NTV Telugu Site icon

Off The Record: విచారణలకు బీఆర్‌ఎస్ భయపడుతోందా..?

Otr Brs

Otr Brs

Off The Record: తెలంగాణ బడ్జెట్‌ రోజున అసెంబ్లీకి కేసీఆర్‌, పార్టీ ఓడిపోయాక సభకు అదే మొదటిసారి, ముందు జరిగిన రెండు సెషన్స్‌కు డుమ్మా, మళ్ళీ ఆరు నెలల దాకా కేసీఆర్‌ సభలో కనిపించరా?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం ఓ విషయంలో భయపడుతోందా? సై..సై.. అంటూ సర్కార్‌ సభలో కాలు దువ్వుతున్నా… బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆ విషయాన్ని వినీ విననట్టుగా ఎందుకు వదిలేశారు? గతానికి భిన్నంగా ఇప్పుడు అసెంబ్లీలో కనిపిస్తున్న దృశ్యం ఏంటి? మామూలుగా అయితే ఎంక్వైరీకి ప్రతిపక్షాలు పట్టుబట్టాలి. కానీ… ప్రభుత్వమే కమిటీ వేస్తామంటే… ప్రతిపక్షం కామ్‌గా ఉంటోంది ఎందుకు? బీఆర్‌ఎస్‌ భయపడుతోందా అన్న చర్చ అసలెందుకు మొదలైంది? తెలంగాణ అసెంబ్లీలో ఇంతకు ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉండేది వ్యవహారం. గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా కాంగ్రెస్ నుంచి వచ్చే ప్రతి డిమాండ్‌కు సై.. సరేనంటూ సమాధానం వచ్చేది అధికారపక్షం వైపు నుంచి. కానీ… అదే బీఆర్‌ఎస్‌ విపక్షంలోకి వచ్చాక వైఖరి మారినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. సమస్య ఏదైనా సరే… విచారణకు సిద్ధమా అంటే… సిద్ధమా అన్నట్టుగా ఉండేది గతం. ఈ క్రమంలోనే… గత సమావేశాల్లో… విద్యుత్ కొనుగోలులో ఒప్పందాలపైచర్చ సందర్భంగా… దమ్ముంటే విచారణకు ఆదేశించండి అంటూ సవాల్ విసిరారు బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి. అందుకు ప్రతిస్పందనగా… జ్యుడీషియల్ విచారణకి ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. అదొక్కటే కాదు…సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపైకూడా ఇదే తరహా డిమాండ్స్‌ రాగా… ప్రభుత్వం సీరియస్ గానే స్పందిస్తూ న్యాయ విచారణకు ఆదేశించింది. ఆయా కమిషన్ల విచారణలు కొనసాగుతున్నాయి. అందులో… విద్యుత్ కొనుగోళ్లపై వేసిన కమిటీ చైర్మన్ వ్యవహార శైలిని తప్పుపడుతూ… సుప్రీం కోర్టుకు వెళ్లారు మాజీ సీఎం కేసీఆర్. ఆ కమిషన్‌ విచారణను నిలిపేయాలంటూ కోర్ట్‌ గడప తొక్కారాయన. అయితే… కమిటీ చైర్మన్‌ను మార్చాలంటూ ఊరట దక్కింది తప్ప… విచారణ నుంచి తప్పించుకోలేకపోయారాయన.

ఛైర్మన్‌ను మార్చి విచారణ కొనసాగించమని తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్ట్‌. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నిటి మీద విచారణకు సిద్ధంగా ఉంది రేవంత్‌ సర్కార్‌. ఆ క్రమంలోనే… ఇటీవల బడ్జెట్‌పై చర్చ సందర్భంగా గొర్రెల పథకంతో పాటు మరో రెండు అంశాలపై కూడా విచారించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కావాలని అడిగే దమ్ము మీకుందా అంటూ బీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరారు సీఎం రేవంత్‌. గతంలో అయితే… మేం సిద్ధమంటూ ప్రతి సవాల్‌ విసిరేవారు గులాబీ నేతలు. కానీ… ఈసారి గొర్రెల స్కామ్‌పై ముఖ్యమంత్రి చేసిన సవాల్‌కు సభలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎవ్వరూ స్పందించలేదు. పైగా ఆ అంశాన్ని దాటవేస్తూ చర్చలోకి వెళ్ళిపోయారు. దీన్ని గమనించాక కొత్త చర్చ మొదలైంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. వరుసగా జరుగుతున్న విచారణల దెబ్బకు బీఆర్‌ఎస్‌ లీడర్స్‌ భయపడ్డారా? అందుకే… ప్రభుత్వం వైపు నుంచి సవాళ్ళు వస్తున్నా… వినీ సభలో వినీ విననట్టు కామ్‌గా ఉంటున్నారా? అన్న ప్రశ్నలు వస్తున్నాయట. ఇప్పటికే విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల విచారణ కమిటీకి కొత్త చైర్మన్‌ను వేసేందుకు రెడీ అయిపోయింది రేవంత్‌ సర్కార్‌. ఆ దెబ్బకే తట్టుకోలేకపోతుంటే… మళ్ళీ సవాళ్ళు విసురుకుని కొత్త తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని గులాబీ లీడర్స్‌ అనుకుంటున్నారా అన్న చర్చ సైతం జరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. ఆ విషయంలో ఇంకా ముందుకు వెళితే రాజకీయానికి బదులు కమిటీల చుట్టూ తిరిగే పనే ఎక్కువ అవుతుందని అనుకుంటున్నారో ఏమోగానీ… ప్రభుత్వ సవాళ్ల స్వీకరణకు ప్రధాన ప్రతిపక్షం సిద్ధంగా లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. మొత్తంగా విచారణ కమిటీల దెబ్బకు బీఆర్‌ఎస్‌ పెద్దలు భయపడుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం వెదికే పనిలో బిజీగా ఉన్నారు పొలిటికల్ పండిట్స్‌.