలా ఆలోచిస్తున్నారోనన్న సస్పెన్స్‌ కొనసాగుతోంది. అతి త్వరలోనే ప్రియాంక టూర్‌ మీద స్పష్టత వస్తుందంటున్నాయి పార్టీ వర్గాలు. ఆమె రాకున్నా… ఖర్గే మాత్రం ఖచ్చితంగా వస్తారన్నది పార్టీ అంతర్గతంగా ఉన్న సమాచారం.

Exit mobile version