NTV Telugu Site icon

Off The Record: MLC ఏకు మేకవుతుంటే ఎందుకు సైలెంట్ ? MLA ల రహస్య సమావేశమేంటి ?

Cong

Cong

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌ను వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. కానీ… దగ్గరుండి వాటిని పరిష్కరించాల్సిన ఎఐసిసి నాయకులు మాత్రం పత్తా లేకుండా పోయారట. పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారని, ఓ మంత్రిని రోడ్డుకీడ్చే పని చేశారన్న ప్రచారం జరుగుతున్నా… అసలు అందులో వాస్తవం ఎంత? ఏం జరిగిందన్న సంగతిని పట్టించుకునేవాళ్ళే లేకుండా పోయారన్న టాక్‌ నడుస్తోంది పార్టీ వర్గాల్లో. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో కూడా చర్చించలేని పరిస్థితి సమస్య జటిలం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విషయ తీవ్రత దృష్ట్యా కనీసం సరిదిద్దే ప్రయత్నం అయినా.. ఎందుకు చేయడం లేదన్నది నాయకుల ప్రశ్న. అటు బీసీ కులగణనను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించింది ప్రభుత్వం. కానీ… ప్రతిపక్షాల కంటే ముందే…ఆ నివేదిక తప్పంటూ పరుషంగా కామెంట్లు చేశారు సొంత పార్టీ ఎమ్మెల్సీ ఒకరు. ఇది పార్టీకి పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది. సర్వే చేసిన సొంత పార్టీ ఎమ్మెల్సీ ఇలాంటి నెగెటివ్‌ చర్చకు తెరలేపడంతో… చేసిన పనిని చెప్పుకోవడం పార్టీకి తలకు మించిన భారంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సదరు ఎమ్మెల్సీని అభ్యర్థిగా ఎంపిక చేస్తున్న టైంలోనే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయట. పార్టీకి ప్రస్తుతం తలనొప్పిగా మారిన సదరు ఎమ్మెల్సీ వ్యవహారంపై సీనియర్ నేతలు కూడా అసంతృప్తి, అభ్యంతరాలను కూడా వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అభ్యర్ధిత్వం టైంలోనే… చాలామంది సీనియర్స్‌ వ్యతిరేకించినా… రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి పట్టుబట్టి టికెట్ ఇప్పించారన్నది ఇంటర్నల్‌ వాయిస్‌. అంతా తెలిసి కూడా… అప్పుడు టికెట్ ఇప్పించిన మేడం… ఇప్పుడు సమస్య అయి కూర్చుంటే మాత్రం… సైలెంట్ గా ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా సమస్యలను దగ్గరుండి అటెండ్ చేయాల్సిన ఆమె… ప్రస్తుతం అడ్రస్‌ లేకుండా పోయారని చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. ఎమ్మెల్యేల మీటింగ్‌, ఎమ్మెల్సీ వ్యవహారంపై వారం రోజులుగా ఈ రచ్చ జరుగుతుంటే కనీసం అసంతృప్తి వ్యక్తం చేసే వారితో సమావేశాలను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం జరగలేదన్నది పార్టీలో చర్చ. సాధారణంగా ఎమ్మెల్సీతో సహా… ఏ అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడైనా… రాష్ట్ర నాయకుల అభిప్రాయాలన్నింటినీ సేకరించి అధిష్టానానికి నివేదిక ఇస్తారు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీలు. కానీ… ఇక్కడ మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ టికెట్ విషయంలోనూ, ప్రస్తుతం వివాదానికి కారణమైన ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు విషయంలోనూ హైకమాండ్‌తో నిమిత్తం లేకుండా రాష్ట్ర ఇన్ఛార్జ్‌నే ఎక్కువ చొరవ చూపారన్న అభిప్రాయం పార్టీలో ఉంది.

స్థానిక నాయకుల అభిప్రాయాలను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా…. ఇన్ఛార్జ్‌ వ్యవహరించడం వల్లే… వివాదాలు పెరుగుతున్నాయని, ఒక రకంగా వీటన్నిటికీ ఆమే మూల కారణం అన్న వాదన బలపడుతోందట కాంగ్రెస్‌ వర్గాల్లో. వ్యవహారం చినికి చినికి గాలివానలా మారి పార్టీకి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టినా ఎఐసిసి నాయకులు స్పందించకపోవడం పట్ల పార్టీలో కొందరు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఎఐసిసి నాయకులు ఉన్నారా లేరా అంటూ జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ కూడా ఇందులో భాగమేనంటున్నారు పరిశీలకులు. ఇప్పటికైనా ఏఐసీసీ పెద్దలు మేల్కొంటారా? లేదా? అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.