NTV Telugu Site icon

Off The Record: ఆ టీడీపీ ఎమ్మెల్యేకు సొంత పార్టీ కార్యకర్తలే రివర్స్ అయ్యారా..? ఏం జరుగుతుంది..?

Off The Record: నెల్లూరు జిల్లా కందుకూరు రాజకీయాలు కాస్త డిఫరెంట్‌. నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి మానుగుంట, దివి కుటుంబాలే ఇక్కడ కీలకం.1955లో కందుకూరు సెగ్మెంట్‌ ఏర్పాటవగా నాటి నుంచి పార్టీ ఏదైనా… ఈ రెండు ఫ్యామిలీస్‌దే హవా. కానీ… 70 ఏళ్ల తర్వాత ఈ విడత ఈ రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు పోటీలో లేకుండా ఎన్నికలు జరిగాయి. టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసిన ఇంటూరి నాగేశ్వరరావు వైసీపీ అభ్యర్ది బుర్రా మధుసూధన్ యాదవ్ పై 18,558 ఓట్ల మెజార్టీతో గెలిచారు.. కారణాలు ఏవైనా 1999 తర్వాత ఈ నియోజకవర్గంలో గెలుపునకు దూరంగా ఉన్న టీడీపీ ఈసారి పాగా వేయగలిగింది. ఎన్నికల ముందు వరకూ టీడీపీ టికెట్ కోసం గట్టిగానే పోటీ పడిన ఇంటూరి రాజేష్ ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అయితే అన్నీ వర్గాల సపోర్ట్ దొరకడంతో ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు మంచి మెజార్టీ సాధించగలిగారని చెప్పుకుంటారు.

Read Also: Amaravati: అమరావతి అభివృద్ధి.. ఈ ఏడాది చివరకల్లా రూ.15 వేల కోట్ల రుణం..

ఇంత వరకూ బాగానే ఉన్నా… గెలిచాక ఎమ్మెల్యే ఇంటూరి ఓ గ్రూపును దూరం పెడుతున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తుందట నియోజకవర్గంలో. సొంత పార్టీ క్యాడర్‌ను పక్కన పెట్టి తన మనుషుల్ని మండలానికో ఇంచార్జ్‌గా నియమించుకున్నారట. అక్కడ ఎంతటి నాయకులైనా వారు చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనట. ఇంటూరి పెట్టిన మనుషులకు తెలియకుండా… చీమ చిటుక్కుమనడానికి వీల్లేదన్నది లోకల్‌ టాక్‌. అదే సమయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరారవును టార్గెట్ చేస్తూ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో సొంత పార్టీ కార్యకర్తలే పోస్టింగులు పెట్టడం నియోజకవర్గంలో చర్చనీయంశమైంది. పార్టీ గెలుపునకు కష్టపడిన వారిని దూరంగా పెట్టి ఎమ్మెల్యే తనకు నచ్చిన వారికి పెత్తనం అప్పగించారంటూ కార్యకర్తలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను మంత్రి లోకేష్‌ దృష్టికి తీసుకువెళ్ళేందుకు సిద్ధమవుతున్నారట స్థానిక నాయకులు. ఇంతలో నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ పెద్దాయనగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే దివి శివరాం స్పందించటం హాట్ టాపిక్ లా మారిపోయింది.

Read Also: Crime: ప్రియురాలిని దూరం చేసిన తండ్రి.. గన్‌తో కాల్చిన ప్రియుడు

ఎన్నికలకు ముందు వరకు ఎవరి గ్రూపుగా వారున్నా… పార్టీ అభ్యర్దిని ప్రకటించిన తర్వాత ఏక తాటిపైకి వచ్చి గెలిపించిన విషయం మర్చిపోవద్దని ఎమ్మెల్యేకు దివి నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నికలంటే ఈ ఐదేళ్ళతో పోయేది కాదని, మళ్లీ ఇక్కడ గెలవాలంటే అందరినీ బాగా చూసుకోవాల్సిన అవసరం ఉందంటూ క్లాస్‌ పీకినట్టు సమాచారం. నియోజకవర్గ పరిణామాలకు సంబంధించి దివి శివరాం ఇంతకు ముందే హెచ్చరించినా ఇంటూరి పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఆయన సీరియస్‌ అయినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారాలపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాత్రం ఎక్కడా నేరుగా స్పందించలేదట.. వాళ్లతో నాకెందుకు అన్నట్టుగా ఉంటున్నారట. దివి ఓపెన్‌ అయ్యాకైనా ఎమ్మెల్యే సర్దుకుంటారా? లేక ఆయనతో కూడా సైసై అంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సొంత కార్యకర్తల్నే పక్కన బెట్టి వాళ్ళతో నాకెందుకు అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేని టీడీపీ అధిష్టానం ఎలా సెట్‌ చేస్తుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి కందుకూరు రాజకీయవర్గాలు.

Show comments