Site icon NTV Telugu

Off The Record: జేసీ, శైలజానాథ్‌ మీటింగ్‌పై ఉత్కంఠ.. టీడీపీ వైపు అడుగులు పడుతున్నాయా?

Jc

Jc

Off The Record: ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గరపడుతున్న కొద్దీ.. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొందరు సీనియర్ నాయకుల అడుగులు చర్చనీయాంశం అవుతున్నాయి. చాలా మంది నౌ ఆర్‌ నెవర్‌ అన్నట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకుల అడుగులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఇద్దరు నేతల మీటింగ్‌పై హాట్‌ హాట్‌ చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ల భేటీ విషయంలో రకరకాల ఊహాగానాలు పెరుగుతున్నాయి. జిల్లాలో ఒకప్పుడు ఇద్దరూ కీలకమైన నేతలు కావడంతో ఆసక్తి మరింత పెరుగుతోంది.

తెలుగుదేశం పార్టీలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేత శైలజనాథ్ కలవడమే ఇక్కడ విశేషం. ఇద్దరూ కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం కలిసి పనిచేసినవారే.
జేసీకి, శైలజనాథ్ తో మొదట్లో మంచి సంబంధాలే ఉన్నా తర్వాత దూరం పెరిగింది. వై యస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక దివాకర్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు. అదే సమయంలో శైలజానాథ్‌కు వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత జేసీ కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి జంప్‌ అయ్యారు. 2019లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని తన కుమారుడిని అనంతపురం పార్లమెంటు నుంచి పోటీకి దింపారు. ఆ ఎన్నికల్లో జేసీ పవన్ ఓడిపోవడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న శైలజనాథ్ చాలాసార్లు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగినా చివరికి అది ప్రచారంగానే మిగిలిపోయింది. కానీ… ఇప్పుడు మాత్రం ఆయన సైకిల్‌ సైడ్‌ గట్టిగా అడుగులు వేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరి మీటింగ్‌ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయంలో ఇద్దరు నాయకులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ… శైలజానాథ్‌ టీడీపీలోకి వెళ్తారన్న అనుమానాలను మాత్రం పెంచింది మీటింగ్‌.
మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల రాయల తెలంగాణ పేరుతో హడావిడి చేశారు. త్వరలో రాయలసీమ ప్రాంత నేతలందరినీ కలుస్తానని ఆ సందర్భంగా ప్రకటించారు. ఈ భేటీ ఆ కోణంలో జరిగిందా? శైలజానాథ్‌ పార్టీ మార్పులో భాగమా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం కోసం శైలజ నాథ్ పనిచేశారు. అలాంటి వ్యక్తి రాయల తెలంగాణకు మద్దతు ఇచ్చే అవకాశం లేదన్నది ఆయన సన్నిహితుల మాట. తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న వైసీపీకి వ్యతిరేకంగా దివాకర్‌రెడ్డి పావులు కదుపుతున్నారని, అందులో భాగంగా కలిసి ఉండవచ్చన్నది మరో వాదన. ఏదేమైనా ఈ ఇద్దరు సీనియర్స్‌ మీటింగ్‌ విషయంలో మాత్రం జిల్లా వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. వైసీపీకి వ్యతిరేకంగా బలమైన వర్గాన్ని తయారు చేస్తున్నారా అన్నది రాజకీయ వర్గాల్లో పెరుగుతున్న అనుమానం.

Exit mobile version