Off The Record: వైసీపీ ఆవిర్భావం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా అండగా ఉన్న నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. అలాంటి నేత ఇప్పుడు ఆ పార్టీ నుంచి తప్పుకోవడం సంచలనమైంది. సౌమ్యుడు, వివాద రహితుడిగా పేరున్న వేమిరెడ్డి ఫ్యాన్ పార్టీకి ఎందుకు దూరం కావాల్సి వచ్చిందని ఆసక్తిగా ఆరా తీసినవాళ్ళకు కళ్ళు బైర్లు కమ్మే నిజాలు తెలుస్తున్నాయట. ఒక్కడు.. ఒకే ఒక్కడ నాయకుడి చిల్లర వ్యవహారాలను భరించలేకే ఆయన సైలెంట్‌గా సైడైపోతున్నట్టు తెలిసింది. ఎంత సవరదీసినా.. కుక్కతోక వంకరే అన్న వాస్తవాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన ఎంపీ మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో వేగడం ఇక నావల్ల కాదు బాబోయ్ అనుకుంటూ వైసీపీకి రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం మీద ప్రభావం చూప గలిగారు వేమిరెడ్డి. ప్రత్యేకించి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరపున మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తుండటంతో.. ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ విజయానికి పూర్తిగా సహకరించారన్నది లోకల్ టాక్. పార్టీ పవర్‌లోకి వచ్చాక అనిల్‌కు కేబినెట్ బెర్త్ దక్కింది. ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలన్న సామెతను అస్సలు ఒంటబట్టించుకోకపోగా.. దాన్ని రివర్స్‌లో అర్ధం చేసుకున్న మాజీ మినిస్టర్ దొరికిందే సందు అన్నట్టుగా చెలరేగిపోయారట. ఎలక్షన్‌కు ముందు ప్రతి చిన్న విషయాన్ని వేమిరెడ్డితో చర్చించి.. నువ్వే దైవం నువ్వే సర్వం అన్నట్టుగా ప్రవర్తించిన అనిల్.. కుర్చీ ఎక్కగానే.. తన వంకర బుద్ధిని ప్రదర్శించారట. విషయాలను చర్చించడమన్నది వ్యక్తిగతం. ఆయన సొంత వ్యవహారం అనుకున్నా.. అసలు నువ్వెవరు? నీకతేంది అన్నట్టు అహంకారం తలకెక్కినట్టు ప్రవర్తించారట. అదే సమయంలో అడ్డగోలు దందాలతో అరాచకాలకు తెరలేపినట్టు చెప్పుకుంటున్నాయి నెల్లూరు రాజకీయ వర్గాలు. వాటి గురించి, అనిల్ వల్ల పార్టీకి జరగబోతున్న నష్టం గురించి హై కమాండ్‌కు చెప్పినా స్పందన లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక వేమిరెడ్డి కామైపోయినట్టు తెలిసింది. ఆ ఫిర్యాదు వల్ల ప్రయోజనం లేకపోగా ఇద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయట. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో అనిల్‌కు మంత్రి పదవిపోగా.. ఆ స్థానంలో వచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డి.. వేమిరెడ్డితో సన్నిహితంగా ఉన్నారు. దానికి కూడా భరించలేనంత ఎసిడిటీ వచ్చిన అనిల్‌కుమార్ వర్గం.. ప్రభాకర్ రెడ్డి పుట్టిన రోజు ఫ్లెక్సీలను చింపేసి డైజిన్ ట్యాబ్లెట్ చప్పరించినంత రిలీఫ్‌గా ఫీలై శునకానందం పొందిందట. ఆ విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురైన వేమిరెడ్డి అతనికి నేనెంత చేశాను? ఇప్పుడేం చేస్తున్నాడని సన్నిహితుల దగ్గర వాపోయిట్టు ప్రచారం ఉంది.
చివరికి ప్రభాకర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు అవడాన్ని కూడా జీర్ణించుకోలేకపోయిన మాజీ మంత్రి.. ఆయన ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారన్నది వైసీపీ వర్గాల మాట. ఇక వేమిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమన్న ప్రతిపాదన వచ్చినప్పుడు నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి నియోజక వర్గాల్లో అభ్యర్థులను మారిస్తే బాగుంటుందని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. అదే సమయంలో కొన్నాళ్ళు మాజీ మంత్రి సైలెంట్ అవడంతో ఆయన స్థానంలో వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి పోటీలో ఉంటారన్న ప్రచారం జరిగింది. అదే టైంలో అధిష్టానం పెద్దల్ని కలిసి వచ్చిన అనిల్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం పెట్టి నా స్థానంలో రాజమాతను.. అంటే ప్రశాంతి రెడ్డిని రంగంలోకి తీసుకురావాలని.. కొందరు భావిస్తున్నారంటూ పరమ వెటకారంగా మాట్లాడారట. ఓవైపు అధిష్టానం తన సూచనల్ని పట్టించుకోకపోవడం, మరోవైపు అనిల్‌కుమార్ వర్గం చిల్లర వేషాలతో విసిగిపోయిన వేమిరెడ్డి.. రాజకీయ కార్యక్రమాలకు దూరం అయ్యారు. ఆ సమయంలో స్వయంగా జోక్యం చేసుకున్న సీఎం జగన్.. వేమిరెడ్డికి నచ్చజెప్పడంతో.. తిరిగి ఎంపీ యాక్టివిటీస్ మొదలయ్యాయి. అదే టైంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తెల్లరాయి.. క్వార్ట్జ్ తవ్వకాల వ్యవహారాలను అనిల్ కుమార్ కు అప్పగించారు. అటవీ, ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ ల్యాండ్స్‌లో సైతం అడ్డగోలుగా మైనింగ్ చేయడం, అడ్డు చెప్పిన వాళ్ళను అడ్డంగా నరికేస్తామని బెదిరించడం సంచలనం అయ్యాయి.
నిత్యం వందలాది లారీల్లో తెల్లరాయిని చెన్నై పోర్టుకు తరలిపోతోంది. బీభత్సంగా జరుగుతున్న అక్రమ రవాణా వెనక అనిల్ సన్నిహితులు ఉన్నారన్నది నెల్లూరు టాక్. వీళ్ళ దాష్టీకాలు ఏ రేంజ్‌లో ఉన్నాయంటే.. మైనింగ్ అనుమతులు ఉన్న ఇతర వ్యాపారులు కూడా తవ్విన ఖనిజాన్ని తమకే అమ్మాలని, అదీ కూడా తాము చెప్పిన రేటుకే ఇవ్వాలని షరతులు పెడుతున్నారట. లేదంటే లోడ్ లారీ చెక్‌పోస్ట్ దాటదని కూడా వార్నింగ్స్ ఇచ్చేశారట. ఈ దారుణాలను గనుల యజమానులు వేమిరెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఆయన తాడేపల్లి పెద్దల చెవిన వేశారట. అయినా స్పందన లేకపోగా.. సర్దుకుపోవాలన్న సలహా రావడంతో ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేనని అన్నట్టు తెలిసింది. ఈ వ్యవహారం జరుగుతుండగానే.. అనిల్‌కుమార్ కుమార్ యాదవ్‌ను నరసరావుపేట పంపింది అధినాయకత్వం. దీంతో నెల్లూరు సిటీ దీటైన అభ్యర్థిని దించాలని భావించారు వేమిరెడ్డి. కానీ అనూహ్యంగా పార్టీ అధిష్టానం మాజీ మంత్రి మద్దతుదారు, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్‌ను సమన్వయకర్తగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఎంపీ.. మైనార్టీ నేతనే ఎంపిక చేయాలని భావిస్తే.. తగిన అభ్యర్థిని తాను సూచించేవాడినని, ఎలాంటి సమాచారం లేకుండా అనిల్ అనుచరుడి పేరు ప్రకటించడం ఏంటని ప్రశ్నించినట్టు తెలిసింది. ఎన్నికల్లో తనను దెబ్బకొట్టేందుకే అనిల్ కుమార్ యాదవ్ తన అనుచరుడిని సమన్వయకర్తగా ఎంపిక చేయించుకున్నారని, తన ఓటమి కోసం అనిల్ వర్గీయులు ప్రణాళిక ప్రకారం పని చేస్తున్నారని వేమిరెడ్డి అభిప్రాయపడ్డారట. ఇలాంటి వాతావరణంలో.. పార్టీలో అడుగడుగునా తనకు అన్యాయం జరుగుతున్న పరిస్థితుల్లో వైసీపీలో ఉండి రాజకీయం చేయలేనని సన్నిహితులకు చెప్పి పక్కకు తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలాంటి పార్టీ పెద్దలు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా.. అంగీకరించలేదట వేమిరెడ్డి. అనిల్‌కుమార్ అరాచక ధోరణితో తానిక పడలేనని, అలాంటి విలువల్లేని వ్యక్తితో కలిసి పనిచేయడం కష్టమని తనను కలిసిన నేతలు అందరికీ ఎంపీ చెప్పినట్టు సమాచారం. ఏ కోశానా హుందాతనం, కనీస మర్యాద లేని నాయకులతో ఎలా వేగాలంటూ పార్టీ, ఎంపీ పదవులకు రాజీనామా చేశారట వేమిరెడ్డి. ఇదే అదనుగా ఆయనకు టచ్‌లోకి వెళ్తున్నారు టీడీపీ నేతలు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.