Off The Record: ఎన్నికల వేళ గల్ఫ్ జపం చేస్తున్నారు నిజామాబాద్ పార్లమెంట్ సీటు పరిధిలోని అభ్యర్థులు. ఈ నియోజకవర్గంలో 2లక్షలకు పైగా ఉండే గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యుల ఓట్ల మీద గురిపెట్టి వారిని ప్రసన్నం చేసుకునేందుకు.. పోటీలు పడుతున్నాయి పార్టీలు. కాంగ్రెస్ నేతలు గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తూ.. మేమున్నామనే భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారట. మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మిక సంఘాలతో సమావేశమవుతున్నారు. అలాగే… ప్రజా భవన్ లో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక వ్యవస్ధను ఏర్పాటు చేస్తామని కూడా భరోసా ఇచ్చారాయన. ఆ ప్రకటన చూసిన బీజేపీ నేతలు.. ఎక్కడ వెనకబడిపోతామో అన్నట్టుగా… ప్రవాసుల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని చెబుతున్నారట. నిరుడు గల్ప్ ప్రవాసీయులతో ఏర్పాటు చేసిన మీటింగ్ ఫోటోలను ఇప్పుడు కొత్తగా తెగ షేర్ చేసేస్తున్నారట. ఈ క్రమంలోనే కొత్తగా తెర మీదికి వచ్చింది గల్ఫ్ బోర్డ్. దాని చుట్టూనే ఇప్పుడు రాజకీయమంతా నడుస్తోందట.
గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బోర్డ్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెబుతుంటే… బీజేపీ అందుకు కౌంటర్స్‌ని రెడీ చేసుకుంటున్నట్టు తెలిసింది. కార్మికుల ఓట్ల కోసం గల్ఫ్ బోర్డు డ్రామాలంటూ.. సెటైర్లు వేస్తున్నారట బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్. ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని చెబుతున్నట్టు తెలిసింది. అటు బీఆర్ఎస్ ఆభ్యర్ధి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా తనను గెలిపిస్తే తెలంగాణ గల్ఫ్ కార్మికుల పక్షాన పార్లమెంట్ లో గళమెత్తుతానని అంటున్నారు. ఐతే పదేళ్లు అధికారంలో ఉండి ఎన్ఆర్ఐ పాలసీ, 500కోట్లతో గల్ప్ ప్రత్యేక నిధి ఏర్పాటు హామీని ఎందుకు నెరవేర్చలేదని బీఆర్‌ఎస్‌ని ప్రశ్నిస్తున్నాయట కార్మిక సంఘాలు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధి నుంచి ఉపాధి కోసం వందల కుటుంబాలు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాయి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో 2 లక్షలకు పైగానే వీరి కుటుంబాల ఓట్లున్నాయి. ఆ ఓట్ల కోసమే ప్రతి ఎన్నికల టైంలో నానా తంటాలు పడుతుంటాయి రాజకీయ పార్టీలు.
కానీ… సమస్య ఎప్పటికీ సమస్యగానే మిగిలిపోతోందన్నది ఓటర్ల ఆవేదన. ఆ ఎఫెక్ట్ గతంలో కొన్ని పార్టీలకు గట్టిగానే తగిలిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా గల్ఫ్ వెల్పేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. బీజేపీ సైతం ఆ రెండు లక్షల ఓట్ల మీదే గట్టిగా దృష్టి పెట్టింది. ఆ దిశగా ప్రధానితో కీలక ప్రకటన చేయించాలని ఉత్తర తెలంగాణ నేతలు కోరుతున్నారట. ఐతే ఓట్ల కోసమే తమను వాడుకుంటున్నారని బాధిత కుటుంబాలు పెదవి విరుస్తున్న పరిస్థితి. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గతంలో చక్కెర కర్మాగారం .. మొన్న పసుపు బోర్డు, ఇప్పుడు గల్ఫ్ బోర్డు… ఇలా రకరకాల అంశాలు అజెండాలోకి వస్తున్నాయి. మరి చివరికి ఓటరు ఎవర్ని నమ్ముతాడో, ఎవరికి జై కొడతాడో అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.