Site icon NTV Telugu

Off The Record: సీన్‌ సితారైందా..? సొంత నియోజకవర్గంలోనే ఉమా ఉక్కిరి బిక్కిరవుతున్నారా?

Devineni

Devineni

Off The Record: ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో ఒకప్పుడు కీలక నేతగా ఉన్నారు దేవినేని ఉమామహేశ్వరరావు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ళపాటు మంత్రిగా పనిచేసిన దేవినేని జిల్లాలో రాజకీయంగా పట్టుసాధించి సొంత పార్టీలోని ఇతర నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేశారట. చాలా మంది సీనియర్స్‌కు చెక్‌పెట్టి జిల్లాలో ఏది జరగాలన్నా, ఏం చేయాలన్నా కనుసైగతో శాసించేవారని పార్టీ వర్గాలే చెబుతాయి. కానీ ఇప్పుడు సీన్ సితారైందట. మేటర్‌ మొత్తం రివర్స్ అయి ఉమ్మడి జిల్లా సంగతి తర్వాత సొంత నియోజకవర్గం మైలవరంలోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.

నాడు దేవినేని ఉమాకు ప్రత్యామ్నాయమే లేదనే పరిస్థితి నుంచి ఇప్పుడు ఆయనకసలు టికెట్ ఇవ్వద్దు. రేస్‌లో మేమున్నామంటే మేం ఉన్నామంటూ ఒకరికి ఇద్దరు నాయకులు పార్టీ అధిష్టానాన్ని కలిసినట్టు తెలిసింది. మొన్నటి వరకు ఉమాకు పోటీగా బొమ్మసాని సుబ్బారావు, కాజా రాజ్ కుమార్ వంటి వారు వచ్చారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి మాలో ఎవరికి ఇచ్చినా ఓకే.. కానీ… ఆయనకు మాత్రం వద్దని అధిష్టానం దగ్గర ఐక్యతారాగం పాడుతున్నారట. వీళ్ళకి ప్రత్యక్షంగానే ఎంపీ కేశినేని నాని మధ్దతు పలకగా ఈ క్రమంలో అసలు ఉమాకి టికెట్ ఉంటుందా ఉండడా అనే స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విషయం తెరమరుగవటంతో ఉమా హమ్మయ్య అని ఊపిరి తీసుకునేలోపే… వెంకట ప్రసాద్ అనే దేవినేని రమణకు స్నేహితుడు తెరమీదకు వచ్చాడట. చనిపోయిన తన అన్న స్నేహితుడు తనకు పోటీగా రావడంతో ఏం చేయాలో అర్ధంగాక తలపట్టుకుంటున్నారట ఉమా మహేశ్వరరావు.

అసలు ఉమా లాంటి నాయకుడు ఉన్న నియోజకవర్గంలో తాము పోటీ చేస్తామంటే తాము చేస్తాం అంటూ ఎందుకు ఇంతమంది ముందుకు వస్తున్నారన్న చర్చ పార్టీ ముఖ్య నాయకుల మధ్య మొదలైనట్టు తెలిసింది. ఈ క్రమంలో అందరి ఫోకస్ తన మీదకు వచ్చేలా ఇటీవల ఉమా కామెంట్స్‌ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా కొందరు నాయకులకు వస్తున్నట్టు తెలిసింది. ఇటీవల ఉమా నందిగామలో మాట్లాడుతూ అధికారంలో ఉన్నపుడు బలుపు కారణంగా ఓడిపోయామని చేసిన కామెంట్స్‌పై గట్టి చర్చే జరిగింది. ఆయనకు ఇప్పుడు తత్వం బోధపడిందా లేక అటెన్షన్ కోసం ఇలా అన్నారా అని అప్పట్లోనే మాట్లాడుకున్నారు. ఈ చర్చకు బలం చేకూర్చే విధంగా ఉమా తాజాగా… తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని మరో కామెంట్ చేశారు. దీంతో ఆయన అటెన్షన్, సానుభూతి కోసం ఏదో ఒకటి మాట్లాడుతున్నారన్న వాదన పార్టీలోనే బలపడుతోందని తెలిసింది. ఉమా తాజాగా చేసిన కామెంట్స్‌కు పార్టీలోనే నెగిటివ్ టాక్ వస్తోందట. అసలు ఆయన్ని చంపాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది? ఎందుకు ఉంటుందని ప్రశ్నించడంతోపాటు … అలా చంపేవాళ్ళు ఎవరుంటారని సెటైర్లు కూడా వేస్తున్నారట కొందరు టీడీపీ నేతలు. కేవలం పోయిన ఇమేజ్ ను తిరిగి తెచ్చుకునేందుకు మాత్రమే.. ఉమా ఏకంగా తానే పోతాననే స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారని గుసగుసలాడుకుంటున్నాయి మైలవరంలో టీడీపీ వర్గాలు. వాస్తవానికి మైలవరంలో ఉమాకు ప్రత్యామ్నాయంగా వేరే నేత పార్టీ నుంచి లేకున్నా… అధికారంలో ఉన్నపుడు ఆయన వ్యవహరించిన తీరుతో నొచ్చుకున్న నియోజకవర్గంలోని కొందరు… ఈసారి పోటీకి కాలు దువ్వుతున్నారన్నది లోకల్‌ టాక్‌. ఉమా వ్యతిరేక వర్గానికి కేశినేని నాని పూర్తిగా సహకరించటంతో మైలవరంలో రాజకీయం మలుపులు తిరగదడం కొసమెరుపు.

Exit mobile version