New Born Sold for Rs.800: నవమాసాలు మోసి కన్న బిడ్డను దారుణంగా అమ్మేసింది ఓ కసాయి తల్లి. ముక్కుపచ్చలారని 8 నెలల పసికందును రూ.800లకు బేరం పెట్టింది. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా ఖుంటా పోలీసు స్టేషన్ పరిధిలోని మహూలియా గ్రామంలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కరామి ముర్ము అనే ఒడిశా గిరిజన మహిళ రెండో సారి కూడా ఆడబిడ్డ పుట్టడంతో బాధపడి, తన ఎనిమిది నెలల కుమార్తెను దంపతులకు రూ.800కు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. కనికరం లేని ఆ తల్లిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తన భర్త పనిపై తమిళనాడుకు వెళ్లిన టైంలో.. ఆ మహిళ తన 8 నెలల ఆడబిడ్డను రూ.800కు మాహీ ముర్ము అనే వ్యక్తి మధ్యవర్తిత్వంతో ఫుల్‌మండి మరాండి, టుదుకుడ్ దంపతులకు విక్రయించింది. సోమవారం రోజు (జులై 3న) పసికందు అమ్మకం జరిగింది.
Also Read: Tamilnadu: ఇకపై అతిథుల డ్రైవర్లకు హోటళ్లలో వసతి, బాత్‌రూమ్‌లు తప్పనిసరి
తండ్రి ముసు ముర్ము తమిళనాడు నుంచి ఇంటికి తిరిగి వచ్చి అతని రెండవ కుమార్తె గురించి ఆరా తీస్తే.. అతని భార్య చిన్నారి చనిపోయిందని చెప్పింది. పొరుగువారు అతనికి ఒప్పందం గురించి తెలియజేశారు. ఏం జరిగిందో తెలిసిన తర్వాత సోమవారం కుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. “తమిళనాడు నుంచి నేను ఇంటికి వచ్చేసరికి నా చిన్న కూతురు కనిపించలేదు. అనంతరం నా భార్యను అడగగా.. బిడ్డ చనిపోయిందని చెప్పింది. పొరుగువారు జరిగిన విషయం చెప్పారు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను” అని పసికందు తండ్రి చెప్పాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ముసు భార్యను, బిడ్డను కొనుగోలు చేసిన దంపతులను, మధ్యవర్తిని మంగళవారం అరెస్టు చేశారు.
మయూర్‌భంజ్ పోలీసు సూపరింటెండెంట్ బత్తుల గంగాధర్ మాట్లాడుతూ, మహిళ తన చిన్నారితో వెళ్లి ఒంటరిగా తిరిగి వచ్చింది. చిన్నారి గురించి గ్రామస్తులు ఆమెను ప్రశ్నించగా.. ఆమె చనిపోయిందని కరామి చెప్పిందని ఆయన తెలిపారు. పోలీసులు పసికందును రక్షించి చైల్డ్ కేర్‌కు పంపినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
