NTV Telugu Site icon

Off The Record: అసెంబ్లీ వ్యూహంపై బీఆర్‌ఎస్‌లో గందరగోళంలో ఉందా..?

Brs

Brs

Off The Record: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పొలిటికల్ హీట్‌ పుట్టిస్తున్నాయి. అయితే ఇక్కడే బీఆర్‌ఎస్‌ కాస్త గందరగోళంలో ఉందన్న చర్చ జరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. లగచర్ల భూ సేకరణ వివాదం నెల రోజుల నుంచి రాజకీయంగా నలుగుతోంది. ఈ ఎపిసోడ్‌లో ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ పార్టీని డిఫెన్స్‌లో పడేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది గులాబీ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా సిటీ ఏర్పాటు ప్రయత్నం చేసింది ప్రభుత్వం. మాకొద్దంటూ అక్కడి రైతులు తిరగబడుతున్నారని, వాళ్ళకు మా మద్దతు ఉంటుందని చెప్పింది బీఆర్‌ఎస్‌ అధిష్టానం. అక్కడికి వెళ్ళిన కలెక్టర్‌ మీద దాడితో దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. మేటర్‌ ముదిరి రచ్చ రచ్చ అయ్యాక లగచర్ల వ్యవహారంపై స్పష్టమైన ప్రకటన చేసింది ప్రభుత్వం. అక్కడ ఫార్మా సిటీ ఏర్పాటు చేయట్లేదని, ఇండస్ట్రియల్‌ కారిడర్‌ కోసమే భూ సేకరణ చేస్తున్నామని చెప్పింది. అయితే.. అంతకు ముందు కలెక్టర్‌, ఇతర అధికారుల మీద దాడి కేసులో కొందరు రైతుల్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. వాళ్ళలో ఒక రైతుకు ఆరోగ్యం బాగోకపోవడంతో.. చేతులకు బేడీలతోనే.. ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిన వెంటనే ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు. సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంది సర్కార్‌.

Read Also: Rajagopal Reddy: ఎన్టీఆర్‌ గార్డెన్‌లో అసెంబ్లీ నిర్మాణం జరిగితే బాగుంటుంది.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

అయినా సరే… అది పొలిటికల్‌గా టర్న్‌ అయింది. ప్రభుత్వ పెద్దలు సీరియస్‌ అయినా… బాధ్యులైన పోలీసుల మీద చర్యలు తీసుకున్నా… బీఆర్‌ఎస్‌ మాత్రం వదిలిపెట్టడం లేదు. సర్కార్‌ని ఇరుకున పెట్టడానికి ఇది తమకు అందివచ్చిన సువర్ణావకాశంగా భావిస్తోందట పార్టీ అధిష్టానం. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిన ఘటన ఎంతలా డ్యామేజ్ చేసిందో తెలుసు గనుక దీన్ని కూడా ఆ స్థాయికి తీసుకువెళ్ళాలన్నది ప్లాన్‌ అని మాట్లాడుకుంటున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు. అందుకే అసెంబ్లీలో సోమవారం రోజు ఈ అంశం మీద వాయిదా తీర్మానం ఇచ్చింది గులాబీ పార్టీ. స్పీకర్‌ దాన్ని తిరస్కరించాక కూడా… చర్చ కోసం పట్టుబట్టడంతో గొడవ అయింది. ఆ క్రమంలోనే.. సభ వాయిదా పడింది. దాంతో బయట కూడా ఇదే లగచర్ల అంశంపై గట్టిగా మాట్లాడారు బీఆర్‌ఎస్‌ సభ్యులు. తిరిగి మంగళవారం కూడా ఇదే పాయింట్‌ మీద నిరసన తెలిపేందుకు నల్ల చొక్కాలు వేసుకొని, చేతులకు బేడీలు తగిలించుకుని వెళ్లారు. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్ళే రైతు చేతికి బేడీలు ఎలా వేస్తారని నిలదీయడంతో పాటు.. దీన్ని జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలన్నది ప్రతిపక్షం ప్లాన్‌గా చెప్పుకుంటున్నారు. రెండో రోజు కూడా ఇదే అంశం మీద వాయిదా తీర్మానం ఇవ్వడంతో పాటు చర్చకు పట్టుబట్టింది బీఆర్‌ఎస్‌.

Read Also: Vizag Honey Trap Case: సంచలనం సృష్టించిన విశాఖ హనీట్రాప్ కేసు.. వెలుగులోకి మరో ట్విస్ట్..!

రైతులకు వ్యతిరేకంగా ఏం జరిగినా…అది ఏ స్థాయిలో జనంలోకి వెళ్లి డ్యామేజ్‌ ఎంత జరుగుతుందో బీఆర్‌ఎస్‌కు స్వానుభవం ఉంది కాబట్టే…. ఇంతలా సాగదీస్తున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. నాడు ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీల ఎపిసోడ్‌ తర్వాతే తమ పార్టీ, ప్రభుత్వం మీద వ్యతిరేకత గట్టిగా మొదలైందని నమ్ముతోందట బీఆర్‌ఎస్‌ అధిష్టానం. అందుకే ఈ ఛాన్స్‌ మిస్సవకూడదన్న టార్గెట్‌తో పావులు కదుపుతున్నారన్న విశ్లేషణలున్నాయి. ఇదే సమయంలో మరో చర్చ కూడా జరుగుతోందట బీఆర్‌ఎస్‌ వర్గాల్లో. జనంలోకి తీసుకువెళ్ళాల్సినవి, చర్చించాల్సినవి ఇంకా చాలా అంశాలున్నాయని, కేవలం లగచర్ల మీద ఫోకస్‌ పెట్టడం వల్ల ఆ విషయాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఛాన్స్‌ మిస్‌ అవుతున్నామని అంటున్నారట కొందరు పార్టీ నాయకులు. ఆరు గ్యారెంటీల అమలు, రైతులకు మద్దతు ధర, నిరుద్యోగం లాంటి వాటిని కూడా ఎత్తుకుంటే… కచ్చితంగా ఉక్కిరి బిక్కిరి చేయవచ్చని, అన్నిటినీ వదిలేసి కేవలం లగచర్ల చుట్టూనే తిరిగితే ఎంత వరకు ఉపయోగం అన్న చర్చ కూడా జరుగుతోందట గులాబీ సర్కిల్స్‌లో. నాటి ఖమ్మం పరిస్థితులకు, నేటి లగచర్ల స్థితికి తేడా ఉందన్నది కూడా కొందరి అభిప్రాయం అట. రాబోయే రోజుల్లో సభలో బీఆర్‌ఎస్‌ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి మరి.

Show comments