NTV Telugu Site icon

Off The Record: బీఆర్ఎస్‌తో తెగిన బంధం.. పొంగులేటి దారెటు..?

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

Off The Record: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయంగా పట్టున్న నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అలాంటి నేతకు బిఆర్ఎస్‌తో సంబంధాలు తెగిపోయాయ్. ఇప్పుడు ఆయన ఏ పార్టీ వైపు వెళతాడన్నది ఆసక్తికరంగా మారింది. నాలుగేళ్ల నుంచి బిఆర్ఎస్ అధిష్టానంపై మాజీ ఎంపి పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో…పొంగులేటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ…2019 పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ సీటు ఇవ్వలేదు. అప్పటి నుంచి పొంగులేటిని పార్టీ అధినేత కేసిఆర్ దగ్గరకు రానివ్వడం లేదన్నది జనమెరిగిన సత్యం. కేసీఆర్ దగ్గరకు రానివ్వకపోయినప్పటికీ…పార్టీ నాయకత్వం అంతా ఆయన చుట్టే తిరిగింది. ఎమ్మెల్యేలు పొంగులేటి వద్దకు వెళ్లకపోయినా…జిల్లాలో రాజకీయం ఆయన చుట్టే తిరిగింది.

బీఆర్ఎస్‌లో పొంగులేటి పని అయిపోయిందని అన్నప్పుడల్లా…పొంగులేటి, కేటీఆర్‌ సమావేశం కావడం…కేటిఆర్‌కు బొకేలు ఇచ్చిరావడం జరుగుతోంది. ఇది బీఆర్ఎస్‌ శ్రేణులను గందరగోళంలో పడేసింది. అసలు పొంగులేటి బిఆర్ఎస్‌లో ఉన్నారా ? ప్రతిపక్షంలో ఉన్నారా అన్న చర్చ కూడా జిల్లాలో చాలా కాలం సాగింది. పొంగులేటి మాత్రం జిల్లాలో ఎప్పుడు అసంతృప్తివాదిగానే ఉండిపోయాడు. ఆ అసంతృప్తి వాది ఇప్పుడు బిఆర్ఎస్‌కు పంటి కింద రాయిలా తయారయ్యాడు. మూడు నెలలుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ టార్గెట్‌గా పొంగులేటి విమర్శలు చేస్తున్నారు. పొంగులేటి జిల్లాకే పరిమితం కాకుండా రాష్ర్టవ్యాప్తంగా ఉన్న అసంతృప్తి నేతలను…ఏకతాటిపైకి తీసుకొస్తున్నాడట. దీంతో ఇక లాభం లేదనుకున్న బిఆర్ఎస్ నాయకత్వం వేటు వేసింది.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేయడంతో…ఖమ్మం జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఆయన్ను టార్గెట్‌ చేస్తూ…అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పొంగులేటిని చేర్చుకోవద్దని..జాతీయ పార్టీలకు సలహాలు ఇస్తున్నారట. ఇప్పటి వరకు పొంగులేటి అడుగులు బిజెపి వైపు అంటూ ప్రచారం సాగింది. కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలంటూ…ఆ పార్టీ నేతలు ఆహ్వానిస్తూనే ఉన్నారు. చర్చలు జరపుతున్నామని భట్టి విక్రమార్క చెబుతుంటే…తనకు మంచి స్నేహితుడంటూ రేవంత్‌ చెప్పుకొస్తున్నారు. జిల్లా నేతలు కూడా పొంగులేటి దగ్గరకు వెళ్లి కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తే బాగుంటుందని చెబుతున్నారట. ఇలాంటి సమయంలో పొంగులేటి చేసిన వ్యాఖ్యలు…కాంగ్రెస్‌ శ్రేణులకు పాలు పోసినట్లుగా మారిందట.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ పార్టీకి మంచి పట్టు ఉందంటూ కామెంట్ చేశారు పొంగులేటి. దీంతో ఆయన కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారా అనే చర్చ సాగుతోంది. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉన్నట్లు స్పష్టమైంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్ధి రేణుకచౌదరి…ఖర్చు పెట్టకుండానే స్వల్ప మెజారిటీతో ఓటమి పాలవడం…హస్తం పార్టీకి బలమెంటో చెప్పకనే చెబుతోంది. ఈ కారణంగానే కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాలో…కాంగ్రెస్ వైపే పొంగులేటి పయనం ఉంటుందని నేతలు చర్చించుకుంటున్నారు.

పొంగులేటి మిత్రుడిగా ఉన్న జూపల్లితో బిజెపి నాయకత్వం చర్చలు జరిపిందట. దీంతో పొంగులేటి కూడ బిజెపి వైపు వెళతాడా అన్న చర్చ ఒకవైపు నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో…పొంగులేటి బిజెపి వైపు మొగ్గు చూపుతాడా.. లేక కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అనుచరవర్గం మాత్రం…బిజెపి వైపు మొగ్గు చూపుతున్నాడని భావిస్తున్నారు. పొంగులేటి తనకు మంచి స్నేహితుడని…బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కొండా వ్యాఖ్యలు… ఈటల రాజేందర్‌తో పొంగులేటికి ఉన్న అనుబంధం చూస్తే…ఆయన బిజెపి వైపు మొగ్గు చూపించవచ్చని చర్చించుకుంటున్నారు. రెండు జాతీయ పార్టీల నుంచి పొంగులేటి ఆహ్వానాలు వస్తున్నప్పటికీ…తన నెక్స్ట్‌ స్టెప్‌ ఎంటన్న దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ నెలలోనే పొంగులేటి భవిష్యత్‌ కార్యాచరణపై ప్రకటన చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పొంగులేటి ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియదు కానీ…జిల్లాలో మాత్రం రాజకీయంగా వేడి రగిలిస్తోంది.