NTV Telugu Site icon

Off The Record: కేసీఆర్ మాస్టర్ ప్లాన్..! ఒకే దెబ్బకు రెండు పిట్టలు..!

Brs

Brs

Off The Record: మేడిగడ్డ మరోసారి తెలంగాణ పాలిటిక్స్‌కు సెంటర్ పాయింట్‌గా మారబోతోంది. ఎక్కడైతే పోగొట్టుకున్నామో… అక్కడే వెదుక్కోవాలని, ఇమేజ్ డ్యామేజ్ అయిన బరాజ్‌ దగ్గర్నుంచే… తిరిగి మొదలుపెట్టాలని భావిస్తోందట గులాబీ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా రాజకీయంగా మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని గుర్తించిన బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం.. ఆ విషయంలో అగ్రెసివ్‌గా వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. అందుకే పొలిటికల్‌ కాక రేపుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మరోసారి వెళ్ళడానికి రెడీ అయ్యారు గులాబీ శాసనసభ్యులు. లక్ష్మీ బరాజ్‌లో పియర్స్ కుంగినప్పటి నుంచి జరుగుతున్న పొలిటికల్ వార్‌ను ఈ టూర్‌తో మరింతగా హీటెక్కించాలనేది వ్యూహంగా చెప్పుకుంటున్నారు. పియర్స్ కుంగుబాటు తర్వాత కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ దాడిని తట్టుకునేందుకు పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Read Also: Off The Record: కేంద్రం, తెలంగాణ మధ్య బడ్జెట్ ప్రకంపనలు రేగుతున్నాయా..? |

దూకుడుగా ఉంటూ ఎదురు దాడి చేయకుంటే నిలబడలేమని గుర్తించిన గులాబీ అగ్రనాయకత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మేడిగడ్డ, అన్నారం బరాజ్‌ల నిర్మాణ లోపాలపై వేసిన వివిధ కమిటీల నివేదికల ఆధారంగా అసెంబ్లీలో ఒక రోజంతా చర్చించాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టుపైనే రోజంతా చర్చించి బీఆర్ఎస్‌ను మరింత ఇరుకున పెట్టేందుకు అధికార పార్టీ అన్ని ఆయుధాలను సిద్ధం చేసినట్టు తెలిసింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల బృందం, పీసీ ఘోష్ కమిషన్, ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్స్, వివిధ విభాగాల శాస్త్రవేత్తలతో కూడిన కమిటీలు పలుమార్లు మేడిగడ్డను సందర్శించి కీలక అంశాలను గుర్తించినట్టు సమాచారం. వాటి ఆధారంగానే అసెంబ్లీలో చర్చ పెట్టాలనుకుంటోందట ప్రభుత్వం. ప్రాజెక్ట్‌ డిజైన్‌ లోపాల నుంచి పాలనాపరమైన తప్పిదాలు, అవినీతి, నాలుగేళ్లలో ప్రాజెక్టు వల్ల వచ్చిన లాభ నష్టాలు, నిర్మాణం కోసం తెచ్చిన అప్పులు, కడుతున్న వడ్డీలు… ఇలా అన్ని అంశాలను చర్చకు పెట్టాలని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రజల ముందుంచాలని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. అలా… చర్చ పెట్టి కాంగ్రెస్ పైచేయి సాధిస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన బీఆర్‌ఎస్‌ డ్యామేజ్‌ కంట్రోల్‌లో భాగంగా ముందే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ టూర్‌ పెట్టుకున్నట్టు అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read Also: Off The Record: రూటు మారుస్తున్న జగన్.. పెద్ద స్కెచ్చే వేశారా..?

మేడిగడ్డ బరాజ్‌పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందంటూ… ఇటీవలే ఓ వీడియో విడుదల చేసింది బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం. పది లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నా.. చెక్కు చెదరలేదంటూ ప్రచారం మొదలుపెట్టారు. అసెంబ్లీ చర్చ, ఈ తరహా సోషల్‌ మీడియా ప్రచార క్రమంలో మరోసారి పొలిటికల్‌ హాట్‌ అయింది కాళేశ్వరం ప్రాజెక్ట్‌. లోయర్ మానేరు రిజర్వాయర్‌ నుంచి మేడి గడ్డ బరాజ్‌ వరకు సాగే యాత్రలో బీఆర్‌ఎస్ నేతలు ఏం పరిశీలిస్తారు? ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేందుకు ఏయే ఆంశాలను తెరపైకి తెస్తారన్నది ఆసక్తిగా మారింది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చేసే దాడికంటే ముందే ప్రజల్లోకి వెళ్లాలని… సెంటిమెంట్‌ను రగిలించి బయటపడాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే నీళ్లులేని లోయర్ మానేరు రిజర్వాయర్‌ నుంచి వృధాగా నీరు కిందికి వెళుతున్న మేడిగడ్డ వరకు యాత్ర ప్లాన్ చేశారట. వర్షాలు లేకున్నా.. కాళేశ్వరం నుంచి ఎత్తి పోస్తే లోయర్ మానేరులో నీరుండేది. ఈ పాయింట్‌ని బేస్‌ చేసుకునే… కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని వృధాగా వదిలేస్తూ ఆయకట్టు రైతులను ఇబ్బంది పెడుతోందనే ప్రచారాన్ని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లాలనేది గులాబీ బాస్‌ వ్యూహంగా తెలిసింది.

Read Also: UPSC Changes Exam Pattern: ఆ మోసాలకు చెక్ పెట్టేందుకు యూపీఎస్సీ పరీక్షా విధానంలో కీలక మార్పులు..

అసెంబ్లీలో తమను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్న అధికార పార్టీకి కౌంటర్ అటాక్ గా ఈ అంశాన్ని వాడుకోవాలని స్కెచ్ వేశారట. దీన్ని వర్కౌట్‌ చేస్తే… నిస్తేజంగా ఉన్న పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం వస్తుందని కారు పార్టీ నేతలు భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. టూర్‌తో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల క్యాడర్‌లో కదలిక రావడమే కాకుండా ఒక పాయింట్‌తో ప్రజల్లోకి వెళ్లేందుకు మంచి అవకాశం దొరుకుతుందని భావిస్తున్నారట. మొత్తంగా…కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో చర్చ జరక్కముందే అటాకింగ్ మోడ్‌లోకి వెళ్లాలన్న బీఆర్‌ఎస్‌ ప్లాన్‌ ఎంతవరకు వర్కౌట్‌ అవుతుంది? కాంగ్రెస్‌ కౌంటర్‌ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారుతోంది.