NTV Telugu Site icon

Off The Record: తెలంగాణలో కమలం పార్టీ పాలసీ మారిందా?

Bjp

Bjp

Off The Record: లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయమై తెలంగాణలో అందరికంటే ఓ అడుగు ముందే ఉంది బీజేపీ. మొత్తం 17 స్థానాలకుగాను 15 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించిన వాటిలో ఐదు సీట్లు బీసీలకు ఇచ్చింది. అందులో కూడా ముదిరాజ్, గౌడ్, లింగాయత్‌లకు ఒక్కోటి చొప్పున, రెండు సీట్లు మున్నూరు కాపులకు కేటాయించింది. ఇక ఓసీలకు ఆరు టిక్కెట్లు దక్కాయి. అందులో బ్రాహ్మణ, వెలమలకు ఒక్కోటి చొప్పున, నాలుగు సీట్లు రెడ్లకు కేటాయించింది కమలం పార్టీ. ఇక రెండు ఎస్సీ, రెండు ఎస్టీ స్థానాల అభ్యర్థుల ప్రకటన కూడా జరిగిపోయింది. ఇంకా వరంగల్, ఖమ్మం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా ప్రకటించిన అభ్యర్థులల్లో సగానికిపైగా కొత్తవారే ఉండటంపై పార్టీలో చర్చ జరుగుతోంది. గెలుపు గుర్రాల పేరుతో పార్టీ లైన్‌ గురించి అవగాహన లేని వారు, కేవలం టిక్కెట్ల కోసమే పార్టీలో చేరిన వారిని ఎంకరేజ్‌ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది.

2019 లోక్ సభ ఎన్నికల కన్నా ముందు నుండి పార్టీలో ఉన్నవారు కేవలం నలుగురు మాత్రమే. రేపు ఒకవేళ ఓడిపోతే సదరు నేతలు బీజేపీలోనే ఉంటారన్న గ్యారంటీ ఉందా అన్న ప్రశ్న సైతం తలెత్తుతోందట. అదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకి చెక్ పెట్టి పార్టీ మారిన మాజీ ఎంపీ నగేష్‌కి టిక్కెట్‌ ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొని గత 15 రోజుల్లో బీజేపీలో చేరినవారు 8మంది ఉన్నారు. ఇందులో ఏడుగురికి బీజేపీ టిక్కెట్స్‌ ఇచ్చింది. ఇంకా చేరని, రెడీగా ఉన్న మరో నేతకు కూడా ఖాయమంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిని పక్కన పెట్టి,… తమకో అవకాశం ఇవ్వాలని పార్టీలో ఉన్న పాత నేతలు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా… కొత్త వారికే జై కొట్టింది పార్టీ అధిష్టానం. సిద్ధాంతాలు, పార్టీ కోసమే పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విధానాన్ని పక్కన పెట్టింది. గతంలో బీజేపీ పై విమర్శలు చేసిన వారిని, కార్యకర్తల మీద కేసులు పెట్టించిన వారికి సైతం టికెట్స్‌ ఇచ్చారన్న ఆవేదన కేడర్‌లో ఉందట. దశాబ్దాల తరబడి కష్టపడుతున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం బలంగా ఉంది పార్టీలో.

మోడీ వేవ్‌ ఉన్నందున పాత వారికి ఎక్కువ అవకాశాలు ఇస్తే బాగుండేదన్న ఫీల్‌ పెరిగిపోతోందంటున్నారు పార్టీ నేతలు. మహబూబ్ నగర్ , మెదక్ స్థానాల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన వారికే మరోసారి అవకాశం ఇవ్వడం ఓకే అనుకున్నా.. ఈ మధ్యనే జాయిన్ అయిన ఏడుగురికి ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు వస్తున్నాయి. వారిలో నాగర్ కర్నూల్ నుంచి ఎంపీ రాములు కుమారుడు భరత్‌, జహీరాబాద్‌లో బీబీ పాటిల్, హైదరాబాద్‌లో మాధవీలత, పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్, నల్గొండకు సైది రెడ్డి, మహబూబాబాద్‌కు సీతారాం నాయక్‌ను ఫైనల్‌ చేసింది పార్టీ. ఇక ఖమ్మం నుంచి జలగం వెంకటరావు పేరు దాదాపు ఖరారు అయినట్టేనని చెబుతున్నారు బీజేపీ నేతలు. వరంగల్ నుండి ఆరూరి రమేష్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆ సీటును ఆయనకే ఇచ్చే అవకాశం ఉంది. ఇలా ఇటీవలే చేరిన వారు, చేరబోతున్నవారు అంతా కలిపి మొత్తం 9 మందికి తెలంగాణ కాషాయ టిక్కెట్స్‌ ఖరారయ్యాయి, అవుతున్నాయి. దీన్నే జీర్ణించుకోలేకపోతున్నారట పాత బీజేపీ నేతలు. ఎన్నికల్లో గెలుపు ముఖ్యమే అయినా… కేవలం టిక్కెట్‌ కోసమే కండువా కప్పుకున్నవారిని నెత్తిన పెట్టుకోవడం ఎంత వరకు కరెక్ట్‌ అని అడుగుతున్నారట సగటు బీజేపీ నేతలు.