Site icon NTV Telugu

Off The Record: బీఆర్‌ఎస్‌ది ఒంటరి పోరాటమేనా? కూటమిలో ఆ పార్టీకి చోటు లేదా?

Brs

Brs

Off The Record: బీజేపీ వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇప్పటికే బీహార్ సిఎం నితీశ్ కుమార్ పలు రాజకీయ పార్టీల నాయకులతో భేటీ అయ్యారు. ఈనెల 23న పాట్నాలో ప్రతిపక్ష నేతల సమావేశం ఖరారైంది. కమలం పార్టీకి వ్యతిరేకంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆ మీటింగ్‌లో చర్చించే అవకాశం ఉంది. బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యాసాధ్యాలను పక్కనపెడితే…అసలు ఆ జట్టులో ఎవరెవరు ఉంటారు? కీలక బాధ్యతలు ఎవరివన్న చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోంది. అంత చర్చ జరుగుతున్నా… జాతీయ రాజకీయాల్లో, దేశంలో గుణాత్మక మార్పు తేవాలని ఉవ్విళ్ళూరుతూ… జాతీయ పార్టీగా మారిన బీఆర్‌ఎస్‌ గురించిన ప్రస్తావన రాకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. అటు పాట్నాలో జరగబోయే మీటింగ్‌కు కూడా బీఆర్‌ఎస్‌ నాయకత్వానికి ఆహ్వానంలేదు. ఎందుకు అందలేదన్న చర్చ ఓవైపు జరుగుతుండగానే.. అది బీజేపీకి వ్యతిరేకంగా జరిగే మీటింగ్‌ అయినా… కాంగ్రెస్‌తో కలిసి వేదిక పంచుకునే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేస్తున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు.

Read Also: Off The Record: బండి సంజయ్‌కి ఏమైంది..? ఆ మాటలు నిజమేనా?

విపక్షాల భేటీకి సమయం దగ్గర పడుతున్న వేళ NCP అధినేత శరద్ పవార్ BRS పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. BRS బీజేపీకి బీ టీమ్ అన్నారు పవార్‌. ఇటు కొంత కాలంగా తెలంగాణ కాంగ్రెస్ కూడా BRS, బిజెపి ఒక్కటే అన్న వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది. మరోవైపు బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణకు సిద్ధమైన కేసీఆర్ ఎన్నికలకు ముందు ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వైపు బిజెపిపై పోరాటం చేస్తూ…ఇటు ఆ పార్టీకి వ్యతిరేకంగా జట్టు కడుతున్న విపక్ష కూటమికి దూరంగా ఉంటూ ఆయన ఏం చేయాలనుకుంటున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. విపక్ష కూటమి… బీజేపీతోపాటు బీఆర్‌ఎస్‌ను కూడా టార్గెట్‌ చేస్తే… గులాబీ పార్టీ నేతల స్పందన ఎలా ఉంటుందన్న ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో BRS పాత్ర సింగిలా? మింగిలా? అని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. సింగిల్‌ అయితే బలం సరిపోతుందా? లేక విపక్షాలతో మింగిల్‌ అవ్వాలంటే బీజేపీకి బి టీమ్‌ కాదని వాళ్ళని ఎలా నమ్మిస్తారన్నది బీఆర్‌ఎస్‌ నాయకత్వం ముందున్న సవాల్‌. కీలక సమయాల్లో రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో దిట్ట అయిన కేసీఆర్‌ దీన్ని ఎలా డీల్‌ చేస్తారో చూడాలి.

Exit mobile version