Site icon NTV Telugu

Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..

Otr Kaleshwaram Case

Otr Kaleshwaram Case

Off The Record: కాళేశ్వరం కేసులో సీబీఐ దర్యాప్తుపై రాజకీయ పార్టీలు దాగుడు మూతలు ఆడుతున్నాయి. పొలిటికల్ మైలేజ్‌ గేమ్‌లో ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారం అయినా… దర్యాప్తు అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఈ క్రమంలోనే…. మా వ్యూహం మాకుంది… మేమేం పిచ్చోళ్ళం కాదంటూ బీజేపీ నాయకులు అనడం ఆసక్తికరంగా మారింది. దీంతో…. బీజేపీ గేమ్‌ ప్లాన్‌ ఎలా ఉండబోతోందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు. కాళేశ్వరం మీద ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదిక సమర్పించింది. దాని మీద బీఆర్‌ఎస్‌ హైకోర్ట్‌కు వెళ్ళింది. ఆ రిపోర్ట్‌ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్ట్‌ ఆదేశించింది. ఆ ఆదేశాల మీద ప్రభుత్వం ఇప్పటికిప్పుడు అప్పీల్‌కు వెళ్ళే అవకాశం లేదు. ఇంకా చెప్పాలంటే….. ఒక రకంగా ఘోష్‌ కమిషన్‌ రిపోర్ట్ అటకెక్కినట్టేనన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో…ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చుట్టూ రాజకీయం మొదలైంది. ఈ కేసులో వెంటనే సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి నెలలు గడుస్తున్నా… ఇప్పటివరకు అస్సలు పట్టించుకున్న పాపాన పోలేదని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

BRS, BJP ఒక్కటే కాబట్టే సీబీఐ దర్యాప్తు విషయంలో అడుగు ముందుకు పడటంలేదన్నది కాంగ్రెస్‌ ఆరోపణ. ఉద్దేశ్యపూర్వకంగానే బీజేపీ… కేసీఆర్‌, హరీష్‌రావును రక్షిస్తోందని ఆరోపిస్తున్నారు హస్తం నేతలు. అయితే… అందుకు కాషాయ సేన వైపు నుంచి కూడా గట్టిగానే కౌంటర్స్‌ పడుతున్నాయి. మీరేమన్నా అనుకోండి, ఎంతైనా చెప్పుకోండి…. డోంట్‌ కేర్‌. ఆ విషయంలో మా ప్లానింగ్‌ మాకుందని అంటున్నారు బీజేపీ నాయకులు. రాజకీయంగా కలిసివచ్చే అవకాశాలను వదులుకోవడానికి మేమేం పిచ్చోళ్ళం కాదని కూడా అంటున్నారట కాషాయ నేతలు. ఇప్పటికిప్పుడు రెస్పాండ్‌ అయిపోయి కాంగ్రెస్‌ వేసే పొలిటికల్ ట్రాప్‌లో పడాలన్న ఆతృత మాకు లేదు, మా భుజం మీద తుపాకీ పెట్టి అవతలి వాళ్ళని కాల్చుతామంటే అంటే కుదరదని అంటున్నారు. మేం కూడా రాజకీయాల్లోనే ఉన్నాం… పైగా కేంద్రంలో అధికారంలో ఉన్నాం, ఆ సంగతి మర్చిపోవద్దంటూ అటాకింగ్‌ మోడ్‌లోకి వచ్చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటే… మా స్ట్రాటజీస్‌ మాకు ఉండవా అంటూ… ప్రశ్నిస్తున్నారు.

అసలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే హైకోర్ట్‌లో తీర్పు అలా వచ్చిందని అంటున్నారు బీజేపీ లీడర్స్‌. చిత్తశుద్ధి ఉంటే వెంటనే సుప్రీం కోర్ట్‌కు వెళ్ళాలని సవాల్‌ చేస్తున్నారు. అసలు కాళేశ్వరంలో జరిగిన అవినీతి లక్ష కోట్లా? లేక 9వేల కోట్లా అన్నదానికి ముందు సమాధానం చెప్పండన్నది బీజేపీ డిమాండ్‌. అసలు మొత్తం ప్రాజెక్ట్ మీదే సీబీఐ దర్యాప్తును కోరాలని, అలాచేస్తే… మేం కూడా కేంద్రాన్ని అదే విషయం అడుగుతామని అంటున్నారు. అయితే ఇక్కడే ఇంకో క్లారిటీ కూడా ఇస్తున్నారు కమలం నాయకులు. ఇన్నాళ్ళు ఈ వ్యవహారం కోర్ట్‌లో ఉన్నందున సీబీఐ రంగంలోకి దిగలేదని, ఇక మీదట టేకప్‌ చేసే అవకాశం ఉందని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్‌ కూడా అయిపోతున్నందున కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇక ఇటువైపు దృష్టి పెట్టవచ్చని, అన్ని అంశాలను బేరీజు వేసుకున్నాక తర్వాత స్టెప్ వేయవచ్చని ఊహిస్తున్నారు బీజేపీ లీడర్స్‌. ఎవరి ప్లాన్స్‌ వాళ్ళకుంటాయి అన్నది వాళ్ళ వాయిస్‌.

Exit mobile version