NTV Telugu Site icon

Off The Record: హైడ్రా కూల్చివేతలపై రాజకీయాల్లో రచ్చ రచ్చ..

Otr Hydra

Otr Hydra

Off The Record: హైడ్రా కూల్చివేతలు పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంటున్నాయా? ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం జరుగుతోందా? పాతబస్తీలో చెరువుల ఆక్రమణలు, ఎంఐఎం అక్రమ నిర్మాణాల సంగతేంటని ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం జరుగుతోందా? అసలు కూల్చివేతలపై కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి?

తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ హైడ్రా. హైదరాబాద్‌లో చెరువుల్ని, చెరువు భూముల్ని ఆక్రమించి కట్టిన భవనాలను హైడ్రా వరుసబెట్టి కూల్చేస్తుండటం ప్రకంపనలు రేపుతోంది. ఇది రాజకీయ రంగు పులుముకుని రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారుతోంది. హైడ్రా ఎఫెక్ట్‌ ఎప్పుడు ఎవరి మీద ఎలా పడుతుందోనన్న చర్చ గట్టిగా జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. అలాంటి నిర్మాణాలు ఎక్కువగా బడాబాబులు, రాజకీయ నాయకులవే కాగా… అక్కడక్కడా మోసపోయి కొనుక్కున్నవాళ్ళు కొద్ది సామాన్యులవి కూడా ఉన్నాయి. దీంతో చెరువుకట్ట మీద నిర్మాణాలున్న వారికి కునుకు కరవైందంటున్నారు. చివరికి దీనిపై ఒవైసీలు కూడా ఓపెన్‌ అయ్యారు. మా మీద కక్షగట్టి, నోటీసులిచ్చి, మా విద్యా సంస్థల్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ సీరియస్‌ అయ్యారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ. ఒకవేళ కూల్చినా… మళ్ళీ కుతుబ్‌మినార్‌కంటే ఎత్తయిన భవనాల్ని నిర్మాస్తామంటూ సవాల్‌ చేశారాయన. మా విద్యా సంస్థల్ని మూయించి మమ్మల్ని భయపెట్టాలనుకుంటే భయపడబోమన్నది ఎంఐఎం అధిష్టానం వెర్షన్‌. ఇక్కడే ఈ కూల్చివేత వ్యవహారం వంద శాతం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది.

ఒవైసీ స్టేట్‌మెంట్‌ని అస్త్రంగా మలుచుకుంది తెలంగాణ బీజేపీ. హైడ్రాను స్వాగతిస్తున్నామని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఓవైపు చెబుతూనే… ఆ కూల్చివేతలేవో పాత బస్తీ నుంచే… అది కూడా ఒవైసీల బిల్టింగ్‌ నుంచే మొదలుపెట్టమంటూ ట్విస్ట్‌ ఇచ్చింది కమలం పార్టీ. పాత బస్తీలో ఆక్రమణలకు గురైన చెరువుల సంగతి ఏంటన్నది కాషాయ పార్టీ క్వశ్చన్‌. సల్కం చెరువులో ఒవైసీలు అక్రమ నిర్మాణాలు చేశారని, దమ్ముంటే వాటిని కూల గొట్టమని సవాల్‌ చేస్తున్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి భయపడలేదు…. ఇప్పుడు మీరు కూడా భయపడకండి రేవంత్‌రెడ్డిగారూ అనడమే కాదు.. బుల్డోజర్లు లేకుంటే…. పక్క రాష్ట్రం నుంచి కూడా తెప్పిస్తామంటూ సెటైరికల్‌గా మాట్లాడుతున్నారు కాషాయ లీడర్స్‌. మీరాలం చెరువుతో పాటు పాత బస్తీలో మరికొన్ని చెరువులు కూడా కబ్జా అయ్యాయని, వాటన్నిటి సంగతి తేలాల్సిందేనన్నది బీజేపీ డిమాండ్‌. ఇలా… వోవరాల్‌గా హైడ్రా చర్యల్ని సవాల్‌ చేసి పొలిటికల్‌గా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం, తమ లక్ష్యం నెరవేర్చుకోవడం అన్న రెండు పనుల్ని ఏక కాలంలో సాధించాలన్నది బీజేపీ ప్లాన్‌గా రాజకీయవర్గాల్లో చెప్పుకుంటున్నారు. హైడ్రా చిత్త శుద్ధితో పని చేస్తే… అక్కడ కూడా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చి డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం చేస్తోంది. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత కూల్చివేత ఎంత సెన్సేషన్ అయిందో… ఓల్డ్‌సిటీ విషయంలో వెనక్కి తగ్గితే అంత మైనస్‌ అవుతుందన్నది కాషాయ పార్టీ అంచనాగా తెలుస్తోంది. అందుకే ఆ పాయింట్‌నే ఒత్తిపట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నంలో ఉందంటున్నారు. ఇక అదే సమయంలో ఇటు అధికార పార్టీ వర్గాల్లో సైతం కూల్చివేతలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పార్టీలో చేరిన కొంతమంది నేతలకు కూడా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఫామ్ హౌస్‌లు ఉన్నందున వాటిని వదిలేస్తే… ఇప్పటి వరకు వచ్చిన పాజిటివ్‌ మొత్తం నెగెటివ్‌ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.

దానికి సమాధానంగా ప్రభుత్వం వైపు నుంచి చాలా క్లియర్‌గా ఉన్నామంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఎవరి నిర్మాణాలనైనా వదిలే ప్రసక్తే లేదంటున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే… పార్టీ హైకమాండ్‌ దగ్గర పలుకుబడి ఉన్న పళ్ళంరాజు లాంటి సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్‌ నిర్మాణాలను సైతం కూల్చివేశామని చెబుతున్నారట. ఈ క్రమంలోనే ప్రభుత్వం మొదలుపెట్టిన ఉద్దేశ్యం మంచిదే అయినా… రాజకీయ వత్తిళ్ళతో మధ్యలో ఆపేస్తే మొదటికే మోసం వస్తుందన్న చర్చ సైతం జరుగుతోంది కాంగ్రెస్‌ వర్గాల్లో. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రస్తుతం ఎంఐఎం అండగా నిలబడుతోంది. దీంతో ఇప్పుడు ఆ పార్టీ అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందన్న ఆసక్తి పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఇప్పటికే బీజేపీ పిన్‌ పాయింటెడ్‌గా అదే విషయాన్ని ప్రశ్నిస్తుండటంతో… ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు పార్టీ నేత పట్నం మహేందర్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ ప్రస్తావన కూడా రావడంతో ఒకవేళ అక్రమం అయితే వెంటనే కూల్చేయండని ఆయనే స్వయంగా ముందుకు వచ్చి చెప్పారు. ఇలా రకరకాల కోణాల్లో హైడ్రా కూల్చివేతల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు పెరుగుతున్నాయి. హైడ్రాతో రేవంత్‌రెడ్డి సర్కార్‌ పులిమీద సవారీ మొదలుపెట్టిందని, జాగ్రత్తగా లేకుండా ఏ మాత్రం తేడా వచ్చినా… రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న వాదన సైతం వినిపిస్తోంది. ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి మరి.

 

Show comments