Off The Record: డిప్యూటీ సీఎం, వైసిపి సినియర్ నేత నారాయణస్వామి…మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా ఎలాంటి ఇబ్బందులు పడలేదు. డిప్యూటీ సిఎం అయ్యాక మాత్రం రాష్ట్రంలో ఏ మంత్రి అనుభవించని ఇబ్బందులు అనుభవిస్తున్నారట. సమస్యలు కంట్రోల్ అవ్వకపొగా…రోజూరోజుకు పెరుగుతున్నాయట. చిత్తూరు జిల్లా అంటే గ్రూప్ పాలిటిక్స్‌కి కేరాఫ్ అడ్రస్. అయితే గంగాధర నెల్లూరులో పీక్ స్టేజ్‌కు చేరిందట. నియోజకవర్గంలో గంగాధర్ నెల్లూరు, పెనుమూరు, వెదురుకుప్పం, ఎస్ఆర్ పురం, కార్వేటినగరం మండలాల్లో గ్రూపు రాజకీయాలు వైసిపిలో పెరిగిపోతున్నాయ్. నియోజకవర్గంలో పైసా ఖర్చు చేయని వారికి కాంట్రాక్ట్ పనులు, పదవులు ఇచ్చారని…స్థానిక నేతలు, పార్టీ కోసం పని చేసిన వారు గుర్రుగా ఉన్నారట.
ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్లిన నారాయణస్వామికి.. ఈ తలనొప్పి మాత్రం తగ్గడం లేదట. ఇప్పటి వరకు కింది స్ధాయిలో ఉన్న విభేధాలు కాస్తా…నేరుగా డిప్యూటీ సిఎం నారాయణస్వామి వరకు వచ్చినట్లు చర్చ సాగుతోంది. ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డికి.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వర్గాల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు.. ఆ పార్టీ మండల కమిటీ అధ్యక్షుల నియామకంతో బయటపడ్డాయి. సర్పంచ్ ఎన్నికల్లో మొదలైన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయట. ఎంతలా అంటే ఏకంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసీలు.. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నారాయణస్వామిని తిట్టేంతలా ఉన్నాయట.
డిప్యూటీ సిఎం మీద ఉండే వ్యతిరేకత కాస్తా ఇప్పుడు అధినేతపై కోపం వచ్చేలా చేస్తున్నాయట. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమికి…డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఏకపక్ష నిర్ణయాలేనని వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. జగన్ కష్టపడి అధికారం సంపాదిస్తే…మంత్రి నారాయణ స్వామి, ఆయన వర్గం…పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకుని సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టిస్తున్నారంటూ ఫైరవుతున్నారు. ఈ గ్రూపులు ఒకవైపు వేడి ఎక్కిస్తుంటే…మరోవైపు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నారాయణ స్వామికి నిరసనల సెగ ఎక్కువైంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా అదే సీన్ రిపీట్ అవుతోందట. తమ సమస్య పరిష్కరించ లేదని స్దానిక ప్రజలు…డిప్యూటీ సిఎంను నిలదీస్తున్నారు. నారాయణస్వామి సైతం…సమాధానం చెప్పలేక కొన్నిసార్లు ఇబ్బందులు పడుతున్నారనేది సొంత పార్టీ నేతల టాక్. పెనుమూరు మండలంలోనూ స్థానికులు….పలుమార్లు డిప్యూటీ సీఎంను నిలదీశారు. ఎన్ని కల సమయంలో మాత్రమే కనిపిస్తావ్… ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చావు….నువ్వు మాకు ఏం చేసేది లేదు. ఎందుకు వచ్చావంటూ మోహన్‌రెడ్డి అనే అడ్వకేట్ ప్రశ్నించారు. తర్వాత కలికిరిలోనూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. మీ అనుచరులు నాడు నేడు పనుల్లో అవినీతి చేసి, బిల్లులు అధికంగా పెట్టాలని… హెచ్ఎంను ఇబ్బంది పెడుతుంటే మీరు ఎందుకు వాళ్లను సపోర్టు చేస్తున్నారంటూ… గ్రామస్థులు నిలదీశారట.
తాజాగా కార్వేటినగరం బీసీ కాలనీలో ఓ నిరుద్యోగి జాబ్ క్యాలెండర్, డీఎస్సీ నిర్వహణ గురించి గట్టిగా ప్రశ్నించారు. ఇలా ఎక్కడ లేదా విధంగా డిప్యూటీ సిఎం నారాయణ స్వామికి నిరసన సెగ తగులుతోందట…ఒకవైపు గ్రూపులు, మరోవైపు గడపగడపకు కార్యక్రమంలో నిరసనల సెగతో మంత్రి తెగ ఇబ్బందులు పడుతున్నారని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. జిల్లాలో ఇతర వైసిపి నేతలు సైతం నారాయణ స్వామికి ఇంత కష్టం వస్తుందని ఊహించని విచారం వ్యక్తం చేస్తున్నారట. ఒకరిని కంట్రోల్ చేయలేక…మరొకరికి సమాధానం చెప్పలేక నారాయణ స్వామి నలిగిపోతున్నారనే మాటలు జిల్లా వైసిపిలో హాట్ హాట్ టాపిక్‌గా మారింది.