NTV Telugu Site icon

Off The Record: నరాలు తెగె టెన్షన్‌లో నేతలు.. అధికార, విపక్ష పార్టీల్లో రకరకాల లెక్కలు

Ap Re

Ap Re

Off The Record: తుఫాన్‌ తీరం దాటింది. దాని తాలూకూ విధ్వంసపు ఛాయలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అదంతా ఒక ఎత్తయితే… ఇప్పుడు లాభ నష్టాల లెక్కలు యమ జోరుగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నా… అంతకు మించిన హాట్‌ అసెంబ్లీ ఉంది కాబట్టి… ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా అదే టాపిక్‌. వైసీపీ పవర్‌ నిలబెట్టుకుంటుందా? కూటమి అధికారంలోకి వస్తుందా? ఎవరు అధికారం చేపట్టినా మార్జిన్‌ ఎంత ఉండవచ్చు? 2019తో పోల్చుకోవచ్చా? లేదా? లాంటి చర్చోప చర్చలు జరుగుతున్నాయి. సామాన్యుడి నుంచి పొలిటికల్‌ పార్టీల హెడ్డాఫీసులదాకా ఇదే సందడి. అధికార, విపక్ష పార్టీల నేతలు ఎవరి లెక్కల్లో వాళ్ళు మునిగి తేలుతున్నారు. నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయి సమాచారం తెప్పించుకుంటూ.. పార్టీ ఆఫీసుల సిబ్బంది విశ్లేషించుకుంటున్నారు. ఎవరికి వారు గెలుపుపై వారు ధీమాగా ఉన్నా.. బయట జరుగుతున్న చర్చలతో నమ్మకం స్థానంలో అనుమానాలు, భయాలు పెరుగుతున్నాయట. ఆ పార్టీ ఈ పార్టీ ఇని లేదు. అందరిలోనూ అదే భయం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఎవరి లెక్కలు వారికి పక్కాగా ఉన్నా… అందరిలోనూ మౌత్‌ టాక్‌ కన్ఫ్యూజన్‌ పెరుగుతోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. .మరో వైపు సట్టా బజార్‌లో కూడా ఒక క్లారిటీ లేనట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. సాధారణంగా సట్టా బజార్‌లో సర్వేలు చేయించుకుని మరీ బెట్టింగ్‌లు కడతారన్నది ఎక్కువ మంది చెప్పుకునే మాట. కానీ.. ఈసారి ఏపీ విషయంలో వాళ్ళు కూడా గందరగోళంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇటు వైసిపి…అటు కూటమి అభ్యర్థుల్లో పల్స్‌ రేట్‌ సర్రున పెరిగిపోతోందట. క్యాడర్ నుంచి బూత్ ల వారీగా సమాచారం సేకరిస్తున్న అభ్యర్థులు…లెక్కలతో కుస్తీలు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒక వైపు ఇలా ఉంటే… మరోవైపు టెన్షన్‌ తట్టుకోలేని, లేదా కాస్తంత బలమైన నెట్‌వర్క్‌ ఉన్న అభ్యర్థులు రకరకాల వేరే మార్గాల్లో సమాచారం తీసుకునే పనిలో ఉన్నట్టు తెలిసింది. తమకు నమ్మకమైన సంస్థలతో పోస్ట్ పోల్ సర్వేలు చేయించుకునేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారట. జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ ఉంది. ఇంకా 15 రోజులకు పైనే సమయం ఉండటంతో ఈలోపు పోస్ట్‌పోల్‌ సర్వేలతో తమ టెన్షన్‌ తగ్గించుకునే పనిలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నట్టు తెలిసింది. వరుసగా రెండు లేదా మూడు సార్లు గెలిచిన నాయకులే ఈ పోస్ట్‌పోల్‌ సర్వేలవైపు మొగ్గు చూపుతున్నారట. అటు రెండు పార్టీల అధిష్టానాలు ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు చేయిస్తున్నాయన్న సమాచారంతో పార్టీ ఆఫీసులకు ఫోన్లు చేసి అన్నా… మా సంగతేంటని అడుగుతున్నారట ఇంకొందరు అభ్యర్థులు. సొంత సర్వేలు చేయించుకునే వాళ్ళు మాత్రం ఒక రూపాయి ఖర్చయినా ఫర్లేదు… ఎక్కువ శాంపిల్స్‌ తీసుకోమని సిబ్బందిని పురమాయిస్తున్నట్టు తెలిసింది.

ఎన్నికల ఖర్చుతో పోలిస్తే అదెంత… రిజల్ట్‌ మనకు అనుకూలంగా వస్తే అదే చాలన్నది వాళ్ళ వెర్షన్‌గా తెలిసింది. ఖర్చు కోసం కూడా వెనకాడకుండా… నాలుగో తేదీదాకా ఆగలేక అభ్యర్థులే సర్వేలు చేయించుకుంటున్నారంటే… వాళ్ళ టెన్షన్‌ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా పోలింగ్ తర్వాత కొందరు అభ్యర్థులు ప్రశాంతంగా ఉంటే…. ఎక్కువ మందికి మాత్రం నరాలు తెగుతున్నాయట. మరి ఈ పోస్ట్ పోల్ సర్వేలతో అయినా వాళ్ళకు ఉపశమనం దొరుకుతుందో… లేక కాస్త తేడా కొట్టినట్టు కనిపిస్తే… ఇప్పుడు ఉన్నదానికి డబుల్‌ టెన్షన్‌ పెరుగుతుందో చూడాలి మరి.