Site icon NTV Telugu

Off The Record: కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య తెగని సీట్ల పంచాయితీ..?

Cong Left

Cong Left

Off The Record: తెలంగాణలో పొత్తుల తెరలు తొలిగిపోతున్నాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని ప్రాధమిక అవగాహనకు వచ్చేశాయి. అయితే … సీట్ల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ తమను నిలువునా ముంచిందంటున్న కామ్రేడ్స్‌… ఆ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికార పార్టీకి గుణపాఠం చెప్పాలని కసిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలు అటు కాంగ్రెస్ కి కూడా కీలకం. అందుకే.. సీట్ల సర్దుబాటు విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. కమ్యూనిస్టులు కలిసి వస్తే బలం పెరుగుతుందన్న విషయం నిజమే అయినా…. ఇబ్బడి ముబ్బడిగా టికెట్లు ఇవ్వాలంటే కష్టమన్నది కాంగ్రెస్‌ ఆలోచన. అటు లెఫ్ట్‌ పార్టీలు కూడా మరీ మూర్ఖంగా వెళ్ళకుండా… తమ ప్రాబల్యం ఉన్నచోటనే సీట్లు అడగాలని భావిస్తున్నారు. చర్చలు ఆ దిశగానే జరుగుతున్నట్టు తెలిసింది. సీట్ల సర్దుబాటులో మిగతా జిల్లాల సంగతి ఎలా ఉన్నా….ఉమ్మడి ఖమ్మం విషయంలోనే పీటముడి పడింది.

పాలేరులో పోటీ చేయాలని సీపీఎం, కొత్తగూడెం బరిలో ఉండాలని సిపిఐ భావిస్తున్నాయి. కొత్తగూడెం నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు పోటీ చేయాలనుకుంటున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే ఈ రెండు సీట్లు కమ్యూనిస్టులకు ఇవ్వడానికి కాంగ్రెస్ కొంత ఆలోచనలో పడింది. కాంగ్రెస్‌లో ఇటీవల చేరిన మాజీ ఎంపీ పొంగులేటి కొత్తగూడెంలో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. అలాంటప్పుడు పొంగులేటిని కాదని కాంగ్రెస్‌ కొత్తగూడెం సీటును సిపిఐకి ఇచ్చే అవకాశం లేదు. అందుకే ఆ సీటును కాంగ్రెస్‌కే వదిలేయాలని సిపిఐ ముందు పార్టీ ఇన్చార్జి ఠాక్రే ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది.

మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ భవిష్యత్తును ఇంకా నిర్ణయించుకోలేదు. ఇప్పటివరకు ఉన్న వాతావరణాన్ని బట్టి చూస్తే… కాంగ్రెస్‌లోకి వెళ్లాలని తుమ్మల మీద ఆయన అనుచరులు వత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు తుమ్మల కాంగ్రెస్‌లోకి వెళ్తే… పాలేరు నుంచి పోటీ చేస్తారని చర్చ నడుస్తోంది. అయితే…ఆయన్ని ఖమ్మం లో పోటీ చేయించమని సిఫారసు చేస్తున్నారట కామ్రేడ్స్‌. కమ్మ సామాజిక వర్గం ఖమ్మం నియోజకవర్గంలో ఎక్కువ. దీనికి తోడు ఉభయ కమ్యూనిస్టులకు అక్కడ పట్టు ఉంది. అది తుమ్మలకు కలిసి వస్తుందని కూడా కాంగ్రెస్‌ నాయకత్వానికి లెక్కలు చెబుతున్నారట కామ్రేడ్స్‌. ఇలా ఇద్దరు నాయకుల పోటీపై క్లారిటీ రాకపోవడంతో లెఫ్ట్‌, కాంగ్రెస్‌ మధ్య సీట్ల సర్దుబాటు పెండింగ్‌లోపడ్డట్టు తెలిసింది. మొత్తంగా కామ్రేడ్లతో కలిసి పని చేయాలని కాంగ్రెస్ ఫిక్స్ అయింది. అయితే సీట్ల సర్దుబాటు ఎలా జరుగుతుందన్నదే ఆసక్తికరంగా మారింది.

Exit mobile version