Site icon NTV Telugu

Off The Record: లోక్‌సభ అభ్యర్థులపై కాంగ్రెస్ యూ-టర్న్..!

T Cong

T Cong

Off The Record: తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా కోసం కసరత్తు చేస్తోంది పార్టీ అధినాయకత్వం. మెజారిటీ నియోజకవర్గాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ… పెండింగ్‌లో ఉన్న 13 నియోజకవర్గాల నేతల నుంచి గాంధీభవన్‌లో అభిప్రాయ సేకరణ జరిపారట. అయితే… సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిందని ఓవైపు చర్చ జరుగుతున్న సమయంలో… ఇప్పుడు కొత్తగా అభిప్రాయ సేకరణ ఎందుకన్న వాదన కూడా పార్టీలో బలంగా వినిపిస్తోంది. గాంధీభవన్‌లో లేటెస్ట్‌ మీటింగుల వెనక వ్యూహం ఏంటని గుసగుసలాడుతున్నారు నాయకులు. అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీకి వచ్చాక అభిప్రాయ సేకరణ జరపడంపై రకరకాల అనుమానాలు సైతం పెరుగుతున్నాయి పార్టీ వర్గాల్లో. అయితే ఎట్టి పరిస్థితుల్లో లెక్క తేడా రాకూడదన్నది పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగానే ఈ వ్యవహారం జరుగుతోందన్న అభిప్రాయం కూడా ఉంది.

అంతవరకు అయితే ఓకేగానీ… సీఈసీ సమావేశం తర్వాత ఆలోచన ఏమైనా మారిందా..? అనే చర్చ కూడా నడుస్తోంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విస్తృతంగా చర్చే జరుగుతోంది. అదే సమయంలో కష్ట కాలంలో కూడా పార్టీ వెన్నంటి ఉన్న వాళ్లకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్‌ సైతం గట్టిగానే వినిపిస్తోంది. ఆ విషయంలో ఇంకా స్పష్టత లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి పార్లమెంటు ఎలక్షన్స్‌లో ఛాన్స్‌ ఇవ్వాలా? వద్దా? అన్న విషయంలో కూడా స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారట నేతలు. ఒకరికే రెండు అవకాశాలు ఇస్తే… మిగిలిన వారికి అన్యాయం చేసినట్టు అవుతుందన్న అభిప్రాయం కూడా ఉంది పార్టీలో. అయితే పార్టీ అధిష్టానం మాత్రం గెలుపే ప్రధాన లక్ష్యంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తోంది. నిజామాబాద్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకుల పేర్లను ఇన్నాళ్లు పరిశీలించింది హైకమాండ్‌. అవే పేర్లు ఫైనల్ అంటూ ప్రచారం జరిగింది.

కానీ.. తిరిగి అభిప్రాయ సేకరణ అంటూ చర్చలు మొదలు పెట్టడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి టికెట్లు ఇవ్వాలా? వద్దా అన్న రీ థింకింగ్‌ మొదలైందా అన్న డౌట్స్‌ వస్తున్నాయట పార్టీ నేతలకు. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది అనే పరిస్థితి నుండి.. వ్యవహారం మొదటికి వచ్చిందా..? పార్టీ అగ్ర నాయకత్వం జిల్లా నాయకుల అభిప్రాయాలను అందుకే తీసుకుంటోందా అన్న వాదన సైతం వినిపిస్తోంది. ఇదే క్రమంలో పార్టీల రెండు వాయిస్‌లు గట్టిగా వినిపిస్తున్నాయి. కొత్త వారికి అవకాశం ఇవ్వద్దు అనేది ఒకటైతే… అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వొద్దన్ది సెకండ్‌ వాయిస్‌. ఈ పరిస్థితుల్లో పార్టీ హై కమాండ్‌ నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో జీవన్ రెడ్డిని… నిజామాబాద్ సీటు నుండి బరిలో దించే అవకాశాలు పరిశీలించింది పార్టీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు కూడా జీవన్ రెడ్డి పేరును సూచించారు. ఇక నాగర్ కర్నూల్ సీటు కోసం మల్లు రవి.. సంపత్ ఇద్దరు పోటీ పడుతున్నారు. ఎవరికి వారు సీటు నాదే అంటున్నారు. సంపత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఇద్దర్నే టార్గెట్‌ చేసుకుని కొందరు అసెంబ్లీ ఎన్నికల లింక్‌ పెట్టారా అన్న చర్చ సైతం జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్‌ వర్గాల్లో. దీంతో ఇప్పటికే కసరత్తు పూర్తయిన సీట్లను ప్రకటిస్తారా? లేక మరోసారి రివ్యూ చేస్తారా అన్న సందేహాలు పెరుగుతున్నాయి.

Exit mobile version