Site icon NTV Telugu

Off The Record: నాలుగో విడత వారాహి యాత్రపై హాట్‌ హాట్‌ డిబేట్‌.. రూట్‌ మ్యాపే కారణం..!

Varahi Yatra

Varahi Yatra

Off The Record: పవన్‌కళ్యాణ్‌ నాలుగో విడత వారాహి యాత్ర ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. వారాహి విషయంలో ఎప్పుడూ గరం గరం చర్చలే జరుగుతున్నా… ఈ సారి మాత్రం ప్రత్యేకం అంటున్నాయి రాజకీయవర్గాలు. తొలి రెండు విడతల యాత్ర గోదావరి జిల్లాల్లో మూడో విడత విశాఖ జిల్లాలో జరిగాయి. అక్కడంతా జనసేన సానుకూల వాతావరణం ఉంటుందన్నది విశ్లేషకుల మాట. కానీ… నాలుగో దశ కృష్ణా జిల్లాలో జరగబోతోంది. అందునా పవన్‌కళ్యాణ్‌ అంటే.. ఒంటికాలి మీద లేచే… పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నం ఉండటంతో ఆసక్తి పెరుగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి ఒకటో తేదీన యాత్ర మొదలవుతుంది. అవనిగడ్డలో కాపు సామాజిక వర్గం కూడా ఎక్కువ. పైగా ఇక్కడి నుంచి జనసేన పోటీ చేసే ప్రతిపాదన ఉందట.

అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ పవన్‌ను పెద్దగా విమర్శించిన సందర్భాలు లేవు. ఇక అక్కడి నుంచి పక్కకు వచ్చాకే… అసలు సినిమా మొదలవుతుందన్న అంచనాలు ఉన్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని సొంత నియోజకవర్గం బందరు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని డిసైడైన నాని తన కొడుకును అభ్యర్థిగా రేసులో ఉంచారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడు మాట్లాడినా.. ఏం మాట్లాడినా.. దానికి కౌంటర్‌ వేయడానికి రెడీగా ఉంటారు పేర్ని. పవన్‌ ప్రెస్‌మీట్‌ ఉందన్న సమాచారం వస్తే చాలు.. ఆ వెంటనే మా సార్‌ ప్రెస్‌మీట్‌ ఉందంటూ పేర్ని ఆఫీస్‌ నుంచి సమాచారం రావడం కామనైపోయింది. ఇక బహిరంగ సభల విషయంలోనూ అంతే. పవన్‌ సభ ముగియగానే పేర్ని రెడీ అయిపోతారు. జనసేన అధ్యక్షుడు ఏం మాట్లాడితే దానికి కౌంటరేస్తూ.. మాటకు మాట చెబుతున్నారు బందరు ఎమ్మెల్యే. పవన్‌ ఏ స్థాయిలో అయితే కౌంటర్‌ ఇచ్చారో.. అంతే స్థాయిలో.. కొన్ని సందర్భాల్లో దానికి రెట్టింపులో కూడా కౌంటర్లు ఇచ్చేస్తారాయన. దీంతో జనసేన వర్గాలు కూడా ఆయన్ని అదే స్థాయిలో శతృవుగా చూడ్డం మొదలైంది. ఒక్క బందరు సెగ్మెంట్‌లోనే కాకుండా.. ఒక సెక్షన్‌ కాపు సామాజికవర్గానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్‌ అభిమానులకు టార్గెట్‌ అయ్యారు పేర్ని నాని.

తాజాగా ఆయన హైదరాబాద్‌ వెళ్తే.. అక్కడున్న కొద్ది మంది జనసేన కార్యకర్తలు.. పవన్‌ అభిమానులు నానిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితుల్లో నేరుగా పవన్‌ వారాహి మీద బందరు టూర్‌కు వస్తుండటంతో ఏం జరగబోతోందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. పవన్‌ ఏం మాట్లాడతారు? ఎమ్మెల్యే నానిని ఎలా టార్గెట్‌ చేస్తారోనన్న చర్చ జరుగుతోంది. బందరు పర్యటనలో రెండు వైపుల నుంచి ఎలాంటి మాటల బాంబులు పేలతాయో చూడాలంటున్నారు పరిశీలకులు. గతంలో పార్టీ ఆవిర్భావ సభ బందరులో జరిగినప్పుడు నానిని పెద్దగా టార్గెట్‌ చేయలేదు పవన్‌. కానీ.. మారిన పరిణామాలతో వైఖరి ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పెరుగుతోంది. వారాహి రూట్‌ మ్యాప్‌లో పెడన నియోజకవర్గం కూడా ఉంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్‌ కూడా పవన్‌ విషయంలో నోటికి ఎక్కువగానే పని చెబుతారు. పేర్ని నాని టెక్నికల్‌గా.. లాజిక్‌గా కౌంటర్‌ ఇస్తే.. జోగి మాత్రం హడ్డీమార్‌ గుడ్డి దెబ్బలా… ఏమనిపిస్తే అది మాట్లాడుకుంటూ వెళ్లిపోతారు. పైగా పెడనలో ఉన్న జనసేన నేతలకు.. జోగి రమేష్‌ అనుచరులకు వివిధ సందర్భాల్లో భారీ స్థాయిలో గొడవలు అయ్యాయి. ఈ క్రమంలో జోగి రమేష్‌ను పవన్‌ ఏ విధంగా టార్గెట్‌ చేస్తారన్నది కూడా చూడాలంటున్నారు పరిశీలకులు. ఇదే సందర్భంలో మరో చర్చా జరుగుతోంది. పవన్‌ పర్యటన.. రూట్‌ మ్యాప్‌ చూస్తుంటే.. జనసేన ఎక్కడైతే పోటీ చేయాలని భావిస్తోందో..? ఎక్కడ సీట్లు ఆశిస్తోందో.. ఆ నియోజకవర్గాల్లో టూర్‌ ఉండేలా ప్లాన్‌ చేసినట్టు భావిస్తున్నారు. మరి టూర్‌ మొదలయ్యాక ఎలాంటి మాటల తూటాలు బయటికి వస్తాయో చూడాలి.

Exit mobile version