అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 23 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ నెల 3న అల్లవరం మండలం ఓడలరేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని దిఘా తీరానికి చేరుకున్న అనంతరం.. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ముందుగా కాకినాడకు, ఆపై ఓడలరేవుకు అధికారులు తీసుకొచ్చారు.
మత్స్యకారులు గ్రామానికి చేరుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందభాష్పాలతో వారిని ఆప్యాయంగా హత్తుకుని స్వాగతం పలికారు. 23 రోజుల పాటు తమవారి ఆచూకీ తెలియక తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబాల్లో ఇప్పుడు ఆనందం వెల్లివిరిసింది. ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడటంతో వారి ముఖాల్లో సంతోషం కనిపించింది. మత్స్యకారులు స్వగ్రామానికి వస్తున్నారన్న సమాచారంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామ ప్రవేశం సందర్భంగా వారికి పూలమాలలు వేసి, హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. తమవారు క్షేమంగా తిరిగి రావడంతో ఓడలరేవు గ్రామమంలో పండుగ వాతావరణం నెలకొంది. సముద్రంలో ఆచూకీ లేకుండా పోయిన తమ గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

