Off The Record: పరిషత్ ఎన్నికల దెబ్బ.. పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యే థామస్‌కు అగ్నిపరీక్ష..

  • పరిషత్‌ ఎన్నికల్లో జీడీ నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీకి దెబ్బ..
  • వైసీపీకి నాలుగు, టీడీపీకి రెండు జడ్పీటీసీలు..
  • ఆరు మండలాలకుగాను మూడు చోట్ల వైసీపీ ఎంపీపీలు..
  • ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరే పరాభవానికి కారణమన్న విశ్లేషణలు..
  • సర్పంచ్‌ ఎన్నికల్లో అలర్ట్‌ అయిన ఎమ్మెల్యే థామస్‌..
  • ప్రతిరోజూ మండల నేతలతో వరుస సమావేశాలు..
  • అంతా మీ ఇష్టం అంటూ మండల నేతలకు ఫ్రీ హ్యాండ్‌..
  • పార్టీలోని అన్ని గ్రూపులు సహకరిస్తాయా అన్న మరో టెన్షన్‌..
Otr Gangadhara Nellore

Otr Gangadhara Nellore

Off The Record: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. మొత్తం ఆరు మండలాల్లో జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో కూటమి ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఇక్కడ వైసీపీ ఏకంగా నాలుగు జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకోగా, టీడీపీ రెండిటితో సరిపెట్టుకుంది. ఇక ఎంపీటీసీల్లో కూడా ఇలాంటి లెక్కలే ఉన్నాయి. వైసీపీ 39, టీడీపీ 36 స్థానాలను సాధించగా, మూడు మండలాల్లో వైసీపీ ఎంపీపీలు కుర్చీల్లో కూర్చున్నారు. దీంతో… నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అంతర్మధనం మొదలైందంటున్నారు. ఇదే సమయంలో సర్పంచ్‌ ఎన్నికల్లో అయినా సత్తా చాటకుంటే… కష్టమన్న అభిప్రాయం బలపడిందట స్థానిక అధికార పార్టీ నేతల్లో. మొత్తం 140 గ్రామ పంచాయతీలు ఉండగా.. 138 చోట్ల ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటివరకు 8 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, అందులో ఏడు టీడీపీ ఖాతాలో, ఒకటి వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఓవరాల్‌గా గ్రామ పంచాయతీల్ని స్వీప్‌ చేసి తన పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలనుకుంటున్నారట ఎమ్మెల్యే థామస్.

అయితే… పరిషత్‌ ఎన్నికల్లో పరాభవానికి కారణాలపై నియోజకవర్గ తెలుగుదేశం శ్రేణుల్లోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి‌. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు,మండల స్థాయి నాయకుల మధ్య సమన్వయం లోపించడం వల్లే వ్యవహారం బెడిసికొట్టందని ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నారు తమ్ముళ్ళు. పార్టీ అధికారంలోకి వచ్చాక తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన పాత కార్యకర్తలను పట్టించుకోకపోవడం, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు కోటరీగా చేరిపోవడంలాంటి ఒరిజినల్‌ టీడీపీ కేడర్‌లో అసంతృప్తిని రగిల్చాయట‌‌‌. మరోవైపు, పరిషత్‌ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. టీడీపీలో ఉంటూనే కొందరు సొంత పార్టీ అభ్యర్థులకు ఓటు వేయకుండా వెన్నుపోటు పొడిచారని, వైసీపీ నేతలతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని, తన దగ్గర అందుకు సంబంధించి 15 ఆడియోలు ఉన్నాయని ఎమ్మెల్యే చెప్పడం పార్టీలో మరింత అగ్గి రాజేసిందట. అటు పరిషత్‌ ఫలితాలపై అధిష్టానం క్లాస్ పీకడంతో ఎమ్మెల్యే థామస్ వైఖరిలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అంటున్నారు టీడీపీ నాయకులు కొందరు. ఆ క్లాస్‌ కారణంగానే… ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే, తప్పులు పునరావృతం కాకుండా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారని చెప్పుకుంటున్నారు.

ప్రతిరోజూ ఆరు మండలాల్లోని నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేయడం అందులో భాగమేనని అంటున్నారు. గతంలో మాదిరిగా కాకుండా, ఈసారి అన్ని చోట్ల మండల నాయకులకే పూర్తి స్వేచ్ఛనిస్తూ.. “మీరే అందరికీ ఆమోదయోగ్యమైన మంచి అభ్యర్థిని ఎంపిక చేసి గెలిపించుకోండంటూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. ఇది చూస్తున్నవాళ్ళంతా…. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యేలో చాలా మార్పు తెచ్చాయని, అందుకే ఆయన పాత పద్ధతులు మార్చుకుని అందరితో కలుస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. అయితే… ఎమ్మెల్యే ఎంతగా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నప్పటికీ, లోలోపల ఓ రకమైన భయం ఉందట. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నాయకులు సర్పంచ్ ఎన్నికల్లో తనకు పూర్తిస్థాయిలో సహకరిస్తారా లేక మళ్లీ హ్యాండ్ ఇస్తారా అన్న టెన్షన్‌ పెరుగుతోందని చెబుతున్నారు ఆయన సన్నిహితులు. ఇక మిగిలిన గ్రూపులు, అసమ్మతి వర్గాలు కూడా ఎంతవరకు కలుస్తాయన్న సందేహాలు కూడా ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. ఒకవైపు అధిష్టానం ఒత్తిడి, మరోవైపు సొంత పార్టీలోనే గ్రూపుల కుమ్ములాటల మధ్య సర్పంచ్ ఎన్నికలు ఎమ్మెల్యేకు పెద్ద పరీక్షగా మారాయాని చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో.