NTV Telugu Site icon

Off The Record: కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న పోలింగ్ తరువాత లెక్కలు..!

Cong

Cong

Off The Record: భువనగిరి సెగ్మెంట్‌లో రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు ట్రయాంగిల్ అవుతుందని భావించినా.. చివరి దశలో ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్మెంట్, పోలింగ్ జరిగిన తీరు చూసిన పరిశీలకులు.. ఫైట్ కాంగ్రెస్, బీజేపీ మధ్యే హోరా హోరీగా జరిగిందంటున్నారు. ఈ ఫైట్ లో విజయం ఎవరిది.. ఓటరు ఎవరివైపు మెగ్గుచూపారు.. పార్టీల కీలక నేతల ప్రచారాల ప్రభావం ఏమేరకు ఉంటుంది.. అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. రెండు పార్టీల కీలక నేతలు గెలుపుపై ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా విజయం మాదే అని మొదటి నుంచి ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు.. పొలింగ్ తరువాత లెక్కలు కలవరపాటుకు గురిచేస్తున్నాయట…

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో 75 వేల ఓట్లు దాటని కమలం పార్టీ.. రెండున్నర లక్షలకు పైగా ఓట్ల మెజారీటి సాధించిన కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వడం వెనక మతలబ్ ఏంటా అని ఆరాతీస్తున్నారట కాంగ్రెస్ నేతలు. క్షేత్రస్థాయిలో లెక్కలు, అంచనాలు ఆ పార్టీ నేతలను కలవర పెడుతున్నా.. విజయంపై ధీమాగా ఉన్నారట కాంగ్రెస్ నేతలు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఎన్నికలకు నియోజకవర్గ ఇంచార్జిగా వ్యవహరించగా, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. మొదటి నుంచీ గెలవాలని పట్టుదలగా వున్న బీజేపీ కూడా అమిత్ షా, జేపీ నడ్డాలతో ప్రచారాన్ని హోరెత్తించింది. దీంతో రెండు పార్టీల మధ్య పోరు హోరాహోరిగానే సాగిందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది, అయితే విజయం ఎవరిని వరిస్తుందో అనే టెన్షన్ మాత్రం రెండు పార్టీల నేతలకు తప్పడం లేదట.

వరుసగా మూడోసారి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బూర నర్సయ్య గౌడ్ ఒకసారి కారు గుర్తుపై గెలిచి, రెండోసారి అదే పార్టీ తరపున స్వల్పతేడాతో ఓడి.. మూడోసారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మూడు నెలలకు ముందుగానే ఎన్నికల ప్రచారం ప్రారంభించగా.. మూడు సార్లు బరిలోకి దిగిన అనుభవం, బీసీ కార్డు, మోడీ చరీష్మా, బీజేపీ హవా… అర్బన్ ఓటింగ్ తమకు కలిసివస్తాయని… అవన్నీ వర్కౌట్ అయితే భువనగిరి కోటపై కాషాయం జెండా ఎగరడం ఖాయమేనని అంటున్నారు బీజేపీ నేతలు. ఇటు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల బాధ్యతలు తీసుకోవడం వల్లే కాంగ్రెస్ ఈ స్థాయిలో ప్రభావం చూపగలిగిందని.. లేకుంటే పరిస్దితి మరోలా ఉండేదని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు కోమటిరెడ్డి అనుచరులు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు రాజగోపాల్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారని.. తనని చూసి ఓటెయ్యండని ఆయన ప్రజల దగ్గరికి వెళ్లారని గుర్తు చేస్తున్నారు రాజగోపాల్ అనుచరులు.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకీ అనుకూల, ప్రతికూల ప్రభావాలపై కోమటిరెడ్డి బ్రదర్స్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? దీనిపై ఎవరికి తోచినట్టు వారు విశ్లేషిస్తున్నారు. గెలిస్తే ఆ క్రెడిట్ తమదే అని కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పుకుంటారని.. ఓడితే ఆ నెపం కేండిడేట్ చామలపైకి నెట్టేస్తారని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారట. గెలిస్తే ఆ క్రెడిట్ ఎవరికి వెళ్లాలో వారికి వెళుతుంది. మరి ప్రతికూల ఫలితం వస్తేనే ఇక్కడ క్వశ్చన్. ఇంచార్జ్‌గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూర్తి బాధ్యత ఆయనే తీసుకుంటారా.. లేక అభ్యర్ధిపైకి నెట్టేస్తారా అన్నదే ఇక్కడ డిస్కషన్ పాయింట్. మొత్తంగా భువనగిరి ఎన్నిక ఫలితం బరిలోకి దిగిన బీజేపీ నేతకు… ఇంచార్జ్ బాధ్యతలు తీసుకున్న కాంగ్రెస్ నేతకు కీలకంగా మారిందనడంలో సందేహం లేదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Show comments