NTV Telugu Site icon

Off The Record: గులాబీ పార్టీలో క్రాస్ ఓటింగ్ జరిగిందా..?

Nzb Brs

Nzb Brs

Off The Record: పార్లమెంట్ ఎన్నికలు ఇందూరు గులాబీ పార్టీలో చిచ్చు పెట్టాయట. తమ అభ్యర్ధి గెలవరు అనుకున్నారో.. గెలవద్దు అనుకున్నారో తెలియదు కానీ.. లీడర్ల నుంచి క్యాడర్ వరకు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని అంతా అనుకుంటున్నారు. పోలింగ్ సరళిని చూసి ఖంగుతిన్న సదరు అభ్యర్ధి అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అంటూ నిట్టూరుస్తున్నారట. ఇంటి దొంగలను పట్టుకునేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇంతకీ గులాబీ పార్టీ క్రాస్ ఓటింగ్ ఏ జాతీయ పార్టీని గెలిపించబోతుంది. క్రాస్ ఓటింగ్ పార్టీ వ్యూహమా..? లేక క్యాడర్ నిర్ణయమా.. ?

నిజామాబాద్ పోలింగ్ సరళి గులాబీ పార్టీని గుబులు పుట్టిస్తోంది. బీఆర్ఎస్ ఓట్లు చీలిపోయాయని ఆఫ్ ది రికార్డుగా చర్చ జరుగుతుండటం ఆ పార్టీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ పోటీ చేశారు. మాస్ లీడర్ గా ఉన్న గుర్తింపు, మూడు నియోజకవర్గాల్లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కలిసొస్తుందని గులాబీ ఏరికోరి బాజిరెడ్డికి టికెట్ ఇచ్చింది. అధినేత నమ్మకాన్ని వమ్ము చేయవద్దని.. ఏడు పదుల వయస్సులో బాజిరెడ్డి కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ గెలుపు కోసం తిరిగారు. అధినేత బస్సుయాత్ర సైతం జోష్ తేవడంతో గెలుపుపై కామన్‌గానే ధీమా వ్యక్తం చేశారు. అయితే అనుకుందొక్కటి.. అయ్యిందొక్కటి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. గులాబీ ఓట్లు భారీగా చీలిపోయాయని నిజామాబాద్‌ టౌన్‌లో చర్చ జరుగుతోంది. బాజిరెడ్డి గోవర్దన్ గెలవద్దు అనుకున్నారో.. గెలవలేరు అనుకున్నారో తెలియదు కానీ.. గులాబీ ఓట్లు భారీగా చీలిపోయినట్లు గుర్తించారట.

నిజామాబాద్ లోక్ సభ స్ధానంలో విజయంపై బీజేపీ -కాంగ్రెస్ పార్టీల నేతలు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అర్వింద్, కాంగ్రెస్ అభ్యర్ధి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య పోటాపోటీగా ఫైట్ జరిగింది. పోలింగ్ సరళి తమకంటే తమకు అనుకూలమంటూ రెండు జాతీయ పార్టీలు అంచనాలు వేస్తున్నాయి. పైగా మూడో పార్టీ నుంచి భారీగా ఓట్లు చీలినట్లు, అవి ఠంచనుగా తమకే పడినట్లు కాంగ్రెస్, బీజేపీ అంచనా వేస్తున్నాయట. రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గులాబీ పార్టీ నేతలు క్రాస్ ఓటింగ్ మీద నిగ్గు తేల్చేందుకు పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్లను లెక్క గడుతున్నారట. పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచింది ఎవరంటూ ఆరా తీస్తున్నారట. గులాబీ పార్టీ ఓట్లు క్రాస్ అయ్యాయన్నది పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్న మాట. అయితే ఆ ఓట్లు ఎవరికి పడ్డాయన్నది అంతు చిక్కడం లేదని చెబుతున్నారు. కొన్ని సెగ్మెంట్లలో గులాబీ ఓటర్లు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపారని, మరికొన్ని చోట్ల కాషాయానికి జై కొట్టారని రూమర్స్ నడుస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల పుణ్యమాని జరిగిన క్రాస్ ఓటింగ్ పార్టీలో చిచ్చు పెడుతోందని కేడర్ అంటోంది. క్రాస్ ఓటంగ్ ప్రచారం ఎలా ఉన్నా.. ఇందూరు విజేత ఎవరన్నది తేలాలంటే వచ్చేనెల 4వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ టెన్షన్ భరించాల్సిందే!

Show comments