NTV Telugu Site icon

Off The Record: ఆ జిల్లాపై బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు ఫోకస్ పెట్టింది..?

Otr Brs

Otr Brs

Off The Record: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గంపై బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఫుల్‌ ఫోకస్‌ పెట్టిందట. ప్రత్యేకించి కేసీఆర్‌ ఈ వ్యవహారాన్ని పర్సనల్‌గా తీసుకున్నారట. అక్కడున్న సీనియర్‌ లీడర్‌కు గట్టి గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట. ఇంతకీ ఆ సీటు విషయంలో కేసీఆర్‌ ఎందుకంత పట్టుదలగా ఉన్నారు? ఆయన కత్తులు నూరుతున్న ఆ సీనియర్‌ ఎవరు?

కామారెడ్డి జిల్లా బాన్సువాడ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరపున గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి.. పార్ల మెంట్ ఎలక్షన్స్‌ తర్వాత.. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ హోదా కల్పించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఐతే పోచారం చేరికను వ్యతిరేకించిన హస్తం పార్టీలోని కొందరు నేతలు.. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వెంట నడుస్తున్నారట. దీంతో నియోజకవర్గ పార్టీలో రెండు వర్గాలు సై అంటే సై అంటున్న పరిస్థితి. ఈ పోరు తారా స్థాయికి చేరుతూ కాంగ్రెస్‌ పెద్దలకు తలనొప్పిగా మారుతోందని అంటున్నారు. ఉప్పు-నిప్పులా ఉన్న పోచారం, ఏనుగు వర్గాలను కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. చేతులు కలవడం లేదట. సరిగ్గా ఇక్కడే తన ఆలోచనకు పదునుపెడుతున్నారట గులాబీ బాస్‌. బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి తెలుసుకున్న కేసీఆర్‌… ఆ నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టాలని తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు చెప్పుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డికి ఐదేళ్లు మంత్రిగా.. మరో ఐదేళ్లు స్పీకర్‌గా అవకాశం దక్కింది. తాను అంత మర్యాద ఇచ్చి గౌరవిస్తే, ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా పార్టీ మారి ద్రోహం చేశారంటూ కేసీఆర్‌ కోపంగా ఉన్నట్టు తెలిసింది.

మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారినా అంతగా ఫీల్ అవ్వని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పోచారం వ్యవహారాన్ని మాత్రం జీర్ణించుకోలేక పర్సనల్‌గా తీసుకున్నట్టు సమాచారం. మాజీ స్పీకర్ పార్టీ మారాక బాన్సువాడలో గులాబీ పార్టీ దాదాపు ఖాళీ అయ్యింది. ఉన్న కొద్ది మంది తమను నడిపించే నాయకుడు లేక అయోమయంలో పడ్డారట. దీంతో ఇక్కడ పుల్ ఫోకస్ పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డిని ఢీ కొట్టే నేత కోసం అన్వేషిస్తోందట అధిష్టానం. ఈ క్రమంలోనే 2004లో పోచారంను ఓడించి సంచలనం సృష్టించిన బాజిరెడ్డి గోవర్దన్ ను బాన్సువాడ ఇంచార్జ్‌గా నియమించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. బాన్సువాడలో బాజిరెడ్డికి క్యాడర్ ఉండటం, మాస్ లీడర్ గా ఉన్న గుర్తింపు, బలమైన సామాజిక వర్గం కలిసొస్తాయని లెక్కలేసుకుంటోందట బీఆర్‌ఎస్‌ అధిష్టానం. బాజిరెడ్డి.. ఇటీవల మీడియా సమావేశం పెట్టి పోచారం రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని, తాను ఆయన మీద బరిలో దిగుతానని ఛాలెంజ్‌ చేయడం అందులో భాగమేనంటున్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఆందోళన కార్యక్రమాల్లోనూ.. బాజిరెడ్డి బాన్సువాడలో పాల్గొని పోచారంను టార్గెట్ చేశారు. ఇలా… బాజిరెడ్డి ఇటువైపు దృష్టి పెడితే…. రాజకీయ సమీకరణాలు మారి పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశగా ఉన్నారట గులాబీ నేతలు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల.. అనర్హత పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలతో.. పోచారంపై వేటు తప్పదా అనే చర్చ కూడా మొదలైందంటున్నారు. ఇలా ఓవైపు పార్టీలో వర్గపోరు, మరో వైపు గులాబీ బాస్ ఎత్తులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట మాజీ స్పీకర్‌. మరి బీఆర్‌ఎస్‌ వ్యూహం ఫలిస్తుందా? బాజిరెడ్డి పోచారంను ఢీకొడతారా.. అన్నది తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.