NTV Telugu Site icon

ODI World Cup 2023: నేడు ఉప్పల్‌లో పాకిస్తాన్, నెదర్లాండ్స్‌ మ్యాచ్‌.. తుది జట్లు ఇవే! ఫాన్స్ సంగతేంటి?

Pakistan Vs Netherlands Match

Pakistan Vs Netherlands Match

Pakistan vs Netherlands Match at Uppal Stadium: వన్డే ప్రపంచకప్‌ 2023లో రెండో మ్యాచ్‌ హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఉప్పల్ వేదికగా పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఫేవరెట్‌గా ఉన్న పాక్‌.. రెండు వార్మప్‌ మ్యాచుల్లోనూ ఓడిపోవడం ఆ జట్టును ఆందోళన పరుస్తోంది. ప్రధాన టోర్నీలో పసికూన నెదర్లాండ్స్‌పై గెలిచి ఆత్మవిశ్వాసం నింపుకోవాలని చూస్తోంది. మరోవైపు క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న డచ్‌ టీమ్.. ప్రధాన టోర్నీలోనూ సత్తాచాటాలని భావిస్తోంది.

నెదర్లాండ్స్‌ను తక్కువగా అంచనా వేస్తే.. పాకిస్తాన్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే క్వాలిఫియర్స్‌లో వెస్టిండీస్‌ జట్టునే డచ్‌ టీమ్ చిత్తు చేసింది. ఆసియా కప్‌ వైఫల్యం పాక్ జట్టును వెంటాడుతోంది. అంతేకాదు నసీమ్ షా గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. దీంతో పాక్ బౌలింగ్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే పాకిస్థాన్‌ బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. నెదర్లాండ్స్‌పై గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఈ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ యాప్‌లో ఉచితంగా చూడవచ్చు. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి అభిమానులకు ఉప్పల్ మైదానంలో ఎంట్రీ ఉంటుంది. మ్యాచ్‌ జరిగే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్‌ కోసం 1200 మంది పోలీస్‌లతో భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్‌ కోసం 1200 మంది పోలీసులతో భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. అభిమానుల కోసం అర్ద రాత్రి వరకు మెట్రో రైల్వే సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్‌ 2023 ఆరంభ మ్యాచ్‌కు పెద్దగా సందడి కనిపించలేదు. నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మ్యాచుకు సగం స్టేడియం కూడా నిండలేదు. మ్యాచ్‌ ఆరంభంలో సుమారు 10 వేల మంది ప్రేక్షకులే కనిపించారు. 1.32 లక్షల సామర్థ్యం ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌ చివరి వరకూ 47వేల మంది మాత్రమే వచ్చారు. దాదాపు 40 వేల వరకు టికెట్లను మహిళలకు ఉచితంగా ఇచ్చారని తెలుస్తోంది. దాంతో నేడు ఉప్పల్‌ వేదికగా జరిగే మ్యాచ్‌కు ఎంతమంది హాజరవుతారో అని బీసీసీఐ ఆందోళన చెందుతోంది. ఎందుకంటే.. ఉప్పల్‌ మైదానంలో ఒక్క భారత్ మ్యాచ్ కూడా లేదు.

Also Read: Asian Games 2023: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. క్రికెట్‌లో పతకం ఖాయం!

తుది జట్లు:
పాకిస్తాన్: ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వాసిం, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్.
నెదర్లాండ్స్: విక్రమజీత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, వెస్లీ బరేస్సీ, బాస్ డి లీడే, తేజా నిడమనూరు/కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్, లోగాన్ వాన్ బీక్, సాకిబ్ జుల్ఫికర్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీర్కెరెన్, ఆర్యన్ దత్.