Off The Record: ప్రస్తుతం ముందస్తు మంత్రం జపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం. ఎన్నికలు ముందే ముంచుకొచ్చేస్తున్నాయని, అందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని పదే పదే పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఉద్భోధిస్తున్నారు టీడీపీ ముఖ్య నేతలు. కేవలం చెప్పడమే కాదు, పార్టీ ఆఫీస్‌లో కూడా ఆ దిశగా కదలికలు కన్పిస్తున్నాయట. ఇంతకు ముందులా కాకుండా.. చాలా తొందరగానే అభ్యర్థుల ఖరారు కసరత్తు మొదలు పెట్టేసింది టీడీపీ నాయకత్వం. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే రాష్ట్రం సంగతి తెలియదు కానీ.. టీడీపీలో మాత్రం ముందస్తు హడావుడి స్పష్టంగా కన్పిస్తోందంటున్నాయి రాజకీయ వర్గాలు. మరోవైపు అధికార పార్టీ మాత్రం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లరని.. ఐదేళ్లు కంప్లీట్‌గా పాలన పూర్తి చేశాకే.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని స్పష్టంగా చెబుతోంది. నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళే అలా చెబుతుంటే. టీడీపీ ఎందుకు పదే పదే ముందస్తు కామెంట్లు చేస్తోందనేదే ఇప్పుడు హాట్ టాపిక్.
టీడీపీ ముందస్తు మంత్రం జపించడానికి కారణం లేకపోలేదనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పైకి లేదు లేదంటున్నా…అధికార పార్టీ కదలికలు ముందస్తు దిశగానే ఉన్నాయన్నది ప్రతిపక్షం అంచనా అట. అస్సలు తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదనే భ్రమలో ప్రతిపక్షాలను ఉంచి.. సడెన్‌గా ఎన్నికలకు వెళ్తే.. అన్ని రకాలుగా దెబ్బతీయవచ్చన్న వ్యూహంతోనే…. వైసీపీ నేతలు పైకి ముందస్తు లేదని అంటున్నారన్నది టీడీపీ ముఖ్యుల అభిప్రాయంగా చెబుతున్నారు. అందులో భాగంగానే ఢిల్లీ పెద్దలను అన్ని రకాలుగా ఒప్పించి రకరకాల మార్గాల నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ డెఫిసిట్ రూపంలో భారీగా నిధులు వచ్చాయని.. అలాగే బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీతో మరిన్ని నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తోందని అంటున్నారు టీడీపీ నేతలు. ఇలా భారీ స్థాయిలో నిధులను సమీకరించుకుని.. వివిధ వర్గాలకు సంక్షేమ పథకాల్ని అమలు చేసి.. ఎన్నికలకు వెళ్తారనే టాక్ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. రైతులకు రుణమాఫీ వంటి పథకాన్ని ప్రకటించడమే కాకుండా.. దాన్ని అమలు చేసి.. ఎన్నికలకు వెళ్తే.. తిరుగుండదనే వ్యూహంతో వైసీపీ ఉందనేది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. దీనికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్‌గా సమీకరించుకుంటోందనే అనుమానం టీడీపీ వర్గాల్లో ఉందట. ఈ సంగతి తెలిసే.. టీడీపీ ముమందస్తు జాగ్రత్త పడుతోందట.
అయితే ఇదే సమయంలో మరో చర్చా జరుగుతోంది. ముందస్తు ప్రచారాన్ని టీడీపీ వైపు నుంచి ముమ్మరంగా చేయడం ద్వారా జగన్ ప్రభుత్వం…. పరిపాలన చేతగాక చేతులేత్తేసిందనే ప్రచారాన్ని ప్రజల్లోకి పంపవచ్చన్న వ్యూహంగా కూడా ఉందంటున్నారు. వివిధ రంగాల్లో ప్రభుత్వం సరిగా వ్యవహరించ లేక పిల్లి మొగ్గలు వేస్తోందనే ఆరోపణలు ఓ వైపు పెద్ద ఎత్తున చేస్తూనే.. మరోవైపు ముందస్తు కామెంట్లతో జగన్ పాలనపై ప్రజల్లో చర్చ పెట్టాలన్నది టీడీపీ ప్లాన్ అట. ఇదే వాయిస్‌తో ప్రతిపక్ష పార్టీ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి.. ఇబ్బందులు పెడుతున్న అధికారుల జోరుకు కళ్లెం వేయవచ్చన్నది కూడా వ్యూహంలో భాగమని అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో కానీ.. పోలీసుల్లో కానీ మార్పు కన్పిస్తుంది. దీన్ని ముందే తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా ఈ కామెంట్లు చేస్తున్నారనేది ఓ వాదన. ఈ తరహాలో ముందస్తు కామెంట్లు వెనుక రకరకాల వ్యూహాలు.. ఆలోచనలు.. ఉన్నట్టు సమాచారం.. ఇలా అన్నింటినీ బేరీజు వేసుకునే టీడీపీ ముందస్తు మంత్రాన్ని జపిస్తోందని అంటున్నాయి పార్టీ వర్గాలు.
